India Mart
-
‘ప్రపంచ నకిలీ మార్కెట్ల జాబితా 2021’ విడుదల.. అన్నీ నకిలీ ఉత్పత్తులే!
వాషింగ్టన్: కాపీరైట్ల ఉల్లంఘన, నకిలీ ఉత్పత్తులకు పేరొందిన మార్కెట్ల జాబితాలో భారత్‌కు చెందిన బీటుబీ ఈ కామర్స్ పోర్టల్ ఇండియమార్ట్.కామ్‌ను యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ తన తాజా జాబితాలోకి చేర్చింది. భారత్ నుంచి మరో నాలుగు మార్కెట్లు.. ముంబైలోని హీరా పన్నా, ఢిల్లీలోని ట్యాంక్ రోడ్, పాలికా బజార్, కోల్‌కతాలోని కిడ్డర్‌పోర్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ‘ప్రపంచ నకిలీ మార్కెట్ల జాబితా 2021’ను యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ (యూఎస్టీఆర్) గురువారం విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా 42 ఆన్లైన్, 35 భౌతిక మార్కెట్లకు ఇందులో చోటు కల్పించింది. ఇవన్నీ పెద్ద ఎత్తున నకిలీ ట్రేడ్‌మార్క్‌లు, కాపీరైట్ హక్కుల ఉల్లంఘనకు వీలు కల్పిస్తున్నట్టు నివేదిక పేర్కొంది. ‘‘నకిలీ, పైరేటెడ్ ఉత్పత్తులకు (కాపీరైట్ ఉన్న వాటికి నకిలీలు) సంబంధించి అంతర్జాతీయంగా నడుస్తున్న వాణిజ్యం అమెరికా ఆవిష్కరణలు, సృజనాత్మకతను దెబ్బతీస్తోంది. అమెరికా కార్మికులకు నష్టం కలిగిస్తోంది. ఈ చట్ట విరుద్ధమైన వ్యాపారం పెరగడం వల్ల నకిలీ ఉత్పత్తుల తయారీలో పాలు పంచుకునే కార్మికులను దోచుకునే విధానాలకు దారితీస్తుంది. నకిలీ ఉత్పత్తులు వినియోగదారులు, కార్మికుల ఆరోగ్యం, భద్రతకు పెద్ద ముప్పు’’ అని యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ క్యాథరిన్ టే అన్నారు. పెద్ద మొత్తంలో నకిలీలు.. యూఎస్టీఆర్ నివేదిక ప్రకారం.. ‘‘కొనుగోలుదారులు, సరఫరాదారులను అనుసంధానం చేస్తూ, ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆన్లైన్ బిజినెస్ టు బిజినెస్ (బీటుబీ) మార్కెట్‌గా చెప్పుకునే ఇండి యామార్ట్లో, పెద్ద మొత్తంలో నకిలీ ఉత్పత్తులు గుర్తించాం. నకిలీ ఫార్మాస్యూటికల్, ఎలక్ట్రానిక్, వస్త్రాలు కూడా ఉన్నాయి. నకిలీ ఉత్పత్తులను ఏరిపారేయడానికి మెరుగైన విధానాలను ఇండియా మార్ట్ అమలు చేయకపోవడం పట్ల హక్కుదారులు ఆందోళన చెందుతున్నారు. విక్రయదారును నిర్ధారించుకోవడం, నకిలీ ఉత్పత్తుల విక్రయదారులకు జరిమానాలు విధించడం, సరైన పర్యవేక్షణ చేయలేకపోతున్నట్టు’’ పేర్కొంది. ముంబైలోని హీరపన్నా మార్కెట్లో నకిలీ వాచ్‌లు, పాదరక్షలు, యాక్సెసరీలు, కాస్మొటిక్స్ విక్రయమవుతున్నట్టు తెలిపింది. ‘ఫ్యాన్సీ మార్కెట్’గా పేర్కొందిన కిడ్డర్‌పోర్ (కోల్‌కతా) నకిలీ బ్రాండ్ల వస్త్రాలు, కాస్మొటిక్స్‌కు కేంద్రంగా ఉన్నట్టు పేర్కొంది. వీటితో చర్మ సంబంధిత సమస్యలు, కంటి సమస్యలు వస్తున్నట్టు వెల్లడించింది. ఇక ఢిల్లీలోని అండర్‌గ్రౌండ్ మార్కెట్ పాలికా బజార్ 2021 జాబితాలోనూ ఉన్న విషయాన్ని గుర్తు చేసింది. ఇక్కడ మొబైల్ యాక్సెసరీలు, కాస్మొటిక్స్, వాచ్‌లు, కళ్లద్దాల నకిలీ ఉత్పత్తులను అమ్ముతున్నట్టు తెలిపింది. ట్యాంక్రోడ్ హోల్‌సేల్ మార్కెట్ వస్త్రాలు, పాదరక్షలు, వాచ్‌లు, హ్యాండ్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్స్, సౌందర్య ఉత్పత్తులకు కేంద్రంగా ఉన్నట్టు పేర్కొంది. -
గుడ్‌న్యూస్,ఇకపై వారానికి ఒకసారి శాలరీ!! భారత్‌లో మొదలైన కొత్త కల్చర్!
