Indian cricket coach
-
ఏడు నిమిషాల్లోనే...
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు పురోగతిలో కోచ్‌గా గ్యారీ కిర్‌స్టెన్ పోషించిన పాత్ర ఎంతో ప్రత్యేకం. టెస్టుల్లో టీమిండియా నంబర్‌వన్ స్థానానికి చేరుకోవడంతో పాటు 2011 వన్డే ప్రపంచకప్ చాంపియన్‌గా నిలవడం కిర్‌స్టెన్ హయాంలోనే జరిగింది. తాను కోచ్‌గా ఎంపిక కావడానికి సంబంధించి ఒక ఆసక్తికర అంశాన్ని అతను ఇటీవల పంచుకున్నాడు. కోచింగ్‌పై తనకు ఆసక్తి గానీ, అనుభవం గానీ లేవని... అసలు తనంతట తానుగా ఆ పదవి కోసం దరఖాస్తు కూడా చేసుకోలేదని కిర్‌స్టెన్ అన్నాడు. ‘భారత జట్టుకు శిక్షణ ఇవ్వగలవా అంటూ కోచింగ్ సెలక్షన్ కమిటీ సభ్యుడైన సునీల్ గావస్కర్‌నుంచి నాకు మెయిల్ వచ్చింది. ఏదో ఆకాశరామన్న ఉత్తరం అనుకొని పట్టించుకోలేదు. ఇంటర్వ్యూకు హాజరు కాగలవా అంటూ మళ్లీ అలాంటి మెయిల్ వస్తే నా భార్యకు చూపించాను. ఆమె కూడా నమ్మలేదు. పొరపాటున నాకు వచ్చిందేమోనని భావించింది. ఎందుకంటే నాకు అప్పటికీ ఎలాంటి కోచింగ్ అనుభవం లేదు’ అని కిర్‌స్టెన్ చెప్పాడు. చివరకు నిజమని నిర్ధారించుకొని ఇంటర్వ్యూకు వెళ్లాక జట్టు కెప్టెన్ అనిల్ కుంబ్లే కలిశాడని... తాను కోచ్ ఇంటర్వ్యూ కోసం వచ్చానని చెబితే కుంబ్లే పగలబడి నవ్వాడని గ్యారీ గుర్తు చేసుకున్నాడు. మొత్తంగా 7 నిమిషాల్లోనే తన ఇంటర్వ్యూ పూర్తయిందని, అప్పటికప్పుడు కోచ్ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చినట్లు ఈ దక్షిణాఫ్రికా మాజీ ఓపెనర్ వెల్లడించాడు. ‘ఇంటర్వ్యూ ప్యానెల్లో ఉన్న రవిశాస్త్రి కఠినమైన ప్రశ్న అడిగాడు. భారత జట్టును ఓడించేందుకు మీ దక్షిణాఫ్రికా జట్టు ఏం చేసేదని అతను ప్రశ్నించాడు. నాకు తెలుసు అది చెప్పడం అంత సులువు కాదని. అయితే పూర్తిగా వ్యూహాల గురించి మాట్లాడకుండా మూడు నిమిషాల్లో దానిని వారికి అర్థమయ్యేలా వివరించగలిగాను. భారత జట్టు భవిష్యత్తు గురించి మీ వద్ద ఏదైనా ప్రణాళిక ఉందా అని బోర్డు కార్యదర్శి ప్రశ్నించగా...నన్ను ఎవరూ అడగలేదని, సిద్ధమై రాలేదని చెప్పాను. అయినా సరే ఎంపిక కాగలిగాను’ అని కిర్‌స్టెన్ వివరించాడు. చాపెల్ పేరుతో కాంట్రాక్ట్... ఈ సమయంలో మరో ఆసక్తికర అంశం చోటు చేసుకుంది. తనను ఎంపిక చేస్తూ కాంట్రాక్ట్ ఇచ్చాక కోచ్ స్థానంలో పేరు చూసుకుంటే గ్యారీ కిర్‌స్టెన్‌కు బదులుగా గ్రెగ్ చాపెల్ (అంతకు ముందు కోచ్) పేరు రాసి ఉంది. దాంతో మీరు తప్పు లెటర్ ఇచ్చారంటూ కార్యదర్శికే వెనక్కి ఇచ్చేశాను. ఆయన పెన్‌తో చాపెల్ పేరు కొట్టేసి తన పేరు రాసిచ్చారని కిర్‌స్టెన్ నవ్వుతూ చెప్పాడు. -
రవిశాస్త్రి కొత్త ప్రేమ!
