వేసవి రాకముందే సూర్యప్రతాపం
ఈ వేసవి సీజన్ రాకముందే భానుడు భగభగలాడుతున్నాడు. సూర్యప్రతాపంతో వాతావరణం వేడెక్కుతోంది. పగటి గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. వారం రోజుల్లోనే గరిష్ట ఉష్ణోగ్రత 5.1 డిగ్రీలకు పెరిగింది. గతేడాది ఫిబ్రవరి చివరి వారం వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు 15-16 డిగ్రీలు నమోదు కాగా, ఈసారి జనవరి చివరికి 17.5 డిగ్రీలు నమోదైంది. సాధారణంగా మార్చి ప్రారంభం నుంచి పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతుంటాయి.ఈసారి మాత్రం నెలరోజులు ముందుగానే ఉష్ణోగ్రతలు పెరగటం గమనార్హం. పరోక్షంగా పగటి గరిష్ట ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతుంది. గతేడాది జనవరి చివరినాటికి పగటి గరిష్ట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలలోపే నమోదైతే, ఈసారి మాత్రం 35.1 డిగ్రీలుగా నమోదైంది. వర్షాభావమే కారణం.
భారత వాతావరణ అధ్యయన సంస్థ (ఐఎండీ) సూచనల ప్రకారం జిల్లాలో ఈసారి పగటి గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని తాండూరు వ్యవసాయ శాస్త్రవేత్త డా.సి.సుధాకర్ తెలిపారు. వర్షాభావంతోపాటు ప్రతి ఏడాది ఉత్తర వాయవ్వ ప్రాంతాల నుంచి శీతల గాలులు దక్షిణ దిశకు వీయకపోవడం గరిష్ట ఉష్ణోగ్రత పెరుగుదలకు కారణమన్నారు.