ఉద్యోగాలు రావడం ఇక చాలాకష్టం!
ముంబై : ఉద్యోగవకాశాలు ఎదురుచూస్తున్న వారికి బ్యాడ్ న్యూస్. గతేడాదితో పోలిస్తే ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఉద్యోగవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని తాజా రిపోర్టులు పేర్కొంటున్నాయి. కంపెనీల్లో ఆటోమేషన్ టెక్నాలజీ పెరగడం, అంతర్జాతీయంగా వ్యాపారాల్లో అనిశ్చితి పరిస్థితులు నెలకొనడం, అవసరమైన నైపుణ్యాలకు తగిన ప్రతిభావంతులు దొరకకపోవడం ఈ త్రైమాసికంలో ఉద్యోగాలకు భారీగా గండికొడుతుందని వెల్లడవుతోంది. 4,389 మంది ఉద్యోగులపై నిర్వహించిన మ్యాన్పవర్గ్రూప్ ఎంప్లాయిమెంట్ అవుట్ లుక్ సర్వే క్యూ2 2017లో కేవలం 19 శాతం మంది ఉద్యోగులు మాత్రమే తమ స్టాఫ్ ను పెంచాలని యోచిస్తున్నట్టు చెప్పారు. 1 శాతం ఉద్యోగులు తమ స్టాఫ్ తగ్గించుకోనున్నట్టు తెలిపారు. ఈ సర్వేలో గరిష్టంగా 68 శాతం మంది అసలు తమ ఎంప్లాయ్ మెంట్ లో ఎలాంటి మార్పులు చేయబోమని వెల్లడించారు.
దీంతో నికరంగా ఈ త్రైమాసికంలో ఎంప్లాయ్ మెంట్ అవుట్ లుక్ +18శాతంగానే ఉండబోతుందని ఈ సర్వే తెలిపింది. 2017 జనవరి-మార్చి క్వార్టర్లో ఈ నికర ఎంప్లాయిమెంట్ అవుట్ లుక్ +21 శాతంగా, 2016 ఏప్రిల్-జూన్ లో+38 శాతంగా ఉంది. ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్న కొత్త ఉద్యోగులను నియమించుకునే ప్రక్రియ మున్ముందు సన్నగిల్లుతుందని మ్యాన్పవర్గ్రూప్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఏజీ రావ్ కూడా తెలిపారు. అయితే ఏడు ఇండస్ట్రి సెక్టార్లలో వర్క్ ఫోర్స్ పెరుగుతుందని భావిస్తున్నామని తాజా సర్వే పేర్కొంది. ఎక్కువగా సర్వీసు సెక్టార్లో ఉద్యోగవకాశాలు పెరుగుతాయని చెప్పారు. తర్వాత పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎడ్యుకేషన్ సెక్టార్, రిటైల్ ట్రేడ్ సెక్టార్లలో ఎంప్లాయిమెంట్ అవుట్ లుక్ బాగుంటుందని సర్వే రిపోర్టు వెల్లడించింది. ట్రాన్స్పోర్టేషన్, యుటిలిటీస్ సెక్టార్ భారీగా పడిపోతుందని తెలిపింది.