కీర్తి ఘనం.. వసతులు శూన్యం!
సాక్షి, గుంటూరు: గుంటూరు వైద్య కళాశాల.. 70 ఏళ్ల కీర్తి కిరీటాన్ని తలపై అలంకరించుకున్న వైద్య దేవాలయం.. ఎందరో నిష్ణాతులైన వైద్యులను, మరెందరో ఉద్ధండులైన రాజకీయ నాయకులను జిల్లా నుంచి అందించిన కీర్తి మకుటం.. ఇక్కడ సీటు వస్తే చాలు.. జీవితంలో ఉన్నత శిఖరాల ఆనందపు అంచులు అందుకున్నంత సంబరం..ఇదంతా గతం.. కాలక్రమేణా పాలకుల అసమర్థత వైద్య కళాశాలలోని ప్రతి మూలలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. మంచి కళాశాలలో సీటు వచ్చిందనే ఆనందాన్ని ఆదిలోనే ఆవిరి చేస్తోంది.
ఎన్నో ఆశలతో మరెన్నో ఆకాంక్షలతో కాలేజీలోకి అడుగు పెడితే.. అడుగడుగునా సమస్యల తోరణం గుమ్మంలోనే స్వాగతం పలుకుతోంది. కనీసం కూర్చొని పాఠాలు వినడానికి సరిపడా తరగతి గదిలేని దయనీయ స్థితి కళాశాల దుస్థితికి అద్దం పడుతోంది. సౌకర్యాలపై సర్దుకుపోయినా పాఠాలు పూర్తిగా చెప్పే గురువులు లేని దుస్థితి రేపటి భవిష్యత్‌ను ఆందోళనలో పడేస్తోంది. ఆరేళ్ల క్రితం ఎంబీబీఎస్ సీట్లు పెరిగాయని సంతోషపడినంతలోనే.. వసతులలేమి దుఃఖంలో ముంచెత్తుతోంది. మొత్తంగా ఉన్నతాధికారుల చెవికి చేరని వైద్య విద్యార్థుల వేదన కాలేజీలో నాలుగు గోడల మధ్యే కన్నీరవుతోంది.
రాష్ట్ర రాజధాని జిల్లా గుంటూరులో ఉన్న గుంటూరు వైద్య కళాశాలలో సరైన సౌకర్యాలు లేక వైద్య విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. సరిపడా వైద్యులు కూడా లేకపోవటంతో చికిత్స కోసం వివిధ జిల్లాల నుంచి వచ్చే పేద రోగులు సైతం సకాలంలో వైద్యం అందక అల్లాడిపోతున్నారు. గత ప్రభుత్వం రాజధాని జిల్లాలోని వైద్య కళాశాలలో సౌకర్యాలు ఏర్పాటు చేయకుండా మిన్నకుండిపోయింది. పేరుకే జిల్లా రాజధానిలో ఉన్న వైద్య కళాశాల అని చెప్పుకోవటమే మినహా వైద్య విద్యార్థులకు తరగతి గదిలో కూర్చుని పాఠాలు వినేందుకు కూడా కనీస సౌకర్యాలు లేవు. కళాశాల ప్రిన్సిపాల్‌గా నియమించిన డాక్టర్ గుంటుపల్లి సుబ్బారావును మూడేళ్ల క్రితం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అర్హత లేని వ్యక్తిగా నిర్ధారించింది.
మెడికల్ కౌన్సిల్ తనిఖీలకు గుంటూరు వైద్య కళాశాలకు వచ్చిన సమయంలో అర్హత లేని డాక్టర్ సుబ్బారావుని పక్కన కూర్చోబెట్టి డాక్టర్ మోహనరావును ఆ స్థానంలో ఉంచారు. దీంతో సీనియర్స్ ప్రాధాన్యత లేకపోయింది. దీనంతటికీ టీడీపీ ప్రభుత్వ తీరే కారణమని సీనియర్ వైద్యులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఎందరో ఆణిముత్యం లాంటి వైద్యులను ప్రపంచానికి అందించిన ఘనత అందుకున్న గుంటూరు వైద్య కళాశాలలో నేడు కనీసం బోధన చేసేందుకు సరిపడా సిబ్బంది లేరు. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడకు వెళ్లినా అక్కడ గుంటూరు వైద్య కళాశాలలో చదువుకున్న వైద్యులు కనిపిస్తారు. వైద్య కళాశాలకు సుమారు 70 ఏళ్ల చరిత్ర ఉంది. ఇక్కడ చదువుకున్న వైద్యులు చాలా మంది దేశంలోని ఉన్నత పదవులను సైతం అలంకరించారు. అమెరికాలో ప్రసిద్ధి చెందిన వైద్యుల్లో చాలా మంది గుటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థులే.
వైద్యుల పోస్టుల ఖాళీలతో బోధన ఎలా?
