సరిహద్దులో ఉద్రిక్తత
ఎల్వోసీ వద్ద పాక్ మానవ రహిత విమానాలు
* కాల్పులతో కవ్విస్తున్న దాయాది
* ఎలాంటి చర్యకైనా సిద్ధమే: బీఎస్ఎఫ్ డీజీ
* గుజరాత్ తీరంలో పాక్ బోటు స్వాధీనం 9 మంది అరెస్టు
న్యూఢిల్లీ/శ్రీనగర్: భారత ఆర్మీ సర్జికల్ దాడుల తర్వాత సరిహద్దుల్లో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. పాకిస్తాన్ జవాన్లు కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతుంటే.. అటు పాక్ వైమానిక దళం విమానాలతో సరిహద్దులో కార్యక్రమాలను గమనిస్తోంది.
‘సర్జికల్ దాడుల తర్వాత యూఏవీ (మానవరహిత వైమానిక వాహనాలు)లతో పాక్ పరిస్థితిని గమనిస్తోంది. తరచూ యూఏవీలు ఎల్వోసీకి దగ్గరగా వచ్చి వెళ్తుండటం చూస్తుంటే.. భారత బలగాలను అంచనా వేసేందుకే వచ్చాయనిపిస్తోంది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా, అప్రమత్తంగా ఉన్నాం’ అని బీఎస్ఎఫ్ డెరైక్టర్ జనరల్ కేకే శర్మ చెప్పారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన భారత-బంగ్లాదేశ్ భద్రతా బలగాల ద్వైపాక్షిక చర్చల ముగింపులో శర్మ మాట్లాడారు. పాక్ సరిహద్దుల్లో భద్రతతోపాటు బంగ్లా సరిహద్దుల్లోనూ (ఉగ్రవాదులు చొరబడొచ్చన్న అనుమానంతో).. అప్రమత్తంగానే ఉన్నామన్నారు. ఎల్వోసీలో భూములున్న రైతులను అటువైపు వెళ్లేందుకు అనుమతిస్తున్నామని.. సరిహద్దు గ్రామాలను ఖాళీ చేయించటం లేదన్నారు. బారాముల్లాలో ఉగ్రవాద ఘటనతో చొరబాట్లపై నిఘా తీవ్రం చేశామన్నారు.
కాల్పులకు తెగబడిన పాక్.. సరిహద్దుల్లో 48 గంటల్లో పాక్ 8 సార్లు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. భారత పోస్టులతోపాటు గ్రామస్తులపైనా షెల్లింగ్స్తో దాడులు చేసింది. అఖ్నూర్, నౌషేరా, రాజౌరీ సెక్టార్లతోపాటు పంజాబ్, గుజరాత్, రాజస్తాన్ రాష్ట్రాల సరిహద్దుల్లోనూ ఈ కాల్పులు జరిగాయి. వీటిని భారత బలగాలు తిప్పికొట్టాయి. సోమవారం రాత్రి సౌజియన్, షాపూర్-కెర్నీలలో పాక్ జరిపిన కాల్పుల్లో పలు దుకాణాలు ధ్వంసం కాగా.. ఐదుగురు పౌరులు గాయపడ్డారు. కాగా, ఆదివారం గుజరాత్ తీరంలో భారత సముద్రజలాల్లోకి వచ్చిన ఓ బోటులోని 9 మంది పాకిస్తానీలను భారత తీర గస్తీ దళం అదుపులోకి తీసుకుంది.
మంగళవారం పంజాబ్లోని అమృత్సర్ జిల్లాలో రావి నదిలో ఓ పాకిస్తాన్ ఖాళీ బోటును భద్రతా దళం గుర్తించింది. రావినదిలో నీటి ప్రవాహం పెరగటంతో.. పాక్వైపునుంచి పడవ కొట్టుకొచ్చినట్లు భావిస్తున్నారు. త్రివిధ దళాలు సిద్ధమే.. పాక్పై మెరుపుదాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఎయిర్ చీఫ్ మార్షల్ అరుప్ రాహా తెలిపారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ సిద్ధంగా ఉన్నాయని.. దూకుడుగా వెళ్లాలని కేంద్రం ఆదేశించిన మరుక్షణం మెరుపుదాడి మొదలవుతుందన్నారు. కశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తెచ్చే క్రమంలో పౌరులకన్నా.. జవాన్లకే ఎక్కువ గాయాలయ్యాయని సీఆర్పీఎఫ్ డీజీ దుర్గాప్రసాద్ తెలిపారు.
‘సర్జికల్’పై రాజకీయ దుమారం
న్యూఢిల్లీ: పాక్ ఉగ్ర కేంద్రాలపై భారత ఆర్మీ జరిపి సర్జికల్ దాడులపై రాజకీయ దుమారం లేచింది. ఇవి అసత్యమని, రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ వీటిని చిత్రీకరించిందని ముంబై కాంగ్రెస్ చీఫ్ సంజయ్ నిరుపమ్ అనగా, దాడులపై ఆధారాలను కేంద్రం బయటపెట్టాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. దీనిపై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందిస్తూ.. కేజ్రీవాల్ భారత ఆర్మీపై నమ్మకంతో మాట్లాడాలన్నారు. దాడులపై అభ్యంతరం ఉన్నవారు పాక్ పౌరసత్వం తీసుకోవాలని మరో మంత్రి ఉమాభారతి హెచ్చరించారు. సంజయ్ వ్యాఖ్యలకు పార్టీతో సంబంధం లేదని కాంగ్రెస్ పేర్కొంది. భారత గౌరవానికి భంగం కలిగిస్తే సహించబోమని కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు.