మన శాస్త్రవేత్తలు చనిపోయారా.. చంపేశారా!
న్యూఢిల్లీ: దేశ అభివృద్ధికి బాటలు వేసిన ఎందరో గొప్పగొప్ప వ్యక్తుల మరణాలు వీడని మిస్టరీలుగా మిగిలిపోయాయి. అందులో శాస్త్రవేత్తల మరణాలు కూడా.. భారత అణుశాస్త్ర పితామహుడుగా పేర్కొనే హోమీ జహంగీర్ బాబా మరణం కూడా ఇదే కోవలోకి వెళ్లిపోయింది. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ వ్యవస్థాపక డైరెక్టర్గా ఉన్న ఆయన అందులోనే ఫిజిక్స్ ప్రొఫెసర్గా కూడా పనిచేశారు. ఓ విమాన ప్రమాదంలో మోమీ జే బాబా 1966 జనవరి 24న ప్రాణాలు కోల్పోయారు.
ఆ సమయంలో ఆయనతోపాటు వందలమంది కూడా ఉన్నారు. అయితే, ఈ ఘటన ప్రమాదావశాత్తు జరిగిందా.. లేక ఇందులో మరేదైన కుట్ర ఉందా అనే అనుమానాలు తాజాగా కలుగుతున్నాయి. ఎందుకంటే ఇలాంటి మరణానికి గురైంది ఒక్క హోమీ బాబానే కాదు. ఇటీవల కాలంలో.. గతంలో కూడా ఎందరో ప్రముఖ శాస్త్రవేత్తలు విమాన ప్రమాదాలు ఇతర ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. అయితే, వీరి మృతిపట్ల ప్రభుత్వాలు మాత్రం ఎలాంటి ఆరా తీయకపోవడం, సాధారణ మరణాలుగానే పరిగణించడంపట్ల తాజాగా పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.