India Trip
-
భారత్‌లో ఆస్ట్రేలియా ప్రధాని
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా ప్రధాని మాల్కం టర్న్‌బుల్ నాలుగు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఆదివారం భారత్ చేరుకున్నారు. ఆయనకు ఢిల్లీ విమానాశ్రయంలో కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ స్వాగతం పలికారు. ఇంధనం, వాణిజ్యం తదితర రంగాల్లో బంధాల బలోపేతానికి టర్న్‌బుల్ భారత ప్రధానితో చర్చలు జరుపుతారు. ఆస్ట్రేలియాలో భారత విద్యార్థులపై జరుగుతున్న దాడులను భారత్ ఆయన దృష్టికి తీసుకెళ్లే అవకాశముంది. -
బుల్లెట్ రాణి, బుల్లెట్ రాజాల సాహసయాత్ర
రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ పై దర్జాగా కూర్చుని చిరునవ్వులు చిందిస్తున్న ఈ ఇద్దరినీ ఎక్కడో చూసినట్లనిపిస్తోందికదా! అవును. ఆయన 'సుత్తి'తో దుష్టులను అంతం చేసే 'థోర్' హీరో క్రిస్ హేమ్స్ వర్త్ కాగా, ఆవిడ 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్' హీరోయిన్ ఎల్సా పాట్కీ. వీళ్లిద్దరూ భార్యభర్తలుగా కంటే గొప్ప స్నేహితులుగా, ఒకరికోసం ఒకరన్నట్లు జీవించే ప్రేమపక్షులుగా ప్రసిద్ధి. ఆ బంధాన్ని మరింత దృఢపర్చుకునేందుకు ఈ వాలెంటైన్స్ డేనాడు ఇద్దరూ కలిసి మరో సాహసకృత్యానికి సిద్ధమయ్యారు. సినిమా షూటింగ్ లకు కాస్త విరామం ఇచ్చి.. అడ్వెంచర్ టూరిస్టులకు అడ్డాగా మారిన ఇండియాకు కుటుంబంతోసహా విచ్చేసిన ఈ హాలీవుడ్ జంట ఇప్పటికే గోవా, లడాఖ్ ప్రాంతాలను చుట్టేశారు. వారి తర్వాతి గమ్యం హిమాలయాల్లో ట్రెక్కింగ్. సరిగ్గా ప్రేమికులరోజునాడే హిమాలయ సాహసయాత్రను ప్రారంభించనున్నారీ ప్రేమజంట. స్పెయిన్ కు చెందిన 'ప్లానెటా ఛలేజా(ప్లానెట్ ఛాలెంజ్)' అనే అడ్వెంచర్స్ అంస్థ వీరి టూర్ ను గైడ్ చేస్తోంది. -
అమెరికా ఒత్తిడికి తలొగ్గిన పాకిస్తాన్
కరాచీ: భారత్‌పై ఎలాంటి ఉగ్ర దాడులు జరగకుండా చూడాలన్న అమెరికా ఒత్తిడికి పాకిస్తాన్ తలొగ్గింది. దీనిలో భాగంగానే హఫీజ్ సయ్యిద్ కు చెందిన ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్ దవాపై పాక్ తాజాగా నిషేధం విధించింది. భారత్ లో సీమాంతర ఉగ్రవాద దాడి జరగకుండా చూడాలని పాకిస్తాన్‌ను అమెరికా అధ్యక్షుడు బరాక్ బబామా హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఒకవేళ అలాంటి దాడి ఏదైనా జరిగితే, అది పాక్ నుంచే జరిగిందని వెల్లడైతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ముందస్తు చర్యల్లో భాగంగా జమాత్ ఉద్ దవా పై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. భారత గణతంత్ర దినోత్సవంలో పాల్గొనేందుకు ఒబామా భారత్‌లో పర్యటిస్తున్నారు. ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో జరిగే ఈ వేడుకల్లో పాల్గొంటున్న ఒబామా.. రెండు గంటల కన్నా ఎక్కువ సేపు బహిరంగ వేదికపై ఉండనున్నారు. దీంతో ఆయన భద్రత విషయమై అమెరికా, భారత భద్రతా సంస్థలు మరింత ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా భారత్ లో ఉగ్రవాదులు దాడులు చేసే ప్రమాదం ఉందని ఐబీ (నిఘా సంస్థ) హెచ్చరికలు జారీ చేయడంతో దేశంలోని ప్రధాన నగరాల్లోని ఎయిర్ పోర్టుల్లో హై అలర్ట్ ప్రకటించారు.