Indian roller
-
నీలివర్ణంతో తళుక్కునే మెరిసే పాలపిట్ట.. అందుకే అంత స్పెషల్
పాల పిట్ట చుట్టూ ఎన్ని కథలో.. పసిడి పంటల్లే పచ్చని రంగునలుముకుంది, ఆకాశమళ్లే నీలి రంగు పులుముకుంది,అశ్వినీ మాసంలో అడుగులెడుతుంది,శుక్ల పక్షంలోశోభనిస్తుంది..పంటచేనుల్లో పరుగులెడుతుందివిజయ దశమికి విజయాలనిస్తుంది! ప్రపంచానితో పోటీ పడనంటుంది,నాగరికతతో నగరాలకు దూరమవుతుంది. అందాల హరివిల్లై విశ్వమంతా విస్తరించింది.పసిడి పరువాల విహంగం అద్భుతాల పాల పిట్ట !! దసరా రోజు.. పాలపిట్టను చూడకుంటే ఆ పండగకు అర్థమే లేదని చిన్న వెలతి ఉంటుంది. దాని ప్రత్యేకత అలాంటిది మరి! ఓటమి మీద గెలుపుకు నిదర్శనంగా చేసుకునే దసరా పండగ రోజు పాల పిట్టను చూస్తే ఎన్నో విజయాలతో పాటు సుఖ సంతోషాలు వరిస్తాయని అంటారు. అంటే పక్షులు కేవలం ప్రకృతిలో ఉండే ఒక జీవ రాశి మాత్రమే కాదు అవి మనుషుల జీవన విధానాలతో సంప్రదాయాలతో మమేకమై ఉంటాయి అన్నదానికి పాల పిట్ట ఒక ఉదాహరణ.అలాగని ఇది ఒక్క భారత దేశంలోనే కనిపించే పక్షి కాదు. కెనడా, అమెరికా ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో కూడా అద్భుతమైన పసిడి, నీలం లాంటి రంగుల కలయికతో కనిపిస్తుంది. భారత దేశంలో పాల పిట్టకు ప్రత్యేకమైన స్థానం ఉంది. దీనిచుట్టూ ఎన్నో వింతలు, విశేషాలు కూడా ముడిపడి ఉన్నాయి. పాలపిట్టతో మనిషికి యుగయుగాల సంబంధం ఉందంటే విడ్డూరమే కదా? కానీ ప్రతి యుగంలోనూ, పురాణ, ఇతిహాసాల్లో పాల పిట్ట ప్రస్తావన ఎదో ఒక విధంగా వస్తూనే ఉంటుంది.దక్షిణ భారత దేశంలోని కొన్ని ప్రాంతాల్లో పాల పిట్టను నీల కంఠ పక్షి అని పిలుస్తారు(నీల కంఠ అంటే శివుడికి ఉన్న మరో పేరు) దాని గొంతు విషం తాగిన తర్వాత మారిన శివుడి గొంతు (నీలం) రంగులో ఉండటమే కారణం. అలాగే త్రేతా యుగంలో రాముడు రావణాసురుని మీద యుద్దానికి వెళ్లే ముందు పాల పిట్ట ఎదురు వచ్చిందట. అందుకే రాముడు రావణాసురుడిని చంపిన రోజు చెడు మీద మంచి విజయం సాధించిన రోజుకి ఆదర్శంగా దసరాగా జరుపుకోవడం అనేది ఒక సంప్రదాయం అయ్యింది. అదే రోజు పాల పిట్టలు ఎక్కడ ఉన్నా గ్రామాల్లోని పంట చేన్లలో, ఊరి పొలిమేరల్లో తిరగడం జరుగుతుంది. అశ్విని మాసంలో (అక్టోబర్ నెల) లో పంటలు చేతికి వచ్చే కాలం, అదే సమయంలో నవరాత్రులు, దసరా పండగలు జరుపుకోవడం జరుగుతుంది. అందుకే ఈ పాల పిట్టలు ఆహారం కోసం ఆ సమయాల్లో ఊర్లలో పంట పొలాల్లో కనిపిస్తాయి. పండగలు వాటి ప్రత్యేకతలు ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉండటం మనం ఆశ్చర్యపడాల్సిన విషయమే.ద్వాపర యుగంలో పాండవులు వనవాసం చేసినప్పుడు వారి ఆయుధాలన్నీ జమ్మీ చెట్టు మీద దాచి ఉంచుతారు. అప్పుడు ఇంద్రుడు పాల పిట్టలా మారి ఆ చెట్టు మీద పాండవుల ఆయుధాలకు రక్షణగా ఉన్నాడు అని కూడా చెప్పుకుంటారు. అందుకే దసరా రోజు ఆయుధ పూజ అంటే అన్ని కుల వృత్తుల వారు వారి వారి జీవన ఆధారాలకు సంబందించిన వాటికి పూజలు చెయ్యడం కూడా జరుగుతుంది. ఇలా ఒక్కో యుగంలో ఒక్కో ప్రాంతానికి చెందిన సంప్రదాయాలతో ఒకే నెలలో జరిగే పండుగలకు పాల పిట్టకు అవినాభావ సంబంధం ఉంది. అందుకే పాల పిట్ట అనేది కేవలం ఒక పక్షి మాత్రమే కాదు అది మనుషుల సాంఘిక సమైక్యతను ప్రతిబింబిస్తుంది. ఒక భావోద్వేగం. పాల పిట్ట జీవన విధానం మనకు ఒక చిన్నపాటి పాఠం లాంటింది దాన్ని నిశితంగా పరీక్షిస్తే అది ఉదయం లేవగానే దాని చుట్టూ ఉన్న పరిస్థితులపైన నిఘా వేస్తుంది. ఎలాంటి అపాయాలు పొంచి ఉన్నాయి, అది నివసించే ప్రాంతం సురక్షితంగా ఉంటుందా? ఉండదా? అని విశ్లేషించుకుంటుంది. దాని పరిమాణం చాలా చిన్నగా ఉంటుంది కానీ అవసరానికి అది దాని పరిమాణం రెండింతలు రెట్టింపు చేస్తుంది. పాల పిట్టలు ఎప్పుడు కూడా ఒక సమూహంలో ప్రయాణం చేస్తాయి అందువల్ల మిగతా బలవంతమైన పక్షులు దాడి చేసినప్పుడు కలిసి కట్టుగా పోరాడుతాయి. మనుషులు కూడా సామాజిక సాంఘిక జీవితంలో సంఘటితమై జీవించాలని అప్పుడే ఎలాంటి కష్టాలు వచ్చినా ఒకరికొకరు తోడుగా నిబడొచ్చు అని మనకు చూపిస్తాయి. పాల పిట్టల గొంతు దూకుడుగా ఉన్నా ఒకదానితో ఒకటి ఎంతో మృదు స్వభావంతో పలకరించుకుంటాయి. అందుకే పాల పిట్టలు నమ్మకానికి ఐక్యమత్యానికి ప్రతీకలు. ఎంతో ఎత్తులో ఎగురుతున్నా కూడా నెల మీద వాటి ఆహారం మీద దృష్టిని మాత్రం పోగొట్టుకోవు. వాటి కంటి చూపు చాలా సూక్షమైన క్రిమి కీటకాలను కూడా గుర్తిస్తాయి. ముఖ్యంగా పంట పొలాల్లో ఉండే చిన్న చిన్న వాన పాములు వీటి ఆహారం. చెట్లు వీటి ప్రాథమిక నివాస స్థలాలు అందుకే ఇవి ఎక్కువగా అడవుల్లో ఉద్యానవనాల్లో నివసిస్తాయి ఆహారం కోసం నీటి పరివాహక ప్రదేశాల్లో ఎక్కువగా తిరుగుతున్నాయి. పక్షులు మన చుట్టూ కనిపించకపోవడం వల్ల మనకు గ్లోబల్ వార్మింగ్ ఒక్కటే గుర్తొస్తుంది. కానీ అవి అంతరించిపోతున్నప్పుడు పర్యావరణ సమతుల్యం దెబ్బతిని మనుషుల జీవన ప్రమాణాలు కూడా మెల్లి మెల్లిగా అంతరించి పోతున్నాయనే విషయం చాలా ఆలస్యంగా అర్థమవుతుంది. ఒకప్పుడు గ్రామాల్లో విరివిగా విచ్చల విడిగా, చిన్న చిన్న నగరాలలోని ఉద్యానవనాల్లో చెట్ల మీద కనిపించిన పాల పిట్ట ఇప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక సమయంలో కనిపిస్తే మనం ఆశ్చర్యానికి గురవుతున్నాం. మరికొంత మంది వీటిని పంజరాల్లొ పెట్టి సొమ్ము చేసుకుంటున్నారు. అంటే దానికున్న ప్రత్యేకతలు అలాంటివి. అలాగే మనం నాగరిత ముసుగులో అడవులను, చెట్లను దూరం చేస్తూ వాటి మీద ఆధారపడుతున్న పక్షులను జంతువులను కూడా దూరం చేసుకుంటున్నాము. రచయిత : ప్రదీప్ మాడురి ఫోటో : అల్బిన్ జాకబ్ తెలుగులో ప్రకృతి గురించి రాయాలనుకునే వారు ఈ ఫారమ్‌ను నింపండి- bit.ly/naturewriters పుడమి సాక్షిగా అనే కార్యక్రమం సాక్షి మీడియా గ్రూప్ చేపట్టిన పర్యావరణ హిత క్యాంపెయిన్. దీని గురించి మరింత 'సమాచారం తెలుసుకోవడానికి విజిట్ చేయండి. www.pudamisakshiga.com -
Dussehra: కానరాని పాలపిట్ట.. జాడలేని జమ్మిచెట్టు!
భద్రాద్రి జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పట్టణవాసులు దసరా ఉత్సవాలు జరుపుకొనే రైటన్ బస్తీ వేదిక దగ్గర ఉన్న చిన్న జమ్మి మొక్క ఇది. ప్రజలంతా పూజ చేసేందుకు ఇదే దిక్కు. పక్కనే ఉన్న పాల్వంచ కనకదుర్గ ఆలయం వద్ద పూజలందుకునే జమ్మి చెట్టు కూడా రేపోమాపో కనుమరుగయ్యేలా ఉంది. ఈ రెండు చోట్ల అనే కాదు. పల్లెపట్నం తేడా లేకుండా రాష్ట్రవ్యాప్తంగా జమ్మి చెట్ల సంఖ్య తగ్గిపోతోంది. అంతే ప్రాశస్త్యమున్న పాలపిట్టల దర్శనమూ అరుదైపోయింది. సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ ఏర్పడ్డాక ఇక్కడి పండుగలకు ప్రాధాన్యం పెరిగింది. బతుకమ్మ సంస్కృతి విదేశాలకు కూడా విస్తరించింది. దసరాను ఘనంగా జరుపుకోవడమూ పెరిగింది. కానీ ఆ రోజున జమ్మిచెట్టుకు పూజ చేయడం, పాలపిట్టను దర్శించుకోవడమనే సంప్రదాయం మాత్రం క్రమంగా తగ్గిపోతోంది. ఒకప్పుడు పంట పొలాల్లో, చెరువు గట్ల వెంబడి, రోడ్ల పక్కన విరివిగా కనిపించిన పాలపిట్టలు ఇప్పుడు కానరాకపోవడం, జమ్మి చెట్ల జాడ లేకుండా పోతుండటమే దీనికి కారణం. రకరకాల కారణాలతో.. కాకులు, పిచ్చుకలు, గద్దల తరహాలో మనుషులు సంచరించే చోటే ఎక్కువగా పాలపిట్టలు మనగలుతాయి. అవి పంటలను ఆశించే క్రిమికీటకాలను తిని బతకడమే దీనికి కారణం. సాగులో పురుగుల మందుల వాడకం పెరగడం, పంటల సాగు తీరు మారిపోవడంతో పాలపిట్టలపై ప్రభావం పడింది. మొక్కజొన్న, జొన్న, చిరుధాన్యాల వంటి ఆహార పంటలను ఆశించే పురుగులను పాలపిట్టలు తింటాయి. కానీ వాటి స్థానంలో పత్తి, పొగాకు, ఇతర వాణిజ్య పంటల సాగు పెరిగింది. వీటిలో పురుగు మందుల వాడకం ఎక్కువగా ఉండటం, లద్దె పురుగు, గులాబీ పురుగు వంటివి రాత్రివేళ పంటలపై దాడి చేస్తుండటంతో పాలపిట్టలకు ఆహారం కరువైంది. పురుగుమందుల ప్రభావంతో పాలపిట్టల సంతానోత్పత్తి సామర్థ్యం క్షీణిస్తోంది. ఒక సీజన్లో మూడు, నాలుగు గుడ్లు పెట్టే స్థాయి నుంచి క్రమంగా ఒకట్రెండుకే పరిమితమవుతున్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పంట పొలాల వెంట ఉండే చెట్లు, చెరువు గట్ల వెంట ఉండే నల్లతుమ్మ వంటి చెట్లను నరికివేయడం వల్ల పాలపిట్టలకు ఆవాసం కరువైపోతోంది. ఈ కారణాలతో పాలపిట్టల సంఖ్య తగ్గిపోతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొమ్మల నరికివేతతో పాల్వంచ పెద్దమ్మ ఆలయం వద్ద జమ్మిచెట్టు పరిస్థితి ఇలా... జమ్మి చెట్టుకు చోటేదీ? దసరా పండుగ రోజు తెలంగాణలో ఊరూరా జమ్మిచెట్టుకు పూజ చేస్తారు. ఇప్పుడు ఊళ్లలో జమ్మిచెట్లు కనుమరుగవడంతో.. అడవుల్లో వెతికి జమ్మిచెట్టు కొమ్మలను తెచ్చి తంతును పూర్తిచేస్తున్నారు. హరితహారం కింద, పల్లె ప్రకృతి వనాల్లో భారీగా మొక్కలు నాటుతున్నా ఎక్కడా జమ్మిచెట్టుకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. పాలపిట్టలు తగ్గిపోతున్నాయి వ్యవసాయంలో పురుగు మందుల వాడకం, పొలాల్లో చెట్ల నరికివేత వంటివాటితో పాలపిట్టలు కనుమరుగవుతున్నాయి. అందుకే ఊళ్లలో పాలపిట్టలు కనిపించడం లేదు. అడవుల్లో మాత్రమే ఉంటున్నాయి. పాలపిట్టల సంరక్షణ, జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కలిగిస్తున్నాం. – కట్టా దామోదర్‌రెడ్డి, వైల్డ్ లైఫ్ ఎఫ్డీఓ, పాల్వంచ డివిజన్ -
కనుమరుగవుతున్న పాలపిట్ట!
సాక్షి, కామారెడ్డి: దసరా రోజున పాలపిట్టను దర్శించుకోవడం ఆనవాయితీ. పాలపిట్టను దర్శించుకుంటే అన్నీ శుభాలే జరుగుతాయన్న నమ్మకం. తాతల కాలం నుంచి ఇది ఆచారంగా వస్తోంది. అందరూ పాటిస్తూ వస్తున్నారు. పండుగ పూట పొలం గట్ల వెంట వెళ్లి పాలపిట్టను దర్శించుకోవడం ద్వారా ఎంతో అనుభూతిని పొందుతారు. పిల్లలకు పాలపిట్ట గురించి తెలుసుకునే అవకాశం కలుగుతుంది. అయితే అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసం మూలంగా పర్యావరణం దెబ్బతినడంతో ఎన్నో పక్షి జాతులు అంతరించిపోతున్నాయి. అందులో పాలపిట్ట ఒకటిగా చెప్పవచ్చు. వానాకాలం పంటల సీజన్లో పాలపిట్టలు పొలాల వెంట తిరుగాడుతుంటాయి. దసరా నాటికి వరి పంట చేతికందుతుంది. పక్షులన్నీ వరి గింజలు తింటూ తిరుగుతాయి. అయితే ప్రకృతి దెబ్బతినడంతో అన్ని పక్షుల్లాగే పాల పిట్టలు కూడా కనుమరుగవుతున్నాయి. దసరా రోజున చాలామంది పాలపిట్ట దర్శనానికి వెళ్లి నిరాశతో వెనుదిరుగుతున్నారు. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో నాలుగు అడుగులు నడిస్తే చాలు పొలాల వెంట చెట్లపై, విద్యుత్తు తీగలపై పాలపిట్టలు దర్శనమిచ్చేవి. గత పది పదిహేనేళ్లుగా పాలపిట్టలు కరువవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోనే ఈ పరిస్థితి ఉంటే పట్టణాలు, నగరాల్లో మరీ ఘో రంగా ఉంది. అయితే కొందరు పాలపిట్టలను పంజరంలో బంధించి ఆలయాల దగ్గర దర్శనం కలిగిస్తున్నారు. ఇండియన్ రోలర్‌గా పిలుస్తారు.. పాలపిట్టను ఇంగ్లీష్‌లో ఇండియన్ రోలర్‌గా పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం కొరాసియా బెంగాలినిసిస్. బ్లూబర్డ్ అని కూడా పిలుస్తారు. రాష్ట్ర పక్షిగా గుర్తించారు. అయినప్పటికీ దీని ఉనికి గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. భావితరాలు గూగుల్‌లో చూడాల్సిందే.. ఇప్పటికే పాలపిట్ట కనిపించని పరిస్థితి తలెత్తింది. భవిష్యత్తు తరాలు పాలపిట్ట గురించి గూగుల్‌లో సెర్చ్ చేసి వెతుక్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దసరా రోజు చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ కొత్త బట్టలు ధరించి పొలం గట్ల వెంట తిరుగుతూ పాలపిట్ట దర్శనం చేసుకోవడం ఆనవాయితీగా వచ్చేది. పాలపిట్టను చూసి అందరూ దండం పెట్టి పంట చేనులో వరి కంకులు తెంపుకుని ఆలయానికి వెళ్లడం దేవుని దర్శనం చేసుకుని ఇంటికి వచ్చి పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం సంప్రదాయంగా వస్తోంది. స్నేహితులు, బంధువులకు జమ్మి ఆకులు ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటారు. -
తెలంగాణ రాష్ర్ట చిహ్నాలను ప్రకటించిన ప్రభుత్వం
