మా అనుమతితోనే వెళ్లాలి!
* విదేశాల్లో ఎంబీబీఎస్ చదువుకోసం వెళ్లేవారికి ఎంసీఐ సూచన
* లేదంటే సర్టిఫికెట్లను రిజిస్ట్రేషన్ చేయలేమని స్పష్టీకరణ
* అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ, ఈ ఏడాది నుంచే అమల్లోకి
సాక్షి, హైదరాబాద్: ఏటా వేలాది మంది విద్యార్థులు కన్సల్టెన్సీల మాటలు నమ్మి విదేశాల్లో ఎంబీబీఎస్ చదివేందుకు వెళ్తున్నారు. అయితే వీళ్లంతా కోర్సు పూర్తిచేసి తిరిగొచ్చాక వారి సర్టిఫికెట్లను రిజిస్ట్రేషన్ చేసేందుకు భారతీయ వైద్యమండలి అంగీకరించడం లేదు.
కారణం వారు చదివిన కాలేజీలకు గుర్తింపు లేకపోవడమో, ప్రమాణాలు పాటించకపోవడమో సాకుగా చూపుతున్నాయి. మరి ఈ సమస్యకు పరిష్కారమేంటి? ..తామే చెబుతామంటోంది ఎంసీఏ. వైద్యవిద్య చదివేందుకు ఏ దేశానికి వెళ్తున్నారో, ఏ కాలేజీలో చదువుతున్నారో ముందుగానే తమకు చె ప్పాలని, తాము అనుమతిస్తేనే వెళ్లాలని సూచిస్తోంది. లేదంటే వచ్చాక తాము సర్టిఫికెట్లను రిజిస్ట్రేషన్ చేయలేమని చెబుతోంది. ఇందుకు సంబంధించిన ఆదేశాలను అన్ని రాష్ట్రాలకు పంపింది.
ఈ ఆదేశాల్లో.. ‘భారతదేశం నుంచి ఎవరైనా విదేశాలకు ఎంబీబీఎస్ చదవడానికి వెళ్లాలనుకుంటే దేశం విడిచి వెళ్లేముందే భారతీయ వైద్యమండలి నుంచి అర్హత ధ్రువపత్రం తీసుకోవాలి. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ 1956 ప్రకారం ఈ సర్టిఫికెట్ తీసుకుని వెళితేనే విదేశాల్లో చేసిన ఎంబీబీఎస్ డిగ్రీని అనుమతిస్తాం. లేదంటే దాన్ని అంగీకరించలేమ’ని తెలిపింది. ఇది ఈ విద్యాసంవత్సరం నుంచే అమల్లోకి వస్తుందని స్పష్టంచేసింది. ఈ నిబంధన 2014 నుంచే ఉన్నా చాలామంది అనుమతి లేకుండానే వెళ్తున్నారని ఎంసీఐ పేర్కొంది.
ఇవి తప్పనిసరి...
* విదేశాల్లో చదవడానికి వెళ్లేముందే ఎంసీఐ రూపొందించిన ప్రత్యేక దరఖాస్తు పూర్తిచేయాలి.
* దరఖాస్తు ఫారాలను www.mciindia.org వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని, ఢిల్లీలోని ఎంసీఐ ప్రధాన కార్యాలయంలో అందజేయాలి.
* ఎంబీబీఎస్ చదివేందుకు అర్హత కలిగిన ధ్రువపత్రాలను అందజేయాలి.