భారత నర్సులకు దగ్గర్లో బాంబుల మోత
వారు సురక్షితంగానే ఉన్నారు:కేంద్రం ఇరాక్ నుంచి మరో 136 మంది భారత్‌కు
న్యూఢిల్లీ: అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న ఇరాక్‌లోని భారతీయుల పరిస్థితి దినదినగండంలా మారింది. మిలిటెంట్ల అధీనంలోని తిక్రిత్‌లో 46 మంది భారతీయ నర్సులు చిక్కుకుపోయిన భవనం దగ్గరలో బాంబుపేలుళ్లు, కాల్పులు సాగుతున్నాయని కేంద్రం మంగళవారం తెలిపింది. అయితే వీరికి ఎలాంటి హానీ జరగలేదని స్పష్టం చేసింది. కేరళకు చెందిన వీరు ప్రస్తుతం భవనం బేస్మెంట్లో తలదాచుకుంటున్నారని, వీరిని క్షేమంగా స్వదేశానికి తీసుకురాగలమని విదేశాంగ శాఖ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ పేర్కొన్నారు. ఇరాక్ నుంచి సోమవారం 94 మంది స్వదేశానికి బయల్దేరారని, మంగళవారం మరో 136 మంది పయనమయ్యారని, వీరిలో ఎక్కువ మంది ఉత్తర భారత్, హైదరాబాద్, కేరళ వాసులని వెల్లడించారు.
కాగా, ఇరాక్‌లోని మోసుల్‌లో సున్నీ మిలిటెంట్ల చెరలో ఉన్న 39 మంది భారతీయుల విడుదలకు సాయం చేయాలని భారత్ ఫ్రాన్స్‌ను కోరింది. ఇరాక్‌లో చిక్కుకున్న తమ రాష్ట్రానికి చెందిన 40 మంది కుటుంబాలకు నెలకు రూ.20 వేల సాయం చేస్తామని పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. ఇదిలా ఉండగా ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లెవాంట్(ఐఎస్ఐఎల్) మిలిటెంట్లు మంగళవారం సిరియాలోని కీలక పట్టణం బౌకుమాల్ను చేజిక్కించుకున్నారు. ఇరాక్ సరిహద్దులో ఉన్న దీన్ని ఐఎస్ఐఎల్.. నుస్రా ఫ్రంట్ జీహాదీలతో తలపడి స్వాధీనం చేసుకుంది. ఇరాలోక్ జూన్ నాటి హింసలో 2,417 మంది ఇరాకీలు మృతిచెందారని ఐక్యరాజ్యసమితి ఇరాక్ సహాయ విభాగం తెలిపింది.