తంగేడు పువ్వు
తుంగేడు పువ్వు శాస్త్రీయ నామం కాసియా ఆరికులటా. ఇది ఆయుర్వేద మందుల్లో ఎక్కువ ఉపయోగపడుతుంది. ఉబ్బసం, మధుమేహం తదితర వ్యాధుల నివారణకు దీనిని వినియోగిస్తారు. తంగేడుపై కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి ఒకరు పరిశోధన చేసి ఇది ఎయిడ్స్‌కు కూడా పనిచేస్తుందని ఇటీవల కనుగొన్నారు. తెలంగాణ పండుగ బతుకమ్మలో ఈ పువ్వుకు అత్యంత ప్రాధాన్యం ఉంది. అడవులు, గ్రామాల్లోని ఖాళీ స్థలాల్లో తంగేడు చెట్లు విరివిగా కనిపిస్తుంటాయి. పంట పొలాల్లో విచ్చలవిడిగా రసాయనాలు వాడుతున్న కారణంగా చెరువు గట్లపై విరివిగా కనిపించే తంగేడు క్రమేణా అంతరించుకుపోతోంది. దీనిని సంరక్షించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రాష్ట్ర పుష్పంగా ప్రకటించింది.
జింక
వన్యప్రాణి జింక చైతన్యానికి చిహ్నం. జింకలో 90 జాతులు ఉన్నాయి.రాను రాను వీటి జాతి అంతరించి పోతోంది. జంకలను సంరక్షించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రాష్ట్ర జంతువుగా ప్రకటించింది. జిల్లాలోని అడవుల్లోనూ జింకలు ఉన్నాయి. వన్యప్రాణి సంరక్షణా కేంద్రాల్లో జింకలు మనకు చూడముచ్చటగా కనిపిస్తుంటాయి.
పాలపిట్ట
ఇండియన్ రోలర్‌గా పిలువబడే పాలపిట్ట ఉష్ణమండల ప్రాంతమైన దక్షిణాసియాలో సాధారణంగా కనిపించే పక్షి జాతుల్లో ఒకటి. అందంగా అద్భుతంగా కనిపించే పాలపిట్టను మన ప్రభుత్వం రాష్ట్ర పక్షిగా గుర్తిం చింది. తెలంగాణతోపాటు బీహార్, కర్ణాటక, ఆంధ్రాప్రదేశ్ రాష్ట్రాలు కూడా దీనినే రాష్ట్ర పక్షిగా గుర్తిస్తున్నాయి. ఈ పక్షిలో ఉన్న గొప్ప గుణమేమిటంటే.. మనుషుల పక్క నుంచి పోవడానికి ఏ మాత్రం భయపడదు. తన స్వేచ్ఛకు, స్వతంత్రానికి భంగం కలిగినప్పుడే ఇది ఎదురు దాడికి దిగుతుంది. దీని శాస్త్రీయ నామం బ్లూ జై. సంపదకు ప్రతీకగా కూడా దీన్ని గుర్తిస్తారు. కొంత మంది తమ ఇళ్లలో గూళ్లు కట్టి వీటిని పెంచుతుంటారు.
జమ్మిచెట్టు
జమ్మిచెట్టు గురించి పురాణల్లో చాలా కథలున్నాయి. అరణ్య వాసానికి వెళ్తున్న రాముడికి ఈ చెట్టు విశ్రాంతినిచ్చిందని అంటారు. రావణుడితో యుద్ధానికి బయల్దేరే సమయంలో ఆదిపరాశక్తిని శమ్మీ ఆకులతో పూజ చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. పాండవులు పన్నెండేళ్ల అరణ్యవాసం ముగించుకుని అజ్ఞాత వాసానికి వెళ్లే ముందు ఆయుధాలను ఈ చెట్టుపై ఉంచినట్లు అంటారు. శమీ వృక్ష రూపంలో ఉన్న అపరాజితా దేవి తనను వేడుకున్న వారికి విజయం చేకూరుస్తుందని నమ్ముతుంటారు. అందుకు నిదర్శనమే దసరా రోజున శమీ పూజ చేసి వాటి ఆకులను తీసుకొచ్చి పెద్దలకు ఇచ్చి ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీ. ఈ చెట్టు మనకు అరుదుగా కనిపిస్తుంటుంది. దసరా సందర్భంగా ఈ చెట్టు గుర్తుకొస్తుంది.
తెలంగాణ రాష్ర్ట చిహ్నాలను ప్రకటించిన ప్రభుత్వం
Published Thu, Nov 27 2014 3:44 AM | Last Updated on Sat, Sep 2 2017 5:10 PM
Advertisement