ద్వితీయార్ధం బాగుంటుంది
హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో భారత ఆర్థిక రంగం మంచి పనితీరును ప్రదర్శిస్తుందన్న విశ్వాసాన్ని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా వ్యక్తం చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2014-15) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 6 శాతం పైనే ఉంటుందని కూడా ఆయన అంచనావేశారు. అయితే కొత్త ప్రభుత్వ విధానాలు ఇందుకు దోహదపడాల్సి ఉంటుందని వివరించారు. ఐదవ ఐడియా ఛాలెంజ్ బూట్ క్యాంప్‌లో (నవంబర్ 25వ తేదీ నుంచి 30వ తేదీ వరకూ) భాగంగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) ఇక్కడ నిర్వహించిన ఒక కార్యక్రమంలో బుధవారం మాంటెక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన దేశ ఆర్థిక వ్యవస్థ గురించి వివిధ అంశాలపై మాట్లాడారు. ఆర్థిక వ్యవస్థలో పటిష్ట రికవరీ ఇంకా చోటుచేసుకోలేదన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అయితే వృద్ధి రేటు ప్రస్తుత స్థాయికన్నా ఇంకా పడిపోదని మాత్రం భావిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 5శాతం మించబోదని పలు అంచనాలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. కాగా క్యాపిటల్ ఇన్‌ఫ్లోస్ మినహా దేశంలోకి వచ్చీ-బయటకు ప్రవహించే విదేశీ మారకద్రవ్య విలువ వ్యత్యాసానికి సంబంధించిన కరెంట్ అకౌంట్ లోటు (సీఏడీ) 2013-14 స్థూల దేశీయోత్పత్తిలో 2.5 శాతం నుంచి 2.7 శాతం శ్రేణిలో ఉంటుందని మాంటెక్ పేర్కొన్నారు.
వ్యవస్థ మారాలి...
స్పెక్ట్రమ్, బొగ్గు క్షేత్రాల కేటాయింపులపై వస్తున్న ఆరోపణల గురించి మాంటెక్ మాట్లాడుతూ, వ్యవస్థలో ఉన్న ఇబ్బందులే దీనికి కారణమన్నారు. ఈ తరహా వ్యవస్థ మార్పు అవసరమని ఉద్ఘాటించారు. ఆయా ఆరోపణలకు సంబంధించి ప్రభుత్వం పారదర్శకతను పాటిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తంచేశారు. విచారణనూ అదే స్ఫూర్తితో ఎదుర్కొంటుందని అభిప్రాయపడ్డారు. దేశం మౌలిక రంగం అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందని అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వృద్ధి మందగమనంలోకి జారదని పేర్కొన్నారు.