ప్రపంచ దేశాల్లో కోవిడ్ కారణంగా ఉద్యోగుల వర్క్ కల్చర్ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు వర్క్ కల్చర్‌తో పాటు ఉద్యోగుల చెల్లించే నెలవారీ జీతాల విధానం పూర్తిగా మారిపోనుంది. ఇప్పటి వరకు నెలకు ఒక సారి మాత్రమే సంస్థలు ఉద్యోగులకు జీతాల్ని చెల్లిస్తుండేవి. కానీ ఇప్పుడు ఆ విధానానికి స్వస్తి పలికి వారానికి జీతాలు చెల్లించేందుకు మొగ్గు చూపుతున్నాయి. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, హాంకాంగ్ వంటి దేశాల్లో సంస్థలు ఉద్యోగులకు వారం వారం జీతాల్ని చెల్లిస్తుంటాయి. ఇప్పుడు ఈ కల్చర్ ఇండియాలో మొదలైంది. దేశీయ బీ2బీ ఈ కామర్స్ దిగ్గజ సంస్థ ఇండియా మార్ట్ ఉద్యోగులకు నెలవారీ కాకుండా వారం వారం జీతాల్ని చెల్లించాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించింది. వారానికి ఒకసారి జీతాలు చెల్లించడం ద్వారా ఉద్యోగులకు ఎలాంటి ఆర్ధిక ఇబ్బందులు తలెత్తవని, తద్వారా వర్క్ ప్రొడక్టివిటీ పెరుగుతుందని ఇండియా మార్ట్ ఫేస్బుక్ పోస్ట్‌లో పేర్కొంది. కాగా,డిసెంబర్ 2021 త్రైమాసికంలో ఇండియామార్ట్ ఏకీకృత నికర లాభంలో 12.4 శాతం క్షీణించి రూ.70.2 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో కంపెనీ రూ.80.2 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఎఫ్వై22 3వ త్రైమాసికంలో దీని ఆదాయం రూ.173.6 కోట్ల నుంచి 8.3 శాతం పెరిగి రూ.188.1 కోట్లకు చేరుకుందని రెగ్యులేటరీ ఫైలింగ్ తెలిపింది. -
మీ దగ్గర ఈ 25 పైసల నాణెం ఉంటే లక్షాధికారులే
న్యూఢిల్లీ: మీ దగ్గర పాత 25 పైసల నాణెం ఉందా.. ఒకవేళ ఉంటే మీరు లక్షాధికారులు కావచ్చు అంటుంది ఇండయామార్ట్ వెబ్సైట్. పావలా ఉంటే లక్షాధికారులు ఎలా అవుతారా అని ఆలోచిస్తున్నారా అయితే ఇది చదవండి. ఇండియామార్ట్ ఓ బంపరాఫర్ ప్రకటించింది. మీ దగ్గర గనుక 1992 కాలం నాటి ఖడ్గ మృగం ఉన్న 25 పైసల కాయిన్ ఉంటే.. మీరు లక్షాధికారులే అని తెలిపింది. ఇందుకు గాను మీరు ఆ కాయిన్‌ను రెండు వైపులా ఫోటో తీసి.. ఇండియామార్ట్. కామ్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. అక్కడ దీన్ని వేలం వేస్తారు. ఎంత ఎక్కువ ధర పలుకుతుందనేది బిడ్డర్ల మీద ఆధారపడి ఉంటుంది. అయితే గరిష్టంగా 1.50 లక్షల రూపాయల వరకు పలకవచ్చని భావిస్తున్నారు. ఈ 25 పైసల నాణెం తప్పకుండా వెండి రంగులో ఉండాలి అని తెలిపింది. ఇక మీ దగ్గర పాత 5,10 పైసల నాణేలు ఉంటే వాటిని ఇండియామార్ట్ వెబ్సైట్లో అమ్మి డబ్బు చేసుకోవచ్చు. అలానే ఎవరికైనా పాత నాణేల మీద ఆసక్తి ఉంటే ఇక్కడ కొనవచ్చు. ఇక ఇండియామార్ట్ భారతదేశంలోకెల్లా అతిపెద్ద ఇ-కామర్స్ వెబ్సైట్లలో ఒకటి. "ఇండియామార్ట్ 10 కోట్లకు పైగా కొనుగోలుదారులు, 60 లక్షలకు పైగా సరఫరాదారులకు సేవలు అందిస్తోంది. మీరు రిటైలర్, తయారీదారు అయినా, ఆన్లైన్లో వ్యాపారం పెరగడానికి ఇండియామార్ట్ మంచి గమ్య స్థానం అని దాని వెబ్సైట్లో పేర్కొంది. ఇక ఇది ఎంత వాస్తవమనేది చూడాలి. చదవండి: రూ.5 కాయిన్‌కు రూ.5 లక్షలట! -
ఇండియా మార్ట్ ఐపీఓకు సెబీ ఓకే
ఆన్లైన్ మార్కెట్ ప్లేస్, ఇండియామార్ట్ ఐపీఓకు (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) మార్కెట్ నియంత్రణ సంస్థ ‘సెబీ’... ఆమోదం తెలిపింది. ఈ కంపెనీతో పాటు అవన లాజిస్టెక్ కంపెనీ ఐపీఓకు కూడా సెబీ పచ్చజెండా ఊపింది. ఐపీఓలో భాగంగా ఇండియామార్ట్ కంపెనీ 42.88 లక్షల ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.600 కోట్లు సమీకరిస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఐపీఓకు లీడ్ మేనేజర్లుగా ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఎడిల్వీజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, జెఫరీస్ ఇండియాలు వ్యవహరిస్తాయి. అవన లాజిసిస్టెక్ ఐపీఓ... అవన లాజిస్టెక్ కంపెనీ ఐపీఓలో భాగంగా రూ.300 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనున్నది. వీటితో పాటు ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) మార్గంలో 43 లక్షల షేర్లను విక్రయించనున్నది. ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను రుణ భారం తగ్గించుకోవడానికి, కోల్డ్ స్టోరేజ్‌లు, గిడ్డంగిల నిర్మాణానికి, కంటైనర్ల కొనుగోళ్లకు వినియోగించుకోవాలని ఈ కంపెనీ యోచిస్తోంది. ఈ ఐపీఓకు లీడ్ మేనేజర్లుగా ఐసీఐసీఐ సెక్యూరిటీస్, యాక్సిస్ క్యాపిటల్ కంపెనీలు వ్యవహరిస్తాయి. ఈ రెండు కంపెనీల ఐపీఓలకు ఆమోదంతో ఈ ఏడాది సెబీ ఆమోదం తెలిపిన ఐపీఓల సంఖ్య 50కు పెరిగింది. -
చిక్కుల్లో స్నాప్‌డీల్: నోటీసులు
ముంబై: ఇ-కామర్స్ సంస్థ స్నాప్‌డీల్ మరోసారి చిక్కుల్లో పడింది. వన్య ప్రాణుల అవయవాలనుంచి తయారు చేసిన ఉత్పత్తులను విక్రయిస్తోందని ఆరోపిస్తూ స్నాప్‌డీల్ సహా, మరికొన్ని సంస్థలకు నోటీసులు జారీ అయ్యాయి. వెంటనే ఆయా ఉత్పత్తులను తొలించాలని, దీనిపై చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరించాలంటూ ఆదేశించినట్టు ప్రజా సంబంధాల విభాగం అధికారి ఒకరు తెలిపారు. స్నాప్‌డీల్‌తో పాటు విష్ అండ్ బిట్, ఇండియా మార్ట్, క్రాఫ్ట్ కంపారిజన్ వెబ్సైట్లకు మధ్యప్రదేశ్ టైగర్ స్ట్రైక్ ఫోర్స్ ఈ నోటీసులిచ్చింది. దీనిపై తక్షణమే వివరణ ఇవ్వాల్సిందిగా కోరింది. కాగా ఇండోర్ విజయ్ నగర్‌లోని శుభభక్తి స్నాప్‌డీల్ ద్వారా అడవి జంతువుల అవయవాలు నుండి తయారు చేసిన "హత్తా-జోడి" "సియర్-సింఘి"లాంటి ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ నోటీసులు జారీ అయ్యాయి. అలాగే ఈ వ్యవహారంలో శుభభక్తి సంస్థ యజమానులు సుమిత్ శర్మ , ఫిరోజ్ ఆలీని పోలీసులు గత వారం అరెస్టు చేశారు. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కేసును దాఖలు చేశారు. అయితే ఇ-కామర్స్ పోర్టల్స్ స్నాప్‌డీల్, ఇండియా మార్ట్, విష్ అండ్ బై వెబ్సైట్ల ద్వారా ఈ వస్తువులను విక్రయించినట్టు దర్యాప్తు సమయంలో వీరు వెల్లడించారు. పూజ పదార్ధాల వర్తకంతో పాటు వన్యప్రాణుల సంబంధిత వస్తువులను విక్రయిస్తున్నట్టు తేలిందని దర్యాప్తు అధికారి తెలిపారు. ధనవంతులు కావడం, కోర్టు కేసులనుంచి విముక్తి, వ్యాపార వృద్ధి తదితర సమస్యలకు పరిష్కారంగా వీటిని జనం విశ్వసిస్తారని ఆయన చెప్పారు.