indian nationals
-
ఇంగ్లండ్, వేల్స్ విదేశీ నివాసితుల్లో భారతీయులదే అగ్రస్థానం
లండన్: ఇంగ్లండ్, వేల్స్లో ఉండే ప్రతి ఆరుగురిలో ఒకరు విదేశాల్లో పుట్టిన వారే కాగా, ఇందులో 1.5 శాతంతో భారతీయులు అగ్రభాగంలో ఉన్నట్లు తేలింది. ఇంగ్లండ్, వేల్స్‌లోని నివాసితుల్లో విదేశాల్లో జన్మించిన వారు 2011లో 75 లక్షల మంది (13.4%) ఉండగా, 2021 నాటికి కోటి మంది (16.8%)కి చేరారని యూకే ఆఫీస్ ఆఫ్ నేషనల్ స్టాటిస్టిక్స్ (ఓఎన్ఎస్) గణాంకాలను వెలువరించింది. ఇంగ్లండ్, వేల్స్ నివాసితుల్లో యూకే వెలుపల జన్మించిన వారిలో అత్యధికులు 9.20 లక్షల మంది భారత్‌కు చెందిన వారే. ఆ తర్వాతి స్థానంలో 7.43 లక్షల మంది (1.2%)తో పోలండ్, 6.24 లక్షల మంది (1%)తో పాకిస్తాన్ మూడో స్థానంలో నిలిచాయి. 2011లో చేపట్టిన గణాంకాల్లోనూ భారత్, పోలండ్, పాకిస్తాన్‌లే మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయని తెలిపింది. కాగా, యూకేలోని స్కాట్లాండ్, నార్తర్న్ ఐర్లాండ్ ప్రాంతాల వివరాలను ఓఎన్ఎస్ పేర్కొనలేదు. ఇదీ చదవండి: COP 27: పాపం మీది.. పరిహారమివ్వండి.. పేద దేశాల డిమాండ్ -
యూఎస్ నుంచి 161 మంది వెనక్కు
వాషింగ్టన్: అమెరికాలోకి మెక్సికో సరిహద్దు ద్వారా అక్రమంగా చొరబడిన 161 మంది భారతీయులను ఆ దేశం ఈ వారం వెనక్కు పంపనుంది. అమెరికాలో ఉండేందుకు వారికి ఉన్న న్యాయపరమైన అవకాశాలు అన్నీ ముగిశాయని తెలిపింది. ప్రత్యేక విమానంలో వారిని పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు పంపించనున్నారు. ఆ 161 మందిలో హరియాణాకు చెందిన వారు 76 మంది, పంజాబ్‌కు చెందినవారు 56 మంది, గుజరాత్‌కు చెందిన వారు 12 మంది, యూపీవారు ఐదుగురు, మహారాష్ట్రవారు నలుగురు, కేరళ, తెలంగాణ, తమిళనాడు వారు ఇద్దరు చొప్పున, ఆంధ్రప్రదేశ్, గోవాలకు చెందినవారు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. వీరిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. అమెరికాలోని 95 జైళ్లలో ఉన్న 1739 మంది భారతీయుల్లో వీరు కూడా భాగమేనని నార్త్ అమెరికన్ పంజాబీ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సత్నామ్ సింగ్ చాహల్ వెల్లడించారు. అక్రమంగా ప్రవేశించిన వీరందరిని ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్(ఐసీఈ) అధికారులు అరెస్ట్ చేశారు. స్వదేశంలో వివక్షను, హింసను ఎదుర్కొంటున్నామని, అమెరికాలో తమకు ఆశ్రయం కల్పించాలని వీరిలో అత్యధికులు కోర్టును వేడుకుంటున్నా.. వారి వాదనను అమెరికాలోని కోర్టులు విశ్వసించడం లేదని చాహల్ తెలిపారు. ఉత్తర భారతదేశంలో, ముఖ్యంగా పంజాబ్‌లో మనుషుల అక్రమ రవాణాదారులున్నారని, వారికి అధికారులు కూడా సహకరిస్తున్నారని ఆయన ఆరోపించారు. వారు యువకుల నుంచి రూ. 35 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు వసూలు చేసి, అమెరికాలోకి అక్రమంగా పంపిస్తున్నారన్నారు. 2019లో 1616 మంది భారతీయులను అమెరికా భారత్‌కు పంపించింది. -
311 మంది భారతీయులను వెనక్కి పంపిన మెక్సికో
మెక్సికో సిటీ: సరైన అనుమతులు లేకుండా తమ దేశంలో ఉంటున్న 311 మంది భారతీయులను మెక్సికో అధికారులు వెనక్కి పంపించారు. ఈ మేరకు తమ దేశంలో ఉండేందుకు సరైన అనుమతులు లేని భారతీయులను టొలుకా విమానాశ్రయం నుంచి ప్రత్యేక బోయింగ్ 747 విమానంలో భారత్‌కు తిప్పి పంపినట్లు మెక్సికన్ జాతీయ వలసల సంస్థ (ఐఎన్ఎమ్) ఓ ప్రకటనలో పేర్కొంది. మెక్సికన్ సరిహద్దుల నుంచి పెరుగుతున్న వలసలను నివారించేందుకు ఆ దేశంపై టారిఫ్‌ల భారం పెంచుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరించిన నేపథ్యంలో మెక్సికో ఈ చర్యకు పూనుకుంది. సరిహద్దుల వెంబడి నిఘా పెంచడంతోపాటు వలసదారులను దేశంలోకి అనుమతించే పాలసీని సవరించాలని నిర్ణయించింది. అక్రమ వలసదారులను తిప్పి పంపించే విషయంలో భారతీయ దౌత్య కార్యాలయం మంచి సహకారం అందించిందని, కృతజ్ఞతలు తెలిపింది. -
