పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు
కమలం వికసించాలి
అన్ని చోట్లా బీజేపీ అధికారంలోకి రావాలి
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా
బెంగళూరు: గ్రామ పంచాయతీ స్థాయి నుంచి పార్లమెంటు వరకు భారతీయ జనతా పార్టీ అధికారాన్ని కైవసం చేసుకోవాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పేర్కొన్నారు. ఇందుకు గాను ముందుగా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో ప్రతి కార్యకర్త కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. నగరంలోని ప్యాలెస్ గ్రౌండ్స్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన దక్షిణ భారత మహా సంపర్క్ అభియాన్‌ను ప్రారంభించిన అనంతరం పార్టీ శ్రేణులను ఉద్దేశించి అమిత్‌షా మాట్లాడారు. 2015 చివరి నాటికి దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా కేంద్రాల్లోనూ పార్టీ కార్యాలయాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇక దేశ వ్యాప్తంగా జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు గాను మహా సంపర్క అభియాన్‌ను ప్రారంభించినట్లు చెప్పారు. మహా సంపర్క అభియాన్‌లో మొత్తం 17 విభాగాలు పనిచేయనున్నాయన్నారు.
ఏడాదిలో కేంద్ర ప్రభుత్వం మొత్తం 24 ప్రజా సంక్షేమ పథకాలను ప్రారంభించిందని చెప్పారు. ఈ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకు కార్యకర్తలు శ్రమించాలన్నారు. విపక్షాలు చేసే ఆరోపణలు, విమర్శలను పార్టీ శ్రేణులు ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. దేశవ్యాప్తంగా పార్టీలో సభ్యత్వం పొందిన వారి వివరాలను డిజిటల్ రూపంలో నిక్షిప్తం చేసే దిశగా ప్రణాళిక రూపొందిస్తున్నామని, దీనికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వం వహించనున్నారని వెల్లడించారు. పశ్చిమబెంగాల్‌తో పాటు ఒడిశా, అసోం, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.