Nizamabad: Indian Roller Disappearing - Sakshi
Sakshi News home page

కనుమరుగవుతున్న పాలపిట్ట!

Published Sat, Oct 16 2021 8:57 AM | Last Updated on Sat, Oct 16 2021 10:42 AM

Nizamabad: Indian Roller Disappearing - Sakshi

సాక్షి, కామారెడ్డి: దసరా రోజున పాలపిట్టను దర్శించుకోవడం ఆనవాయితీ. పాలపిట్టను దర్శించుకుంటే అన్నీ శుభాలే జరుగుతాయన్న నమ్మకం. తాతల కాలం నుంచి ఇది ఆచారంగా వస్తోంది. అందరూ పాటిస్తూ వస్తున్నారు. పండుగ పూట పొలం గట్ల వెంట వెళ్లి పాలపిట్టను దర్శించుకోవడం ద్వారా ఎంతో అనుభూతిని పొందుతారు. పిల్లలకు పాలపిట్ట గురించి తెలుసుకునే అవకాశం కలుగుతుంది. అయితే అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసం మూలంగా పర్యావరణం దెబ్బతినడంతో ఎన్నో పక్షి జాతులు అంతరించిపోతున్నాయి. అందులో పాలపిట్ట ఒకటిగా చెప్పవచ్చు.

వానాకాలం పంటల సీజన్‌లో పాలపిట్టలు పొలాల వెంట తిరుగాడుతుంటాయి. దసరా నాటికి వరి పంట చేతికందుతుంది. పక్షులన్నీ వరి గింజలు తింటూ తిరుగుతాయి. అయితే ప్రకృతి దెబ్బతినడంతో అన్ని పక్షుల్లాగే పాల పిట్టలు కూడా కనుమరుగవుతున్నాయి. దసరా రోజున చాలామంది పాలపిట్ట దర్శనానికి వెళ్లి నిరాశతో వెనుదిరుగుతున్నారు. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో నాలుగు అడుగులు నడిస్తే చాలు పొలాల వెంట చెట్లపై, విద్యుత్తు తీగలపై పాలపిట్టలు దర్శనమిచ్చేవి. గత పది పదిహేనేళ్లుగా పాలపిట్టలు కరువవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోనే ఈ పరిస్థితి ఉంటే పట్టణాలు, నగరాల్లో మరీ ఘో రంగా ఉంది. అయితే కొందరు పాలపిట్టలను పంజరంలో బంధించి ఆలయాల దగ్గర దర్శనం కలిగిస్తున్నారు. 


ఇండియన్‌ రోలర్‌గా పిలుస్తారు.. 
పాలపిట్టను ఇంగ్లీష్‌లో ఇండియన్‌ రోలర్‌గా పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం కొరాసియా బెంగాలినిసిస్‌. బ్లూబర్డ్‌ అని కూడా పిలుస్తారు.  రాష్ట్ర పక్షిగా గుర్తించారు. అయినప్పటికీ దీని ఉనికి గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. 



భావితరాలు గూగుల్‌లో చూడాల్సిందే.. 
ఇప్పటికే పాలపిట్ట కనిపించని పరిస్థితి తలెత్తింది. భవిష్యత్తు తరాలు పాలపిట్ట గురించి గూగుల్‌లో సెర్చ్‌ చేసి వెతుక్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దసరా రోజు చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ కొత్త బట్టలు ధరించి పొలం గట్ల వెంట తిరుగుతూ పాలపిట్ట దర్శనం చేసుకోవడం ఆనవాయితీగా వచ్చేది. పాలపిట్టను చూసి అందరూ దండం పెట్టి పంట చేనులో వరి కంకులు తెంపుకుని ఆలయానికి వెళ్లడం దేవుని దర్శనం చేసుకుని ఇంటికి వచ్చి పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం సంప్రదాయంగా వస్తోంది. స్నేహితులు, బంధువులకు జమ్మి ఆకులు ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement