India versus England
-
దానివల్లే చాహల్ రాటుదేలాడు!
మూడో టీ-20 మ్యాచ్‌లో ఆరు వికెట్లు పడగొట్టి.. భారత్‌కు అద్భుత విజయాన్ని అందించిన యజువేంద్ర చాహల్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. 202 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు ఒక దశలో 119/2తో బలంగా కనిపించినప్పటికీ చాహల్ స్పిన్ మాయాజాలంతో కేవలం ఎనిమిది పరుగుల వ్యవధిలో ఎనిమిది వికెట్లు కోల్పోయిన సంగతి తెలిసిందే. యువ బౌలర్లు చాహల్, జస్ప్రీత్ బుమ్రా పోటాపోటీగా వికెట్లు తీయడంతో ఆరుగురు ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ డకౌట్ అయ్యారు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో చాహల్ మాయాజాలంపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. అతను ఐపీఎల్ ప్రాడక్ట్ అని పేర్కొన్నాడు. ఐపీఎల్లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ తరఫున ఆడటం వల్ల చాహల్ రాటుదేలాడు అని పేర్కొన్నాడు. ’చాహల్ బెంగళూరు రాయల్ చాలెంజర్ బౌలర్ అన్న విషయం తెలిసిందే. కాబట్టి ఈ వేదికపై ఆడటం అతనికి తెలుసు. టీ-20 క్రికెట్ ఐపీఎల్ ప్రాడక్ట్. అదేవిధంగా చాహల్ కూడా ఐపీఎల్ ప్రాడక్టే. ఐపీఎల్లో ఆడటం ద్వారా అతను ఎంతగానో మెరుగయ్యాడు. కచ్చితంగా ఏం చేయాలో అతనికి తెలుసు. అతను టెర్రిఫిక్‌గా ఆడాడు. భారత టీ-20లపై ఐపీఎల్ విస్తారమైన ప్రభావాన్ని చూపుతోంది. చాలామంది ఆటగాళ్లు దానినుంచే వచ్చి భారత్ తరఫున అద్భుతంగా ఆడుతున్నారు’ అని గంగూలీ గుర్తుచేశాడు. -
కలలోనూ అనుకోలేదు.. 6 వికెట్లపై చాహల్!
లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ తన స్పిన్ మాయాజాలంతో ఇంగ్లండ్ జట్టును చుట్టుముట్టాడు. అనూహ్యరీతిలో అతను టపాటపా ఆరు వికెట్లు పడగొట్టడంతో బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మూడు టీ-20 మ్యాచ్‌లో ఇంగ్లిష్ జట్టు 75 పరుగుల తేడాతో పరాజయం ముటగట్టుకుంది. దీంతో టీ-20 సిరీస్‌ను భారత్ 2-1తో కైవసం చేసుకుంది. నిజానికి 202 పరుగుల భారీ లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు 13వ ఓవర్ వరకు గమ్యం దిశగా సాగినట్టు కనిపించింది. 13వ ఓవర్లో 119/2 వికెట్లతో బలంగా కనిపించిన ఆ జట్టు ఆ తర్వాత కేవలం 8 పరుగులు జోడించి చివరి 8 వికెట్లు కోల్పోవడం గమనార్హం. అందుకు కారణం యువ స్పిన్నర్ చాహల్ మాయాజాలమే. అతను స్పిన్ బంతులను ఎదుర్కోలేక ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ చేతులెత్తేశారు. దీంతో ఆరు వికెట్లను కొల్లగొట్టిన చాహల్ తన కెరీర్లోనే తొలిసారి ఉత్తమ గణాంకాలను నమోదుచేశాడు. మూడ టీ-20లో స్టార్ ఆఫ్ ద నైట్‌గా నిలిచిన చాహల్.. ఆరు వికెట్లు పడగొడతానని తాను కలలో కూడా అనుకోలేదని చెప్పాడు. ’బెంగళూరులో తొలిసారి టీమిండియా తరఫున ఆడటం ఆనందం కలిగించింది. సొంతూరులో ఉండి ఆడినట్టు అనిపించింది. ఆరు వికెట్లు తీస్తానని కలలో కూడా అనుకోలేదు’ అని మ్యాచ్ అనంతరం చెప్పాడు. 25 పరుగులకు ఆరు వికెట్లు పడగొట్టిన చాహల్ భారత్ తరఫున టీ-20లో ఉత్తమ గణాంకాలు నమోదుచేసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా అంతర్జాతీయ టీ-20 మ్యాచ్‌లలో ఆరు వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు.