యజమాని సెలవు ఇవ్వలేదని..
* శరీరంపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ఉద్యోగి
* అవంతీపురం ఇండియన్ పెట్రోల్ బంక్లో ఘటన
మిర్యాలగూడ రూరల్ : నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం అవంతీపురంలో.. పెట్రోల్ బంక్ యజమాని సెలవు ఇవ్వలేదని, అందులో పనిచేస్తున్న ఉద్యోగి తీవ్ర మనస్తాపంతో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. మిర్యాలగూడ రూరల్ ఎస్సై వి.సర్దార్ నాయక్, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. అవంతీపురం జంగాల కాలనీకి చెందిన శ్రీపాటి మస్తాన్ వలి (35) రెండేళ్లుగా స్థానిక ఇండియన్ పెట్రోల్ బంక్లో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. రెండు రోజుల నుంచి విరామం లేకుండా విధులు నిర్వహిస్తున్నాడు.
గురువారం మస్తాన్వలి పెదనాన్న ఎల్లయ్య దశదిన కర్మ ఉండడంతో యజమానిని సెలవు ఇవ్వమని కోరాడు. దీంతో యజమాని గురువారం ఒక్కరోజు పనిచేసి, శుక్రవారం సెలవు తీసుకోమని చెప్పాడు. దీంతో మస్తాన్వలి మనస్తాపానికి గురయ్యాడు. వెంటనే బంకులోని పెట్రోల్ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకోగా తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికులు గమనించి మంటలను ఆర్పేశారు. 108 వాహనంలో అతడిని చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతున్నాడు. కాగా, కాలిన గాయాలతో.. వలీ పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.