ఇప్పుడు ఎన్నికలు జరిగినా కమల వికాసమే
న్యూఢిల్లీ: లోక్సభకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధికార బీజేపీ 314 స్థానాలు దక్కించుకునే అవకాశం ఉందని ఓ సర్వేలో వెల్లడైంది. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సాధించిన సీట్ల కంటే ఇవి 32 స్థానాలు ఎక్కువ కావడం గమనార్హం. నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారం చేపట్టి మూడు నెలలు పూర్తికానున్న నేపథ్యంలో ఇండియా టుడే గ్రూపు-హన్సా రిసెర్చ్ సంస్థలు సంయుక్తంగా ‘మూడ్ ఆఫ్ నేషన్’ పేరుతో అభిప్రాయ సేకరణ చేశాయి.
29 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 108 లోక్సభ స్థానాల్లో 12,430 మంది నుంచి అభిప్రాయాలు సేకరించాయి. ఈ నెల 3 నుంచి 14వ తేదీ మధ్యలో జరిగిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 48 శాతం మంది మళ్లీ బీజేపీకి ఓటు వేస్తామని చెప్పగా... 57 శాతం మంది ప్రధాని పదవికి మోడీ తగిన వ్యక్తి అని అభిప్రాయపడ్డారు. ప్రజాదరణ విషయంలో మోడీ కంటే బీజేపీ ఇప్పటికీ వెనుకబడే ఉండటం గమనార్హం. మరోసారి ఓటు వేసే అవకాశం వస్తే 29 శాతం మంది ముస్లింలు బీజేపీకి ఓటేస్తామని చెప్పగా.. కాంగ్రెస్కు ఓటేస్తామని చెప్పినవారు 24 శాతం మందే.