గుంటూరు వైద్య కళాశాల ప్రారంభంలో తొలి బ్యాచ్‌లో కేవలం 50 మంది ఎంబీబీఎస్ వైద్య విద్యార్థులు ఉండగా 1960 సంవత్సరం నాటికి 150 మందికి పెరిగారు. 2013–14 విద్యా సంవత్సరంలో గుంటూరు వైద్య కళాశాలకు 50 సీట్లు అదనంగా వచ్చి ప్రస్తుతం 200 మంది వైద్య విద్యార్థులు ఎనిమిదో బ్యాచ్ 2019–20 సంవత్సరానికి అడ్మిషన్లు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. నీట్ ఫలితాలు కూడా ప్రకటించటంతో వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీట్లు భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. సూపర్ స్పెషాలిటీ, స్పెషాలిటీ వైద్య విభాగాలన్నీ కలిపి 32 వరకు జీజీహెచ్‌లో, వైద్య కళాశాలలో ఉన్నాయి. పీజీ సీట్లు 100 ఉండగా ఏడాదికి వంద మందికిపైగా పారా మెడికల్ కోర్సులను అభ్యసిస్తున్నారు. వీరందరికీ బోధన చేసేందుకు కళాశాలలో 66 మంది ప్రొఫెసర్లు, 50 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 201 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులను ప్రభుత్వం కేటాయించింది. అయితే ఈ పోస్టుల్లో చాలా వరకు ఖాళీగా ఉండటంతో బోధన అంతంతమాత్రమే జరుగుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏడు ప్రొఫెసర్, 3 అసోసియేట్ ప్రొఫెసర్స్ 3, 24 అసిస్టెంట్ ప్రొఫెసర్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
200 సీట్లకు సరిపడా వైద్యులు ఎక్కడ ?
భారత వైద్య మండలి(ఎంసీఐ) నిబంధనల ప్రకారం గుంటూరు వైద్య కళాశాలలో బోధన సిబ్బంది లేరు. ప్రతి ఏడాది ఎంసీఐ తనిఖీల సమయంలో బోధనా సిబ్బంది ఉన్నట్లు రికార్డుల్లో చూపిస్తున్నారు. దీంతో వైద్య విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న ఖాళీగా ఉన్న 34 ఖాళీ పోస్టులతోపాటు పెరిగిన సీట్లకు అనుగుణంగా మరో 15 నుంచి 20 వైద్యుల పోస్టులు అవసరం. ముఖ్యంగా సీనియర్ రెసిడెంట్ వైద్యుల కొరత వేధిస్తోంది. సూపర్ స్పెషాలిటీ, పీజీ సీట్లకు గుర్తింపు రావాలంటే అసోసియేట్ ప్రొఫెసర్స్‌ను నూతనంగా మంజూరు చేయాల్సి ఉంది. ఈ పోస్టులు సరిపడా లేకపోవటంతో వైద్యులకు పదోన్నతులు కూడా సక్రమంగా రాని దుస్థితి నెలకొంది. గత ప్రభుత్వం కింది స్థాయి అసిస్టెంట్స్‌కు పదోన్నతులు కల్పించింది. అసోసియేట్స్, ప్రొఫెసర్స్‌కు పదోన్నతులు ఇవ్వలేదు. దీంతో వారు పదోన్నతి పొందే అవకాశం లేకుండాపోయింది.
కూర్చొనే చోటు కూడా లేదు
ఎంబీబీఎస్ వైద్య విద్యార్థులు సైతం తరగతి గదుల్లో కూర్చునేందుకు కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు. తరగతి గదులు 125 మంది మాత్రమే కూర్చునేందుకు సరిపోయేలా నిర్మాణం చేశారు. ప్రస్తుతం 200 మంది వైద్య విద్యార్థులు ఉండటంతో కొంత మంది ఇరుక్కుని కూర్చుని లేదా నిలబడే క్లాసులు వినాల్సి వస్తుంది. తరగతి గదుల్లో గాలి, వెలుతురు ప్రసరణ లేదు. విద్యార్థులకు క్లాస్ రూమ్‌లోని బ్లాక్ బోర్డు చాలా దూరంగా ఉండి కంటి సమస్యలు వస్తున్నట్లు పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు వాపోవుతున్నారు. మంచినీరు, మరుగుదొడ్డి సౌకర్యాలు సరిపడా లేక వైద్య విద్యార్థులకు అవస్థలు తప్పటం లేదు. మళ్లీ కేంద్ర ప్రభుత్వం మరో 50 సీట్లు మంజూరు చేస్తామని ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న సీట్లకే వైద్యులు, వైద్య సౌకర్యాలు లేక సతమతవుతుంటే అదనంగా వచ్చే 50 ఎంబీబీఎస్ సీట్లకు ఏ విధంగా వసతుల కల్పిస్తారో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
రోగులకు తప్పని ఇక్కట్లు
గుంటూరు వైద్య కళాశాలకు అనుబంధంగా గుంటూరు జీజీహెచ్ ఉంది. ఇక్కడ ఓపీలో వైద్య సేవలు పొందేందుకు ప్రతి రోజూ నాలుగు వేల మంది రోగులు వస్తున్నారు. వీరికి వైద్యసేవలను అందించే వైద్యులు సరిపడా లేరు. దీంతో రోగులు అల్లాడుతున్నారు. ప్రస్తుతం 200 ఎంబీబీఎస్ సీట్లకు అనుగుణంగా ఆస్పత్రిలో 15 వైద్య యూనిట్స్‌ను పెంచాల్సి ఉంది. ఒక్కో యూనిట్లో ఒక ప్రొఫెసర్, ఒక అసోసియేట్ ప్రొఫెసర్, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్, సీనియర్ రెసిడెంట్ పోస్టులను మంజూరు చేయాలి.