గీత దాటలేదు.. భారత సైనికులను చంపలేదు: పాకిస్థాన్
చేయాల్సిందంతా చేయడం, తర్వాత తమ తప్పేమీ లేదని చెప్పడం.. ఇలాంటివన్నీ పాకిస్థాన్‌కు అలవాటే. అలాగే ఈసారి కూడా ఇదే మాట చెప్పింది. తమ దళాలు అసలు నియంత్రణ రేఖను దాటనే లేదని, భారత సైనికులను హతమార్చలేదని తెలిపింది. అసలు నియంత్రణ రేఖ వద్ద అలాంటి సంఘటన ఏదీ జరగనే లేదని, తమ దళాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించలేదని పాక్ సైనికాధికారి ఒకరు తెలిపారు.
సుమారు 20 మంది పాకిస్థానీ సైనికులు భారత భూభాగంలోకి చొచ్చుకుని వచ్చి, సర్లా పోస్టు వద్ద భారత సైనికులపై దాడి చేసి ఐదుగురిని కాల్చి చంపినట్లు భారత రక్షణశాఖ వర్గాలు తెలిపాయి. మృతులలో 21 బీహార్ యూనిట్‌కు చెందిన ఒక సుబేదార్, నలుగురు జవాన్లు ఉన్నారు. ఈ సంఘటన మంగళవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో నియంత్రణ రేఖకు 450 మీటర్ల దూరంలో సంభవించింది.
కాగా, పూంచ్ సెక్టార్లో ఐదుగురు భారత సైనికులను పాకిస్థానీ దళాలు హతమార్చడం దురదృష్టకరమని, ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చుకోడానికి ఇది మార్గం కాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆర్పీఎన్ సింగ్ తెలిపారు. రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ, విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ఈ సంఘటనపై ఈరోజు మధ్యాహ్నం పార్లమెంటులో ఓ ప్రకటన చేస్తారని ఆయన చెప్పారు. పాకిస్థాన్‌తో చర్చలు నిలిపివేసేది లేదని కాంగ్రెస్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ తెలిపారు. మరోవైపు, సైనికులను హతమార్చిన సంఘటన నేపథ్యంలో పాకిస్థాన్‌తో చర్చల ప్రక్రియ ఆపేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. సరిహద్దుల్లో ఒక్క బుల్లెట్ పేలినా చర్చలు జరపకూడదని, ఒకవైపు మన సైనికులను చంపేస్తూ మరోవైపు చర్చించడం సరికాదని బీజేపీ సీనియర్ నాయకుడు షానవాజ్ హుస్సేన్ అన్నారు.
ఇక ఈ సంఘటన పార్లమెంటును కూడా కుదిపేసింది. లోక్‌సభ సమావేశం కాగానే సమాజ్‌వాదీ పార్టీకి చెందిన సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి, పాకిస్థాన్ దుశ్చర్య అంశాన్ని ప్రస్తావించారు. బీజేపీ సభ్యులు తమ స్థానాల్లోనే లేచి నిలబడి, భారత సైనికుల హత్యను లేవనెత్తారు. సమాజ్‌వాదీ అద్యక్షుడు ములాయం సింగ్ యాదవ్, పార్టీ ఎంపీ శైలేంద్రకుమార్ దీనిపై వాయిదా తీర్మానం లేవనెత్తారు. ఈ గందరగోళంతో సభ మధ్యాహ్నం వరకు వాయిదా పడింది.