న్యూఢిల్లీ: విదేశీ పౌరుల్ని వివాహం చేసుకునే భారతీయులకు కేంద్రం శుభవార్త తెలిపింది. భారతీయుల్ని పెళ్లి చేసుకున్న విదేశీయులు తమ పర్యాటక వీసాలను ఎక్స్2(డిపెండెంట్) వీసాలుగా మార్చుకునేలా నిబంధనల్ని సవరించనున్నట్లు వెల్లడించింది. ఇటీవల ఓ భారతీయుడు ఫిలిప్పైన్స్ మహిళను అక్కడే వివాహం చేసుకున్నారు. అనంతరం ఆమె పర్యాటక వీసాపై భారత్‌కు వచ్చారు. ఆ తర్వాత పర్యాటక వీసాను ఎక్స్2 వీసాగా మార్చాలని వధువు దరఖాస్తు చేసుకోగా నిబంధనలు అంగీకరికపోవడంతో అధికారులు దాన్ని తిరస్కరించారు.
ఫిలిప్పైన్స్‌కు వెళ్లి ఎక్స్2 వీసా కోసం మరోసారి దరఖాస్తు చేసుకోవాలని ఆమెకు సూచించారు. దీంతో ఆమె భర్త ఈ విషయమై హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఫిర్యాదు చేశారు. రాజ్‌నాథ్ ఆదేశాలతో వెంటనే స్పందించిన హోంశాఖ.. పర్యాటక వీసాను ఎక్స్2 వీసాగా మార్చేందుకు అడ్డుగా ఉన్న నిబంధనల్ని సవరించనున్నట్లు తెలిపింది. అలాగే భారతీయులు విదేశాల్లో పెళ్లి చేసుకుంటే వారి జీవిత భాగస్వామికి ఎక్స్2 వీసా ఇచ్చేందుకు ఇప్పటివరకూ అడ్డంకిగా ఉన్న నిబంధనల్ని మార్చనున్నట్లు వెల్లడించింది. కాగా, ఈ వెసులుబాటు పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, సూడాన్, ఇరాక్ దేశాలు, పాక్ సంతతి పౌరులు, ఏ దేశానికి చెందనివారికి వర్తించబోదని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment