indian batminton
-
సింధు సత్తా చాటేనా!
ఫుజౌ (చైనా): ఈ ఏడాది లోటుగా ఉన్న అంతర్జాతీయ సింగిల్స్ టైటిల్‌ను సాధించాలనే లక్ష్యంతో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు... నేడు మొదలయ్యే చైనా ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో బరిలోకి దిగుతోంది. మంగళవారం జరిగే మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో రష్యాకు చెందిన ఎవగెనియా కొసెత్స్కయాతో సింధు ఆడుతుంది. సింధు పార్శ్వంలోనే ప్రపంచ మాజీ చాంపియన్ ఒకుహారా (జపాన్), సుంగ్ జీ హున్ (కొరియా), హీ బింగ్జియావో (చైనా) ఉన్నారు. అనుకున్నట్లే ఫలితాలు వస్తే సింధు క్వార్టర్ ఫైనల్లో హీ బింగ్జియావోతో... ఈ మ్యాచ్‌లో గెలిస్తే సెమీస్‌లో ఒకుహారాతో ఆడే అవకాశముంది. భారత్ శుభారంభం మార్క్హ్యామ్ (కెనడా): ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ మిక్స్డ్ టీమ్ చాంపియన్‌షిప్‌లో భారత్ శుభారంభం చేసింది. సోమవారం జరిగిన గ్రూప్ ‘ఇ’ తొలి లీగ్ మ్యాచ్‌లో భారత్ 5–0తో శ్రీలంకను చిత్తు చేసింది. పురుషుల డబుల్స్‌లో గారగ కృష్ణప్రసాద్–ధ్రువ్ కపిల; మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి– తనీషా క్రాస్టో; మిక్స్డ్ డబుల్స్‌లో జూపూడి సృష్టి–పొదిలె శ్రీకృష్ణ సాయికుమార్ జోడీలు తమ ప్రత్యర్థి జంటలపై విజయం సాధించగా... మహిళల సింగిల్స్‌లో మాళవిక; పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్ తమ ప్రత్యర్థులను ఓడించారు. -
కశ్యప్, ప్రణయ్ సంచలనం
♦ ప్రపంచ ఐదో, రెండో ర్యాంకర్స్పై గెలుపు ♦ శ్రీకాంత్‌కు చుక్కెదురు ♦ సింగపూర్ ఓపెన్ టోర్నీ సింగపూర్ : అంచనాలకు మించి రాణించిన భారత బ్యాడ్మింటన్ స్టార్స్ పారుపల్లి కశ్యప్, హెచ్ఎస్ ప్రణయ్... సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో సంచలనాలు సృష్టించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. హైదరాబాద్ ప్లేయర్ కశ్యప్ ప్రపంచ ఐదో ర్యాంకర్ సన్ వాన్ హో (దక్షిణ కొరియా)ను బోల్తా కొట్టించగా... కేరళ కుర్రాడు ప్రణయ్ ప్రపంచ రెండో ర్యాంకర్ జాన్ జార్గెన్‌సన్ (డెన్మార్క్)ను ఇంటిముఖం పట్టించాడు. మరోవైపు ఇటీవల కాలంలో అద్భుత ఫామ్‌లో ఉన్న మూడో సీడ్ కిడాంబి శ్రీకాంత్‌కు మాత్రం ప్రిక్వార్టర్ ఫైనల్లో తనోంగ్సక్ సెన్సోమ్బూన్సుక్ (థాయ్‌లాండ్) చేతిలో చుక్కెదురైంది. గతంలో సన్ వా హోతో ఆడిన రెండుసార్లూ ఓడిపోయిన కశ్యప్ మూడో ప్రయత్నంలో విజయం రుచి చూశాడు. 46 నిమిషాలపాటు జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో కశ్యప్ 21-15, 22-20తో సన్ వా హోను ఓడించాడు. తొలి గేమ్ ఆరంభంలో వెనుకబడ్డ కశ్యప్ ఆ తర్వాత తేరుకొని 14-9తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఇదే ఆధిక్యాన్ని కాపాడుకుంటూ తొలి గేమ్‌ను దక్కించుకున్నాడు. హోరాహోరీగా సాగిన రెండో గేమ్‌లో కీలకదశలో కశ్యప్ పాయింట్లు నెగ్గి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. మరోవైపు రెండు వారాల వ్యవధిలో రెండోసారి ప్రపంచ రెండో ర్యాంకర్ జాన్ జార్గెన్‌సన్‌ను ప్రణయ్ ఓడించడం విశేషం. గత నెలాఖర్లో ఇండియా ఓపెన్‌లో జార్గెన్‌సన్‌పై మూడు గేముల్లో నెగ్గిన ప్రణయ్ ఈసారి రెండు గేముల్లోనే గెలిచాడు. కేవలం 33 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో ప్రణయ్ 21-16, 21-8తో జార్గెన్‌సన్‌పై విజయం సాధించాడు. ప్రపంచ 19వ ర్యాంకర్ సెన్సోమ్బూన్సుక్తో జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ 15-21, 20-22తో ఓడిపోయాడు. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప (భారత్) ద్వయం 22-24, 18-21తో మూడో సీడ్ జియోలి వాంగ్-యు యాంగ్ (చైనా) జంట చేతిలో ఓటమి పాలైంది. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో బ్రైస్ లెవెర్డెజ్ (ఫ్రాన్స్)తో కశ్యప్; కెంటో మొమాటా (జపాన్)తో ప్రణయ్ తలపడతారు. -
మెయిన్ ‘డ్రా’కు గురుసాయిదత్, సాయిప్రణీత్
