శాస్త్ర సాంకేతిక రంగాల్లో అద్భుతాలు సృష్టించడంలో భారతీయులది అందెవేసిన చేయి. ఇప్పుడా విషయం మరోసారి రుజువైంది. ఎన్నారై విద్యార్థి అపూర్వ కిరణ్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ౩డి ప్రింటర్ లోంచి లౌడ్స్పీకర్లు ప్రింట్ చేసింది. ఇందులో ప్లాస్టిక్, కండక్టివ్, అయస్కాంత విడిభాగాలున్నాయి. ఇది అచ్చం మామూలు లౌడ్స్పీకర్ లాగే పనిచేస్తుంది. కేవలం విడిభాగాలను రూపొందించి కలపడమే కాక.. పూర్తిస్థాయి లౌడ్స్పీకర్లను ౩డి ప్రింటర్లలోంచి బయటకు తీసే పద్ధతిని వీరు కనిపెట్టారు. అపూర్వ కిరణ్, రాబర్ట్ మెక్ కర్డీ ఇద్దరూ కార్నెల్ యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్నారు. వీళ్లు మెకానికల్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అసోసియేట్ ప్రొఫెసర్ హాడ్ లిప్సన్ నేతృత్వంలో ఈ ప్రాజెక్టుపై పనిచేశారు.
తాను కొత్తగా ౩డి ప్రింట్ చేసిన ఈ లౌడ్స్పీకర్ చక్కగా పనిచేస్తోందని చెబుతూ దాన్ని యాంప్లిఫయర్కు కలిపారు. ఇది పనిచేస్తోందని చూపించేందుకు అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రసంగాన్ని వినిపించారు. ఇక ఈ లౌడ్స్పీకర్ తయారీలో అయస్కాంతం కోసం సమన్వయ శ్రీవాత్సవ అనే కెమికల్, బయోమాలిక్యులర్ ఇంజనీరింగ్ విద్యార్థి సాయం తీసుకున్నాడు. స్ట్రాన్షియం ఫెర్రైట్ సాయంతో వాళ్లు అయస్కాంతాన్ని తయారు చేయగలిగారు. చివరికి రీసెర్చి ఫాబర్ మీద 3డి ప్రింటింగ్ చేశారు. మరికొద్ది కాలంలో వినియోగదారులు తమ ఇంట్లోనే ఎలక్ట్రానిక్ పరికరాలను ప్రింట్ చేసుకునే అవకాశం కూడా వస్తుందని అపూర్వ కిరణ్ బృందం చెబుతోంది.