ముంబై: ఇంగ్లండ్ చేతిలో టెస్టు సిరీస్ ఓటమి అనంతరం జట్టుతో పాటు కోచ్ రవిశాస్త్రిపై ఒకవైపు తీవ్ర విమర్శలు సాగుతుండగా... మరోవైపు శాస్త్రి కొత్త ప్రేమ పురాణం ఒకటి బయటపడింది. స్థానిక మీడియా కథనం ప్రకారం గత రెండేళ్లుగా రవిశాస్త్రి, బాలీవుడ్ నటి నిమ్రత్ కౌర్‌తో రహస్యంగా డేటింగ్ చేస్తున్నాడు. ప్రముఖ కార్ల కంపెనీ ‘ఆడి’కి వీరిద్దరు సంయుక్తంగా బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ కారు ప్రచార కార్యక్రమంలో భాగంగా కలిసినప్పుడు మొదలైన ప్రేమే మరింత గాఢంగా మారిందని సమాచారం. బాలీవుడ్లో మంచి ప్రతిభావంతురాలైన నటిగా పేరు తెచ్చుకున్న 36 ఏళ్ల నిమ్రత్ ది లంచ్ బాక్స్, ఎయిర్‌లిఫ్ట్ చిత్రాలతో గుర్తింపు లభించింది. ప్రస్తుతం ఆమె టీవీ వెబ్ సిరీస్‌లలో నటిస్తోంది. క్రికెటర్‌గా ఉన్న రోజుల్లో సుదీర్ఘ కాలం నటి అమృతాసింగ్‌తో ప్రేమాయణం సాగించిన 56 ఏళ్ల రవిశాస్త్రి 1990లో రీతూ సింగ్‌ను పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికి పదేళ్ల వయసున్న కూతురు ఉంది. అయితే చాలా కాలంగా శాస్త్రి, అతని భార్య విడివిడిగా ఉంటున్నారు. -
మరింత సమయం కావాలి
కోచ్ ఎంపికపై సందిగ్ధంలో బీసీసీఐ లండన్: భారత క్రికెట్ జట్టు నూతన కోచ్ ఎంపిక ఆలస్యం కానుంది. ప్రస్తుత కోచ్ అనిల్ కుంబ్లేను కొనసాగించాలా? లేక మరొకరి పేరు ప్రకటించాలా? అని నిర్ణయించేందుకు క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) మరికొంత సమయం కావాలనుకుంటోంది. బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా, ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లాలతో పాటు చాలా మంది సీనియర్ అధికారులు కుంబ్లే వైపు మొగ్గుచూపుతుండడంతో ఆయన్నే కొనసాగిస్తారా.. అనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. కోచ్ ఎంపికపై గంగూలీ, సచిన్, లక్ష్మణ్‌లతో కూడిన సీఏసీ గురువారం సాయంత్రం సమావేశమై రెండు గంటలపాటు చర్చలు జరిపింది. అయితే ఈ విషయంలో స్పష్టత కోసం తమకు మరింత సమయం కావాలని బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రిని కమిటీ కోరింది. ‘సీనియర్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ ఎంపిక కోసం సీఏసీ గురువారం సమావేశమైంది. తగిన సమయంలో నిర్ణయం తీసుకుని తిరిగి బీసీసీఐకి తెలుపుతుంది’ అని బోర్డు కార్యదర్శి అమితాబ్ చౌదరి తెలిపారు. గతేడాది జూలైలో కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి 17 టెస్టుల్లో 12 విజయాలను అందించిన కుంబ్లేను పక్కనపెట్టేందుకు సీఏసీ కూడా విముఖంగానే ఉంది. మరోవైపు ఈనెల 26న బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్జీఎం) జరిగే వరకు కోచ్ వ్యవహారాన్ని వాయిదా వేయాలని తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా కార్యదర్శికి లేఖ రాశారు. దీంతో చాంపియన్స్ ట్రోఫీ అనంతరం కుంబ్లే అటునుంచి అటే విండీస్ పర్యటనకు కూడా వెళ్లే అవకాశాలుంటాయి. ఒకవేళ కుంబ్లే వెళ్లకుంటే సహాయక కోచ్ సంజయ్ బంగర్ జట్టుతో పాటు వెళతారు. నిజానికి కెప్టెన్ కోహ్లి చెప్పాడని కుంబ్లేను మారిస్తే బోర్డు పరిపాలక వ్యవహారాల్లోనూ తన అభిప్రాయానికి విలువ ఉంటుందనే సంకేతాలు పంపించినట్టవుతుందని, ఇది సరికాదని ఓ సీనియర్ అధికారి తెలిపారు. ‘మా జోక్యం ఉండదు’ కోచ్ఎంపిక వ్యవహారంలో తాము జోక్యం చేసుకోమని పరిపాలక కమిటీ (సీఓఏ) తేల్చి చెప్పింది. క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) నిర్ణయాన్ని తాము వ్యతిరేకించం. మా నుంచి ఎలాంటి జోక్యం ఉండదు. ఏదైనా సీఏసీ నిర్ణయమే ఫైనల్’ అని సీఓఏ వర్గాలు తెలిపాయి.