సింగపూర్ ఓపెన్ టోర్నీ సింగపూర్ : అంచనాలకు అనుగుణంగా రాణించిన భారత బ్యాడ్మింటన్ యువతారలు గురుసాయిదత్, సాయిప్రణీత్ సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించారు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ పోటీల్లో గురుసాయిదత్ తొలిరౌండ్లో 18-21, 21- 18, 21-18తో బూన్సక్ పొన్సానా (థాయ్‌లాండ్)పై నెగ్గి... రెండో రౌండ్లో 21-9, 21-13తో జూ వీ వాంగ్ (చైనీస్ తైపీ)ను ఓ డించాడు. మరోవైపు సాయిప్రణీత్ తొలి రౌండ్లో 18-21, 21-18, 21-12తో రాస్ముస్ ఫ్లాడ్బెర్గ్ (డెన్మార్క్)పై గెలుపొంది... జుల్ఫాది జుల్కిఫ్లి (మలేసియా)తో రెండో రౌండ్లో 11-6 తో ఆధిక్యంలో ఉన్నపుడు అతని ప్రత్యర్థి గాయంతో వైదొలిగాడు. భారత్‌కే చెందిన అజయ్ జయరామ్ మాత్రం మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందలేకపోయాడు. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో హైదరాబాద్‌కే చెందిన సిక్కి రెడ్డి-కోనా తరుణ్ ద్వయం కూడా మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందింది. క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో సిక్కి-తరుణ్ జంట 21-11, 21-12తో జియాన్ లియాంగ్ లీ-జియా యింగ్ వోంగ్ (సింగపూర్) ద్వయంపై, రెండో రౌండ్లో 21-11, 21-17తో మహ్మద్ రాజిఫ్ లతీఫ్-సనాతాసా సనిరూ (మలేసియా) జోడీపై గెలిచింది. బుధవారం జరిగే పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో తియెన్ మిన్ ఎన్గుయెన్ (వియత్నాం)తో కిడాంబి శ్రీకాంత్; లీ హున్ (కొరియా)తో పారుపల్లి కశ్యప్; వోంగ్ వింగ్ విన్సెంట్ (హాంకాంగ్)తో ప్రణయ్; సన్ వాన్ హో (కొరియా)తో గురుసాయిదత్; జాన్ జార్గెన్‌సన్ (డెన్మార్క్)తో సాయిప్రణీత్ తలపడతారు. -
సైనా చేజేతులా...
♦ మలేసియా సెమీస్‌లో ఓటమి ♦ చేజారిన నంబర్‌వన్ కౌలాలంపూర్ : కచ్చితమైన షాట్లు... బలమైన బేస్‌లైన్ ఆటతీరు... నాణ్యమైన డ్రాప్ షాట్లు... తిరుగులేని ఆధిపత్యంతో తొలి గేమ్ సొంతం చేసుకున్న భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్.. రెండో గేమ్‌లో మొదలైన తడబాటును కీలకమైన మూడో గేమ్‌లోనూ అధిగమించలేకపోయింది. ప్రత్యర్థి మోకాలి గాయంతో కోర్టులో ఇబ్బందిగా కదులుతున్నా... ఆ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేకపోయింది. దీంతో మలేసియా ఓపెన్ సూపర్ సిరీస్‌లో సెమీఫైనల్లోనే వెనుదిరిగిన సైనా... బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లో ‘నంబర్‌వన్’ ర్యాంక్‌ను కూడా చేజార్చుకుంది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌లో మూడోసీడ్ సైనా 21-13, 17-21, 20-22తో టాప్‌సీడ్, ఒలింపిక్ చాంపియన్ లీ జురుయ్ (చైనా) చేతిలో పరాజయం చవిచూసింది. గంటా 8 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో... తొలి గేమ్‌లో స్కోరు 6-6తో సమమైన తర్వాత సైనా వరుస పాయింట్లతో 11-6, 15-7 ఆధిక్యంలో నిలిచింది. ఈ దశలో ప్రత్యర్థి పుంజుకునే ప్రయత్నం చేసినా... హైదరాబాదీ నాణ్యమైన బేస్‌లైన్ ఆటతీరుతో గేమ్‌ను ముగించింది. రెండో గేమ్‌లో స్కోరు 10-10తో సమమైంది. ఈ దశలో జురుయ్ నెట్ వద్ద కీలకమైన డ్రాప్ షాట్లతో సైనాను కట్టిపడేసి 18-17తో ఆధిక్యాన్ని సాధించింది. తర్వాత మరో మూడు పాయింట్లతో గేమ్‌ను సొంతం చేసుకుంది. మూడో గేమ్‌లో సైనా 12-7 ఆధిక్యంలో నిలిచినా... జురుయ్ తన ఎత్తుతో చిత్తు చేసింది. బలమైన స్ట్రోక్స్‌తో వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి 12-12తో సమంగా నిలిచింది. అయితే సైనా గేమ్ చివర్లో తడబడింది. సైనా 19-18తో ఆధిక్యంలో ఉన్న దశలో జురుయ్ 19-19, 20-20తో స్కోరును సమం చేయడంతో పాటు మరో రెండు పాయింట్లతో మ్యాచ్ గెలిచింది. సెమీస్‌లో ఓటమితో మహిళల విభాగంలో సైనా నంబర్‌వన్ ర్యాంక్ కూడా పోయింది. ఇండియా ఓపెన్‌లో సెమీస్‌కు చేరుకోవడంతో అగ్రస్థానానికి చేరిన ఈ హైదరాబాదీ... గురువారం అధికారికంగా టాప్కు చేరింది. అయితే మలేసియా సెమీస్‌లో ఓడిపోవడంతో తిరిగి నంబర్‌వన్‌ను లీ జురుయ్‌కు కోల్పోయింది. గురువారం అధికారికంగా ప్రకటించేవరకు సైనాయే నంబర్‌వన్.