చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) టోర్నమెంట్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఎంపిక చేసిన జట్టును సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్(AB de Villiers) సమర్థించాడు. ఐసీసీ టోర్నీలో విజేతగా నిలిచేందుకు అన్ని రకాలుగా అర్హత ఉన్న టీమ్ అని కొనియాడాడు.
అతడిని తప్పించి మంచి పనిచేశారు
అదే విధంగా.. ఈ జట్టు నుంచి పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్(Mohammed Siraj)ను తప్పించడం కూడా సరైన నిర్ణయమేనని డివిలియర్స్ పేర్కొన్నాడు. పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి మొదలుకానున్న చాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో.. టీమిండియా మాత్రం తమ మ్యాచ్‌లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఆడనుంది.
తొలి మ్యాచ్‌లో భాగంగా దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో ఫిబ్రవరి 20న తలపడనుంది. అనంతరం ఫిబ్రవరి 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఢీకొట్టనున్న రోహిత్ సేన.. అనంతరం మార్చి 2న న్యూజిలాండ్‌తో పోటీపడుతుంది.
రోహిత్ శర్మ కెప్టెన్సీలో
ఇక ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించి వారం క్రితమే(జనవరి 18) బీసీసీఐ తమ జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో పదిహేను మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో సిరాజ్‌కు చోటు దక్కలేదు. పేస్ దళంలో నాయకుడు జస్‌ప్రీత్ బుమ్రాతో పాటు.. మరో సీనియర్ మహ్మద్ షమీ, యువ తరంగం అర్ష్‌దీప్ సింగ్‌లను సెలక్టర్లు ఎంపిక చేశారు.
ఈ విషయంపై స్పందించిన ఏబీ డివిలియర్స్.. చాంపియన్స్ ట్రోఫీ జట్టులో సిరాజ్ లేకపోయినా టీమిండియాపై పెద్దగా ప్రభావం పడబోదని పేర్కొన్నాడు. గత కొంతకాలంగా అతడు కాస్త ఆందోళనగా కనిపిస్తున్నాడన్న ఏబీడీ.. ఆస్ట్రేలియా పర్యటనలో ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేయడం ఇందుకు కారణం కావొచ్చన్నాడు.
కొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకోవాలి
ఆసీస్ టూర్‌లో తన శక్తి మొత్తాన్ని ఖర్చు చేసిన సిరాజ్ కొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకుంటేనే బాగుంటుందని డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. అంతేగాక కంగారూ గడ్డపై అతడి ప్రదర్శన అంతగొప్పగా కూడా లేదని.. ఇప్పట్లో అతడు బరిలోకి దిగకపోవడమే మంచిదని పేర్కొన్నాడు. అయితే, అద్భుతమైన నైపుణ్యాలున్న సిరాజ్.. త్వరలోనే టీమిండియాలోకి తిరిగి వస్తాడని విశ్వాసం వ్యక్తం చేశాడు.
ఇదొక విన్నింగ్ టీమ్
ఇక చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనబోయే జట్టు గురించి ఏబీ డివిలియర్స్ మాట్లాడుతూ.. ‘‘టోర్నమెంట్ విన్నింగ్ టీమ్ ఇది. భారత జట్టు తమ మ్యాచ్‌లను యూఏఈలో ఆడబోతోంది. కాబట్టి బ్యాటర్లు ప్రధామైన జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది.
ఐసీసీ టోర్నమెంట్లలో గెలవాలంటే పటిష్టమైన బ్యాటింగ్ ఆర్డర్ కలిగిన జట్టు ఉండాలి. వరల్డ్‌కప్ ఈవెంట్లలో ఆస్ట్రేలియా అనుసరించే వ్యూహాలను మనం చూస్తూనే ఉంటాం. వారి బ్యాటింగ్ ఆర్డర్ డీప్‌గా ఉంటుంది. వన్డే ప్రపంచకప్-2023లో అఫ్గనిస్తాన్‌పై వీరోచిత డబుల్ సెంచరీ చేసి.. మ్యాచ్‌ను గెలిపించిన గ్లెన్ మాక్స్‌వెల్ ప్రదర్శన ఇందుకు నిదర్శనం.
ఇక ఈ జట్టులో హార్దిక్ పాండ్యాతో పాటు ఆల్‌రౌండర్ల కోటాలో రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఉండటం టీమిండియాకు సానుకూలాంశం. లోయర్ ఆర్డర్‌లో ఈ ముగ్గురు నెగ్గుకురాగలరు’’ అని పేర్కొన్నాడు. ఏదేమైనా చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా సత్తా చాటడం ఖాయమని డివిలియర్స్ రోహిత్ సేనకు మద్దతు ప్రకటించాడు.
ఎనిమిది జట్లు
కాగా చాంపియన్స్ ట్రోఫీలో ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. ఆతిథ్య జట్టు హోదాలో పాకిస్తాన్.. వన్డే వరల్డ్‌కప్-2023 ప్రదర్శన ఆధారంగా ఆస్ట్రేలియా, టీమిండియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ అర్హత సాధించాయి. ఇక టీమిండియా.. పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌తో కలిసి గ్రూప్-‘ఎ’లో ఉంది.
చదవండి: జైస్వాల్ టీ20 జట్టులో ఉండాలి.. గైక్వాడ్ సంగతేంటి? చీఫ్ సెలక్టర్‌గా ఉంటే..
Comments
Please login to add a commentAdd a comment