మరో గూగుల్‌ని తయారుచేసే సత్తా భారతీయులకి ఉంది
న్యూయార్క్: భారత ఔత్సాహిక ఆవిష్కర్తలకు గూగుల్ లాంటి మరో దిగ్గజాన్ని రూపొందించే సామర్థ్యం ఉందని సెర్చి ఇంజిన్ గూగుల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎరిక్ ష్మిట్ వ్యాఖ్యానించారు. ‘సిలికాన్ వ్యాలీలో అనేక మంది భారతీయులు సత్తా చాటుతున్నారు. అలాంటప్పుడు యువ ఆవిష్కర్తలు ఒకవేళ స్వదేశంలోనే ఉండి దిగ్గజాల్లాంటి కంపెనీలను సృష్టిస్తే ఎలా ఉంటుందో ఊహించండి. వారు ప్రపంచాన్నే మార్చేయగలరు’అంటూ కితాబిచ్చారు. అయితే, ప్రస్తుతం భారత్‌లో ఇంటర్నెట్ వినియోగం చాలా తక్కువగా ఉందని, దీన్ని ఇంకా పెంచాల్సి ఉందని ‘రీఇమేజినింగ్ ఇండియా’ పుస్తకంలో రాసిన వ్యాసంలో ఆయన పేర్కొన్నారు.
మరోవైపు, దేశీయంగా మహిళలకు ఇంటర్నెట్‌ని చేరువ చేసే చర్యల్లో భాగంగా గూగుల్... హెచ్డబ్ల్యూజీవోడాట్కామ్ వెబ్‌సైట్‌ని రూపొందించింది. ఇందులో ఇంటర్నెట్ ప్రాథమికాంశాల గురించి హిందీ, ఇంగ్లిష్‌లో కంటెంట్ ఉంటుందని గూగుల్ ఇండియా ఎండీ రాజన్ ఆనందన్ తెలిపారు. అలాగే, ఇంటర్నెట్ సంబంధిత సందేహాలు తీర్చేందుకు మహిళల కోసం ప్రత్యేకంగా ‘1800 41 999 77’ టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్‌ను కూడా ప్రారంభించినట్లు వివరించారు.