న్యూఢిల్లీ: పెద్ద నోట్లను డిపాజిట్ చేసే ఎన్ఆర్‌ఐలు, విదేశాల్లో ఉంటున్న భారతీయుల విషయంలో ఆర్థిక శాఖ కొత్త మెలిక పెట్టింది. డిపాజిట్ కంటే ముందు వారు కస్టమ్స్ అధికారుల నుంచి ధ్రువీకరణ పత్రాలు పొంది, ఆ పత్రాల్లో ఎంతడబ్బైతే పేర్కొన్నారో అంతమాత్రమే ఆర్బీఐ శాఖల్లో జమ చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు ఒక పేజీ ప్రకటనను ఆర్థికశాఖ విడుదల చేసింది. పెద్ద నోట్లను రద్దు చేసి పాత రూ.500, రూ.1000 నోట్లను డిపాజిట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పెట్టిన 50 రోజులగడువు పూర్తయిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఎన్ఆర్‌ఐలకు, విదేశాల్లో ఉంటున్న భారతీయులకు, ప్రస్తుతం విదేశాలకు వెళుతున్న వారికి, స్పష్టమైన వివరణలో ఇస్తే ఇక్కడే ఉంటున్నవారికి మాత్రమే పాత నోట్లను జమ చేసేందుకు అవకాశం ఇస్తున్నారు. అయితే, విదేశాలకు వెళ్లే భారతీయులకైతే మార్చి 31 వరకు, ఎన్ఆర్‌ఐలకు జూన్ 30 వరకు ఆర్బీఐశాఖల్లో డబ్బు డిపాజిట్ చేసే అవకాశం ఉంది. కాగా, విదేశాల నుంచి తమ పాత నగదును డిపాజిట్ చేసేందుకు భారత్‌కు వచ్చే వారు ఆయా విమానాశ్రయాల్లో తొలుత తాము డిపాజిట్ చేసే పాత డబ్బును చూపించాల్సి ఉంటుంది. అర్హులైన భారత పౌరులు ఎంత డబ్బు మార్చుకోవాలన్న దానిపై పరిమితి లేదని, ఎన్నారైలకు మాత్రం ఫెమా చట్ట నిబంధనల కింద(ఒక్కొక్కరు రూ. 25వేలు) పరిమితి ఉంటుందని ఇప్పటికే పేర్కొన్న విషయం తెలిసిందే.
అయినప్పటికీ తాము డిపాజిట్ చేసే పాత నోట్లను ముందే ఎయిర్‌పోర్ట్ వద్ద కస్టమ్స్ అధికారులకు చూపించి వారి నుంచి అనుమతి పత్రాలు పొంది వాటిని వారు డబ్బు డిపాజిట్ చేసే ఆర్బీఐశాఖల్లో చూపించాల్సి ఉంటుందని తాజాగా ఓ ప్రకటనలో పేర్కొంది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సమయంలో తాము విదేశాల్లో ఉన్నామని, ఇదివరకు నోట్లు మార్చుకోలేదని గుర్తింపు పత్రాలు చూపించిన భారతీయులకు మాత్రమే పాత డబ్బు డిపాజిట్‌కు అవకాశం ఉంటుంది. మార్పిడిలో మూడో పక్షాన్ని(థర్డ్ పార్టీ) అనుమతించబోమని ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.