పాక్ దాడి 'దుర్మార్గపు చర్య': మోడీ
సరిహద్దులో భారత సైనికులను పాకిస్థానీ బలగాలు కాల్చి చంపడాన్ని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ, జమ్మూకాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా ఖండించారు. పాక్ దురాగతాన్ని 'దుర్మార్గపు చర్య'గా మోడీ పేర్కొన్నారు. పాకిస్థాన్ చర్య ఇరు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీసే ప్రమాదముందని ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు.
పాకిస్థాన్ బలగాలు ఐదుగురు భారత జవాన్లను హత్య చేయడాన్ని ఖండిస్తూ మోడీ, ఒమర్ అబ్దుల్లా తమ వ్యాఖ్యలను ట్విటర్లో పోస్ట్ చేశారు. భారత సైనికులపై దాడి ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని మోడీ స్పష్టం చేశారు. చైనా చొరబాట్లు, పాకిస్థాన్ దుశ్చర్యల నుంచి సరిహద్దులను రక్షించడంలో యూపీఏ ప్రభుత్వం విఫలమయిందని ఆయన విమర్శించారు. యూపీఏ పాలకులు మేలుకోవాల్సిన తరుణం ఆసన్నమయిందని అన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికులకు సంతాపం తెలిపారు. వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
జమ్ము కాశ్మీర్లో నియంత్రణ రేఖను దాటి వచ్చిన పాకిస్థానీ దళాలు భారత సైనికులపై కాల్పులు జరిపి, ఐదుగురు జవాన్ల ప్రాణాలు బలిగొన్నాయి. పూంచ్ జిల్లా చకన్ దా బాగ్ సెక్టార్ ప్రాంతంలో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ సంఘటన జరిగింది. ఎల్ఓసీలోని కర్మాడ్ గ్రామంలో గల తమ సైనిక పోస్టుపై వాళ్లు దాడి చేసి, తమ సైనికుల్లో ఐదుగురిని కాల్చి చంపారని, తర్వాత మళ్లీ పాకిస్థాన్ భూభాగంలోకి పారిపోయారని సైన్యానికి చెందిన ఓ అధికారి తెలిపారు.