కోచ్ పదవికి రవిశాస్త్రి దరఖాస్తు!
సహాయక పదవులకు బంగర్, అరుణ్, శ్రీధర్ కూడా...
న్యూఢిల్లీ: భారత జాతీయ క్రికెట్ జట్టు చీఫ్ కోచ్ పదవికి మాజీ డెరైక్టర్ రవిశాస్త్రితో పాటు సహాయక సిబ్బంది పదవులకు సంజయ్ బంగర్, భరత్ అరుణ్, ఆర్.శ్రీధర్‌లు మళ్లీ దరఖాస్తు చేసుకోనున్నారు. మరో రెండు రోజుల్లో బోర్డు కోచ్ పదవులకు ప్రకటన జారీ చేయనున్న నేపథ్యంలో ఆ నలుగురు దరఖాస్తు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు ధ్రువీకరించారు. ‘శాస్త్రి, అరుణ్, బంగర్, శ్రీధర్‌లు తమ గత పోస్ట్‌లకు మళ్లీ దరఖాస్తులు పంపుతున్నారు.
బీసీసీఐ అధ్యక్షుడి నుంచి వీళ్లకు సానుకూల సంకేతాలు అందాయి. అయితే ప్రతి అభ్యర్థి ప్రత్యేకమైన ఫార్మాట్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆ నలుగురు బోర్డు జారీ చేసే ప్రకటన కోసం వేచి చూస్తున్నారు’ అని సదరు అధికారి పేర్కొన్నారు. బీసీసీఐ పగ్గాలు చేపట్టిన అనురాగ్ ఠాకూర్‌ను ఇటీవలే ఢిల్లీలో సహాయక సిబ్బంది కలిసి ఈ అంశంపై చర్చించినట్లు సమాచారం.
ప్రధానంగా కోచ్ ఎంపికకు లెవల్-3 డిగ్రీతో పాటు సీనియర్ జట్లకు కోచింగ్ ఇచ్చిన అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోనున్నారు. అలాగే ఎంపికయ్యే అభ్యర్థి తమ దేశం తరఫున కనీసం 50 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి ఉండాలి. అనవసరమైన దరఖాస్తులు రాకుండా ఈ రెండు నిబంధనలను విధించారని బోర్డు వర్గాలు వెల్లడించాయి.