T20 WC 2024: పాక్‌ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
టీ20 ప్రపంచకప్-2024లో నిన్న పెను సంచలనం నమోదైంది. తొలిసారి ప్రపంచకప్ ఆడుతున్న యూఎస్ఏ.. అన్ని విభాగాల్లో తమకంటే పటిష్టమైన పాకిస్తాన్‌కు ఊహించని షాకిచ్చింది (సూపర్ ఓవర్లో). మెగా టోర్నీలో ఆడిన తొలి మ్యాచ్‌లోనూ తమ కంటే మెరుగైన కెనడాకు ఝలక్ ఇచ్చిన యూఎస్ఏ.. నిన్న ఓ సారి ప్రపంచ ఛాంపియన్ అయిన పాక్‌ను మట్టికరిపించి క్రికెట్ ప్రపంచం మొత్తం తమ వైపు చూసేలా చేసుకుంది.ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. పాక్‌ను చిత్తు చేసిన యూఎస్ఏ జట్టులో సగం మందికి పైగా భారతీయులు, భారత సంతతికి చెందిన వారు ఉన్నారు. నిన్నటి మ్యాచ్‌లో పాక్‌ను మట్టికరిపించడంలో ప్రధాన పాత్రధారి అయిన సౌరభ్ నేత్రావాల్కర్ (32) ముంబైకి చెందిన వాడు. నేత్కావాల్కర్ అండర్-19 స్థాయిలో భారత జట్టుకు ఆడాడు. లెఫ్ట్ ఆర్మ ఫాస్ట్ బౌలర్ అయిన నేత్రావాల్కర్ ఉద్యోగరిత్యా అమెరికాలో సెటిల్ అయ్యాడు. పాక్‌తో మ్యాచ్‌లో 4 ఓవర్లలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టిన నేత్రావాల్కర్.. సూపర్ ఓవర్లో మరింత మెరుగ్గా బౌలింగ్ చేసి పాక్ ఓటమికి ప్రధాన కారకుడయ్యాడు.పాక్‌ను ఓడించడంలో మరో ప్రధాన పాత్ర అయిన మోనాంక్ పటేల్ కూడా భారతీయుడే. 31 ఏళ్ల మోనాంక్ యూఎస్ఏ జట్టుకు సారధి. నిన్నటి మ్యాచ్‌లో మోనాంక్ మెరుపు అర్ద సెంచరీ (38 బంతుల్లో 50) సాధించి పాక్ ఓటమికి బీజం వేశాడు. ఈ ప్రదర్శనకు గానూ మోనాంక్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు. మోనాంక్ గుజరాత్‌లోని ఆనంద్ ప్రాంతానికి చెందిన వాడు.నిన్నటి మ్యాచ్‌లో పాక్‌ను నామమాత్రపు స్కోర్‌కు పరిమితం చేయడంలో ప్రధాన పాత్ర పోషించిన నోస్తుష్ కెంజిగే (4-0-30-3) కూడా భారతీయుడే. 33 ఏళ్ల కెంజిగే కర్ణాటకలోని చిక్మగళూరులో క్రికెట్ ఓనమాలు నేర్చుకున్నాడు. వీరే కాక పాక్‌ను మట్టికరిపించి అమెరికా జట్టులో మరో ఇద్దరు భారతీయులు కూడా ఉన్నారు. ముంబైలో పుట్టి పెరిగిన 31 ఏళ్ల హర్మీత్ సింగ్, పంజాబ్ మూలాలున్న 31 ఏళ్ల జస్దీప్ సింగ్ పాక్‌ను చిత్తు చేసిన అమెరికా జట్టులో సభ్యులుగా ఉన్నారు. ఈ ఐదుగురే కాక మరో ఇద్దరు భారతీయులు అమెరికా జట్టులో ఉన్నారు. 33 ఏళ్ల మిలింద్ కుమార్ (ఢిల్లీ), 36 ఏళ్ల నిసర్గ్ పటేల్‌కు (అహ్మదాబాద్, గుజరాత్) తుది జట్టులో చోటు దక్కలేదు. ఈ మ్యాచ్‌లో మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. యూఎస్ఏ జట్టులో పాక్‌కే చెందిన ఓ ఆటగాడు ఉన్నాడు. 33 ఏళ్ల అలీ ఖాన్ పాక్‌లోని పంజాబ్ ప్రాంతానికి చెందిన వాడు.మోనాంక్ పటేల్ (ఆనంద్, గుజరాత్)హర్మీత్ సింగ్ (ముంబై)జస్దీప్ సింగ్ (పంజాబ్)నోష్తుశ్ కెంజిగే (చిక్‌మగళూరు, కర్ణాటక)సౌరభ్ నేత్రావాల్కర్ (ముంబై)మిలింద్ కుమార్ (ఢిల్లీ)నిసర్గ్ పటేల్ (అహ్మదాబాద్, గుజరాత్)పాక్-యూఎస్ఏ మ్యాచ్ స్కోర్ వివరాలు..పాక్ 159/7 (20)యూఎస్ఏ 159/3 (20)సూపర్ ఓవర్..యూఎస్ఏ 18/1పాక్ 13/1సూపర్ ఓవర్లో యూఎస్ఏ విజయం