మరింత సమయం కావాలి | Need more time for coach seletion | Sakshi
Sakshi News home page

మరింత సమయం కావాలి

Published Fri, Jun 9 2017 11:31 PM | Last Updated on Tue, Sep 5 2017 1:12 PM

మరింత సమయం కావాలి

మరింత సమయం కావాలి

కోచ్‌ ఎంపికపై సందిగ్ధంలో బీసీసీఐ

లండన్‌: భారత క్రికెట్‌ జట్టు నూతన కోచ్‌ ఎంపిక ఆలస్యం కానుంది. ప్రస్తుత కోచ్‌ అనిల్‌ కుంబ్లేను కొనసాగించాలా? లేక మరొకరి పేరు ప్రకటించాలా? అని నిర్ణయించేందుకు క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ) మరికొంత సమయం కావాలనుకుంటోంది. బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా, ఐపీఎల్‌ చైర్మన్‌ రాజీవ్‌ శుక్లాలతో పాటు చాలా మంది సీనియర్‌ అధికారులు కుంబ్లే వైపు మొగ్గుచూపుతుండడంతో ఆయన్నే కొనసాగిస్తారా.. అనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. కోచ్‌ ఎంపికపై గంగూలీ, సచిన్, లక్ష్మణ్‌లతో కూడిన సీఏసీ గురువారం సాయంత్రం సమావేశమై రెండు గంటలపాటు చర్చలు జరిపింది. అయితే ఈ విషయంలో స్పష్టత కోసం తమకు మరింత సమయం కావాలని బీసీసీఐ సీఈవో రాహుల్‌ జోహ్రిని కమిటీ కోరింది. ‘సీనియర్‌ క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌ ఎంపిక కోసం సీఏసీ గురువారం సమావేశమైంది. తగిన సమయంలో నిర్ణయం తీసుకుని తిరిగి బీసీసీఐకి తెలుపుతుంది’ అని బోర్డు కార్యదర్శి అమితాబ్‌ చౌదరి తెలిపారు.

గతేడాది జూలైలో కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి 17 టెస్టుల్లో 12 విజయాలను అందించిన కుంబ్లేను పక్కనపెట్టేందుకు సీఏసీ కూడా విముఖంగానే ఉంది. మరోవైపు ఈనెల 26న బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎం) జరిగే వరకు కోచ్‌ వ్యవహారాన్ని వాయిదా వేయాలని తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా కార్యదర్శికి లేఖ రాశారు. దీంతో చాంపియన్స్‌ ట్రోఫీ అనంతరం కుంబ్లే అటునుంచి అటే విండీస్‌ పర్యటనకు కూడా వెళ్లే అవకాశాలుంటాయి. ఒకవేళ కుంబ్లే వెళ్లకుంటే సహాయక కోచ్‌ సంజయ్‌ బంగర్‌ జట్టుతో పాటు వెళతారు. నిజానికి కెప్టెన్‌ కోహ్లి చెప్పాడని కుంబ్లేను మారిస్తే బోర్డు పరిపాలక వ్యవహారాల్లోనూ తన అభిప్రాయానికి విలువ ఉంటుందనే సంకేతాలు పంపించినట్టవుతుందని, ఇది సరికాదని ఓ సీనియర్‌ అధికారి తెలిపారు.

‘మా జోక్యం ఉండదు’
కోచ్‌ఎంపిక వ్యవహారంలో తాము జోక్యం చేసుకోమని పరిపాలక కమిటీ (సీఓఏ) తేల్చి చెప్పింది. క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ) నిర్ణయాన్ని తాము వ్యతిరేకించం. మా నుంచి ఎలాంటి జోక్యం ఉండదు. ఏదైనా సీఏసీ నిర్ణయమే ఫైనల్‌’ అని సీఓఏ వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement