Indian-American student
-
భారత విద్యార్థికి 66 లక్షల బహుమతి
న్యూయార్క్: భారత సంతతికి చెందిన ఓ విద్యార్థి అమెరికాలో జరిగిన క్విజ్ పోటీలో లక్ష డాలర్ల (దాదాపు రూ. 66 లక్షలు) ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు. బ్రౌన్ యూనివర్సిటీలో ప్రజారోగ్యం, ఆర్థిక శాస్త్రం కోర్సు తొలి ఏడాది చదువుతున్న ధ్రువ్ గౌర్ అనే యువకుడు జియోపార్డీ కాలేజ్ చాంపియన్‌షిప్ పేరుతో జరిగిన ఈ పోటీలో బహుమతి గెలుపొందాడు. మరో 14 మందితో కలిసి పోటీలో పాల్గొన్న అతను శుక్రవారం విజేతగా నిలిచాడు. ఈ విజయంతో అతను ‘టోర్నమెంట్ ఆఫ్ చాంపియన్స్’ అనే మరో క్విజ్ పోటీలో పాల్గొనేందుకూ అర్హత సాధించాడు. జార్జియా రాష్ట్రానికి చెందిన ధ్రువ్ గతంలోనూ అనేక పోటీలు, ప్రవేశపరీక్షల్లో ప్రతిభ చాటాడు. అత్యంత తెలివైన వాళ్లయిన 14 మందిని ఓడించి తాను ఈ పోటీలో గెలుస్తానని తొలుత అస్సలు అనుకోలేదంటూ ధ్రువ్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. -
3డి ప్రింటర్‌తో లౌడ్ స్పీకర్.. ఎన్నారై విద్యార్థి ఘనత
శాస్త్ర సాంకేతిక రంగాల్లో అద్భుతాలు సృష్టించడంలో భారతీయులది అందెవేసిన చేయి. ఇప్పుడా విషయం మరోసారి రుజువైంది. ఎన్నారై విద్యార్థి అపూర్వ కిరణ్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ౩డి ప్రింటర్ లోంచి లౌడ్స్పీకర్లు ప్రింట్ చేసింది. ఇందులో ప్లాస్టిక్, కండక్టివ్, అయస్కాంత విడిభాగాలున్నాయి. ఇది అచ్చం మామూలు లౌడ్‌స్పీకర్ లాగే పనిచేస్తుంది. కేవలం విడిభాగాలను రూపొందించి కలపడమే కాక.. పూర్తిస్థాయి లౌడ్స్పీకర్లను ౩డి ప్రింటర్లలోంచి బయటకు తీసే పద్ధతిని వీరు కనిపెట్టారు. అపూర్వ కిరణ్, రాబర్ట్ మెక్ కర్డీ ఇద్దరూ కార్నెల్ యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్నారు. వీళ్లు మెకానికల్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అసోసియేట్ ప్రొఫెసర్ హాడ్ లిప్సన్ నేతృత్వంలో ఈ ప్రాజెక్టుపై పనిచేశారు. తాను కొత్తగా ౩డి ప్రింట్ చేసిన ఈ లౌడ్‌స్పీకర్ చక్కగా పనిచేస్తోందని చెబుతూ దాన్ని యాంప్లిఫయర్కు కలిపారు. ఇది పనిచేస్తోందని చూపించేందుకు అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రసంగాన్ని వినిపించారు. ఇక ఈ లౌడ్‌స్పీకర్ తయారీలో అయస్కాంతం కోసం సమన్వయ శ్రీవాత్సవ అనే కెమికల్, బయోమాలిక్యులర్ ఇంజనీరింగ్ విద్యార్థి సాయం తీసుకున్నాడు. స్ట్రాన్షియం ఫెర్రైట్ సాయంతో వాళ్లు అయస్కాంతాన్ని తయారు చేయగలిగారు. చివరికి రీసెర్చి ఫాబర్ మీద 3డి ప్రింటింగ్ చేశారు. మరికొద్ది కాలంలో వినియోగదారులు తమ ఇంట్లోనే ఎలక్ట్రానిక్ పరికరాలను ప్రింట్ చేసుకునే అవకాశం కూడా వస్తుందని అపూర్వ కిరణ్ బృందం చెబుతోంది. -
భారతీయ అమెరికన్ విద్యార్థికి ప్రతిష్టాత్మక అవార్డు
నానో టెక్నాలజీ రంగంలో విప్లవాత్మకమైన ఆవిష్కరణ చేసిన భారతీయ అమెరికన్ విద్యార్థి సౌమిల్ బంధోపాధ్యాయ(18)కు ప్రతిష్టాత్మక స్మిత్సోనియన్ మ్యాగ జైన్ ‘అమెరికన్ ఇంజెన్యూటీ అవార్డు’ లభించింది. ఆటోమొబైల్స్ మొదలుకొని ఖగోళశాస్త్రం వరకూ ఎంతో ఉపయోగపడనున్న ‘ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ డిటెక్టర్’ను ఆవిష్కరించినందుకుగాను సౌమిల్‌కు ఈ అవార్డు దక్కింది. సౌమిల్తో సహా ఈ రెండో వార్షిక అమెరికన్ ఇంజెన్యూటీ అవార్డులకు 10 మంది ఎంపిక కాగా, వారికి గతనెలలో అవార్డుల ప్రదానం జరిగిందని ఈ మేరకు ‘స్మిత్సోనియన్ మ్యాగజైన్’ డిసెంబరు సంచికలో కథనం ప్రచురించింది. వర్జీనియా కామన్వెల్త్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కుమారుడు, మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ)లో మొదటేడాది గ్రాడ్యుయేట్ విద్యార్థి అయిన సౌమిల్ అతిపిన్న వయసులోనే విశేష తెలివితేటలు (ఇంజెన్యూటీ) కనపర్చాడని పత్రిక ప్రశంసించింది. కాగా పరారుణ కిరణ రేడియేషన్‌ను గుర్తించే ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ డిటెక్టర్లు పనిచేయాలంటే వాటిని ఖరీదైన ద్రవ నైట్రోజన్ ట్యాంకులతో చల్లబర్చాల్సి ఉంటుంది. కానీ సౌమిల్ కనుగొన్న డిటెక్టర్ మాత్రం గది ఉష్ణోగ్రతతో పనిచేయడం వల్ల చాలా చౌకగానే అందుబాటులోకి రానుంది. పొగమంచు, చీకటిలో కార్లు, ఇతర వాహనాలు ఒకదానినొకటి ఢీకొట్టకుండా కూడా ఈ డిటెక్టర్ ఉపయోగపడనుండటంతో వాహన ప్రమాదాలను గణనీయంగా తగ్గించేందుకు వీలుకానుంది. మందుపాతరలను గుర్తించేందుకు, భూతాపోన్నతి పర్యవేక్షణకు, నక్షత్రాల జననాన్ని పరిశీలించేందుకూ ఇది ఉపయోగపడనుంది. శాస్త్రీయ పరిశోధనలకు, సైన్యానికి, ప్రజలకూ ఉపయోగపడే ఈ డిటెక్టర్‌పై అమెరికా ఆర్మీ సైతం ఆసక్తి వ్యక్తంచే యడం విశేషం.