తంగేడు పువ్వు తుంగేడు పువ్వు శాస్త్రీయ నామం కాసియా ఆరికులటా. ఇది ఆయుర్వేద మందుల్లో ఎక్కువ ఉపయోగపడుతుంది. ఉబ్బసం, మధుమేహం తదితర వ్యాధుల నివారణకు దీనిని వినియోగిస్తారు. తంగేడుపై కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి ఒకరు పరిశోధన చేసి ఇది ఎయిడ్స్‌కు కూడా పనిచేస్తుందని ఇటీవల కనుగొన్నారు. తెలంగాణ పండుగ బతుకమ్మలో ఈ పువ్వుకు అత్యంత ప్రాధాన్యం ఉంది. అడవులు, గ్రామాల్లోని ఖాళీ స్థలాల్లో తంగేడు చెట్లు విరివిగా కనిపిస్తుంటాయి. పంట పొలాల్లో విచ్చలవిడిగా రసాయనాలు వాడుతున్న కారణంగా చెరువు గట్లపై విరివిగా కనిపించే తంగేడు క్రమేణా అంతరించుకుపోతోంది. దీనిని సంరక్షించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రాష్ట్ర పుష్పంగా ప్రకటించింది. జింక వన్యప్రాణి జింక చైతన్యానికి చిహ్నం. జింకలో 90 జాతులు ఉన్నాయి.రాను రాను వీటి జాతి అంతరించి పోతోంది. జంకలను సంరక్షించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రాష్ట్ర జంతువుగా ప్రకటించింది. జిల్లాలోని అడవుల్లోనూ జింకలు ఉన్నాయి. వన్యప్రాణి సంరక్షణా కేంద్రాల్లో జింకలు మనకు చూడముచ్చటగా కనిపిస్తుంటాయి. పాలపిట్ట ఇండియన్ రోలర్‌గా పిలువబడే పాలపిట్ట ఉష్ణమండల ప్రాంతమైన దక్షిణాసియాలో సాధారణంగా కనిపించే పక్షి జాతుల్లో ఒకటి. అందంగా అద్భుతంగా కనిపించే పాలపిట్టను మన ప్రభుత్వం రాష్ట్ర పక్షిగా గుర్తిం చింది. తెలంగాణతోపాటు బీహార్, కర్ణాటక, ఆంధ్రాప్రదేశ్ రాష్ట్రాలు కూడా దీనినే రాష్ట్ర పక్షిగా గుర్తిస్తున్నాయి. ఈ పక్షిలో ఉన్న గొప్ప గుణమేమిటంటే.. మనుషుల పక్క నుంచి పోవడానికి ఏ మాత్రం భయపడదు. తన స్వేచ్ఛకు, స్వతంత్రానికి భంగం కలిగినప్పుడే ఇది ఎదురు దాడికి దిగుతుంది. దీని శాస్త్రీయ నామం బ్లూ జై. సంపదకు ప్రతీకగా కూడా దీన్ని గుర్తిస్తారు. కొంత మంది తమ ఇళ్లలో గూళ్లు కట్టి వీటిని పెంచుతుంటారు. జమ్మిచెట్టు జమ్మిచెట్టు గురించి పురాణల్లో చాలా కథలున్నాయి. అరణ్య వాసానికి వెళ్తున్న రాముడికి ఈ చెట్టు విశ్రాంతినిచ్చిందని అంటారు. రావణుడితో యుద్ధానికి బయల్దేరే సమయంలో ఆదిపరాశక్తిని శమ్మీ ఆకులతో పూజ చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. పాండవులు పన్నెండేళ్ల అరణ్యవాసం ముగించుకుని అజ్ఞాత వాసానికి వెళ్లే ముందు ఆయుధాలను ఈ చెట్టుపై ఉంచినట్లు అంటారు. శమీ వృక్ష రూపంలో ఉన్న అపరాజితా దేవి తనను వేడుకున్న వారికి విజయం చేకూరుస్తుందని నమ్ముతుంటారు. అందుకు నిదర్శనమే దసరా రోజున శమీ పూజ చేసి వాటి ఆకులను తీసుకొచ్చి పెద్దలకు ఇచ్చి ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీ. ఈ చెట్టు మనకు అరుదుగా కనిపిస్తుంటుంది. దసరా సందర్భంగా ఈ చెట్టు గుర్తుకొస్తుంది.