జీవిత భాగస్వామికి ఎక్స్2 వీసాకు ఓకే
న్యూఢిల్లీ: విదేశీ పౌరుల్ని వివాహం చేసుకునే భారతీయులకు కేంద్రం శుభవార్త తెలిపింది. భారతీయుల్ని పెళ్లి చేసుకున్న విదేశీయులు తమ పర్యాటక వీసాలను ఎక్స్2(డిపెండెంట్) వీసాలుగా మార్చుకునేలా నిబంధనల్ని సవరించనున్నట్లు వెల్లడించింది. ఇటీవల ఓ భారతీయుడు ఫిలిప్పైన్స్ మహిళను అక్కడే వివాహం చేసుకున్నారు. అనంతరం ఆమె పర్యాటక వీసాపై భారత్‌కు వచ్చారు. ఆ తర్వాత పర్యాటక వీసాను ఎక్స్2 వీసాగా మార్చాలని వధువు దరఖాస్తు చేసుకోగా నిబంధనలు అంగీకరికపోవడంతో అధికారులు దాన్ని తిరస్కరించారు. ఫిలిప్పైన్స్కు వెళ్లి ఎక్స్2 వీసా కోసం మరోసారి దరఖాస్తు చేసుకోవాలని ఆమెకు సూచించారు. దీంతో ఆమె భర్త ఈ విషయమై హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఫిర్యాదు చేశారు. రాజ్‌నాథ్ ఆదేశాలతో వెంటనే స్పందించిన హోంశాఖ.. పర్యాటక వీసాను ఎక్స్2 వీసాగా మార్చేందుకు అడ్డుగా ఉన్న నిబంధనల్ని సవరించనున్నట్లు తెలిపింది. అలాగే భారతీయులు విదేశాల్లో పెళ్లి చేసుకుంటే వారి జీవిత భాగస్వామికి ఎక్స్2 వీసా ఇచ్చేందుకు ఇప్పటివరకూ అడ్డంకిగా ఉన్న నిబంధనల్ని మార్చనున్నట్లు వెల్లడించింది. కాగా, ఈ వెసులుబాటు పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, సూడాన్, ఇరాక్ దేశాలు, పాక్ సంతతి పౌరులు, ఏ దేశానికి చెందనివారికి వర్తించబోదని పేర్కొంది. -
ఎన్నారైలకు కొత్త మెలిక.. భారతీయులకు కూడా..
న్యూఢిల్లీ: పెద్ద నోట్లను డిపాజిట్ చేసే ఎన్ఆర్ఐలు, విదేశాల్లో ఉంటున్న భారతీయుల విషయంలో ఆర్థిక శాఖ కొత్త మెలిక పెట్టింది. డిపాజిట్ కంటే ముందు వారు కస్టమ్స్ అధికారుల నుంచి ధ్రువీకరణ పత్రాలు పొంది, ఆ పత్రాల్లో ఎంతడబ్బైతే పేర్కొన్నారో అంతమాత్రమే ఆర్బీఐ శాఖల్లో జమ చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు ఒక పేజీ ప్రకటనను ఆర్థికశాఖ విడుదల చేసింది. పెద్ద నోట్లను రద్దు చేసి పాత రూ.500, రూ.1000 నోట్లను డిపాజిట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పెట్టిన 50 రోజులగడువు పూర్తయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎన్ఆర్ఐలకు, విదేశాల్లో ఉంటున్న భారతీయులకు, ప్రస్తుతం విదేశాలకు వెళుతున్న వారికి, స్పష్టమైన వివరణలో ఇస్తే ఇక్కడే ఉంటున్నవారికి మాత్రమే పాత నోట్లను జమ చేసేందుకు అవకాశం ఇస్తున్నారు. అయితే, విదేశాలకు వెళ్లే భారతీయులకైతే మార్చి 31 వరకు, ఎన్ఆర్ఐలకు జూన్ 30 వరకు ఆర్బీఐశాఖల్లో డబ్బు డిపాజిట్ చేసే అవకాశం ఉంది. కాగా, విదేశాల నుంచి తమ పాత నగదును డిపాజిట్ చేసేందుకు భారత్‌కు వచ్చే వారు ఆయా విమానాశ్రయాల్లో తొలుత తాము డిపాజిట్ చేసే పాత డబ్బును చూపించాల్సి ఉంటుంది. అర్హులైన భారత పౌరులు ఎంత డబ్బు మార్చుకోవాలన్న దానిపై పరిమితి లేదని, ఎన్నారైలకు మాత్రం ఫెమా చట్ట నిబంధనల కింద(ఒక్కొక్కరు రూ. 25వేలు) పరిమితి ఉంటుందని ఇప్పటికే పేర్కొన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ తాము డిపాజిట్ చేసే పాత నోట్లను ముందే ఎయిర్పోర్ట్ వద్ద కస్టమ్స్ అధికారులకు చూపించి వారి నుంచి అనుమతి పత్రాలు పొంది వాటిని వారు డబ్బు డిపాజిట్ చేసే ఆర్బీఐశాఖల్లో చూపించాల్సి ఉంటుందని తాజాగా ఓ ప్రకటనలో పేర్కొంది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సమయంలో తాము విదేశాల్లో ఉన్నామని, ఇదివరకు నోట్లు మార్చుకోలేదని గుర్తింపు పత్రాలు చూపించిన భారతీయులకు మాత్రమే పాత డబ్బు డిపాజిట్‌కు అవకాశం ఉంటుంది. మార్పిడిలో మూడో పక్షాన్ని(థర్డ్ పార్టీ) అనుమతించబోమని ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.