నరబలికి గురైన భారత సంతతి క్రికెటర్!
దక్షిణాఫ్రికాలో దారుణం జరిగింది. అక్కడ భారత సంతతికి చెందిన మానసిక వికలాంగుడైన క్రికెటర్‌ను అతడికి సన్నిహితంగా ఉండే కొంతమంది వ్యక్తులు తల నరికి నరబలి ఇచ్చారు. ఈ కేసులో పోలీసులు అతడి ప్రాణస్నేహితుడితో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. నవాజ్ ఖాన్ (23) అనే మానసిక వికలాంగ క్రికెటర్‌ను అతడి ప్రాణ స్నేహితుడు తండోవాఖే డుమా (21) తన ఇంటికి సమీపంలో ఉన్న అడవుల్లోకి తీసుకెళ్లాడు. అతడు నాటువైద్యాలు చేస్తుంటాడు. ఆ అడవిలోనే నవాజ్ ఖాన్‌పై కత్తులతో దాడిచేసి తల నరికేశారు.
తనకు కొన్ని సమస్యలున్నాయని, వాటి నుంచి బయటపడాలంటే మనిషి తల తీసుకురావాల్సిందిగా మరో భూత వైద్యుడు చెప్పాడని, అందుకే తాను స్నేహితుడిని బలిచ్చానని డుమా పోలీసుల విచారణలో అంగీకరించి, ఘటనా స్థలాన్ని చూపించాడు. అతడిని పట్టుకోవడంలో స్థానికులు చూపిన చొరవను పోలీసులు ప్రశంసించారు. ఖాన్‌ను చంపి, అతడి మొబైల్ ఫోన్లను తమ వద్ద ఉంచుకున్న మరో ఇద్దరిని కూడా ఈ కేసులో అరెస్టు చేశారు.
దక్షిణాఫ్రికాలో మానసిక వికలాంగ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2013 అవార్డును నవాజ్ ఖాన్ గెలుచుకున్నాడని అతడి తల్లి జకియా ఖాన్ చెప్పారు. తాను ఎంతగానో అభిమానించే హషీమ్ ఆమ్లా నుంచి ఈ అవార్డు అందుకుని చాలా సంబరపడిపోయాడని, అది తన జీవితంలోనే అత్యంత మధుర క్షణమని చెప్పేవాడని ఆమె అన్నారు.