‘సాక్షి’ సిబ్బందిపై దాడికి ఖండన
→రక్షణ కల్పించటంలో ప్రభుత్వం విఫలం
→ఐజేయూ నాయకుడు అంబటి విమర్శ
→ఎమ్మెల్యే జలీల్ఖాన్ను అరెస్ట్ చేయాలని డిమాండ్
→తహశీల్దార్, అడిషనల్ సీపీలకు వినతి
→జిల్లాలో పలుచోట్ల ప్రదర్శన, ధర్నాలు
విజయవాడ (భవానీపురం) : రాష్ట్రంలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు, పోలీస్ చర్యలు ఎమర్జెన్సీ రోజులను తలపిస్తున్నాయని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ) జాతీయ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు ఆందోళన వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీయూడబ్ల్యూజే కృష్ణా అర్బన్ యూనిట్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ప్రదర్శన, ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో తొలుత గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్ నుంచి ప్రారంభమైన ప్రదర్శన అలంకార్ సెంటర్, ఏలూరు రోడ్డు, అప్సర సెంటర్ మీదుగా చల్లపల్లి బంగ్లా వద్దకు చేరుకుంది. అక్కడ జర్నలిస్టులందరూ మానవహారంగా ఏర్పడి ‘పత్రికా స్వేచ్ఛను కాపాడాలి’, ‘జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డులు ఇవ్వాలి’, ‘సాక్షి ఫొటో, వీడియో జర్నలిస్టులపై దాడి ఘటనలో ఎమ్మెల్యే జలీల్ఖాన్ను అరెస్ట్ చేయాలి’,‘జలీల్‌ఖాన్ డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు. అక్కడి నుంచి ర్యాలీ ప్రెస్‌క్లబ్‌కు చేరుకున్న అనంతరం ధర్నా నిర్వహించి జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ఖండించారు.
దాడికి ఖండన...
ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ రాజధాని భూములపై వచ్చిన కథనాలపై వాటి మూలాలు చెప్పాలంటూ ‘సాక్షి’ విలేకరులను పోలీసులు ప్రశ్నించడం పత్రికా స్వేచ్ఛను హరించడమేనని అన్నారు. ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ సమక్షంలో సాక్షి ఫొటో, వీడియో జర్నలిస్టులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. జలీల్‌ఖాన్‌తో పాటు దాడికి పాల్పడిన ఆయన అనుచరులపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. జలీల్ వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు.
అడిషనల్ సీపీ, తహశీల్దార్లకు వినతి
ధర్నా అనంతరం జర్నలిస్టులు తహశీల్దారు కార్యాలయానికి చేరుకుని తహశీల్దారు ఆర్.శివరావుకు వినతి పత్రం అందజేశారు. ఆ తర్వాత పోలీస్ కమిషనరేట్‌లోని అడిషనల్ సీపీ మహేష్‌చంద్ర లడ్హాకు మరొక వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే డెప్యూటీ ప్రధాన కార్యదర్శి కె.జయరాజ్, అర్బన్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు జి.రామారావు, దారం వెంకటేశ్వరరావు, ఐజేయూ నేషనల్ కౌన్సిల్ సభ్యుడు జి.రాజా రమేష్, ఏపీ ఫొటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సాంబశివరావు, కోశాధికారి టి.వి రమణ, అమరావతి వీడియో జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ సభ్యులు, యూనియన్ నాయకులు షేక్ బాబు, డి నాగరాజు, కొండా రాజేశ్వరరావు, వసంత్, షఫీ ఉల్లా, వి.పుల్లయ్య, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.
కొందరిని విడదీయటం సరికాదు...
2004లో ఏవిధంగా అందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇచ్చారో ఇప్పుడు కూడా అదే మాదిరిగా ఇవ్వాలని అంబటి కోరారు. స్వార్థంతో కొందరిని విడతీయటం సరికాదన్నారు. రెండే ళ్లుగా జర్నలిస్టులకు హెల్త్ కార్డులు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఏడాది క్రితం ప్రభుత్వానికి రూ.98 లక్షలు చెల్లించినా ఇంతవరకు ఎవరికీ ఉపయోగపడలేదన్నారు. తూర్పుగోదావరి జిల్లా అల్లవరం విలేకరి స్వామినాయుడుపై మట్టి మాఫియా దాడిలోని దోషులందరినీ అరెస్ట్ చేసి భవిష్యత్‌లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. జర్నలిస్ట్‌ల సమస్యలపై ప్రభుత్వం పక్షపాత ధోరణిని విడనాడాలన్నారు. సమాజ హితం కోరే జర్నలిస్టులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, నిందితులు ఎవరైనా ఉపేక్షించకుండా వెంటనే అరెస్ట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.