ఇండియన్ ఆర్మీ డ్రోన్‌ను కూల్చేసిన పాక్ సైన్యం!
ఇస్లామాబాద్: కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించాల్సిందేనన్న డిమాండ్‌తో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య చర్చల ప్రక్రియపై నీలి మేఘాలు కమ్ముకున్న తరుణంలో భారత సైన్యానికి చెందిన డ్రోన్‌ను పాక్ ఆర్మీ కూల్చివేసిందన్న వార్తలు కలకలం రేపాయి. ఇప్పటికే పలుమార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగలోతొక్కిన పాక్.. తాజా చర్యతో భారత్‌ను కవ్వించే ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టమవుతున్నది.
నియంత్రణ రేఖ ఆవల ఉన్న పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. పాక్ గగన తలంలోకి అక్రమంగా ప్రవేశించినందునే భారత గూఢచారి డ్రోన్ (స్పై డ్రోన్) ను కూల్చివేశామని పాకిస్థాన్ అంతర్గత సేవలు- ప్రజా సంబంధాల శాఖ ప్రకటించినట్లు 'డాన్' పత్రిక బుధవారం ఒక వార్తను ప్రచురించింది. ఇందుకు ఆధారంగా కూల్చివేతకు గురైన డ్రోన్ చిత్రాలను కూడా పొందుపర్చింది. అయితే ఈ ఘటనపై భారత సైన్యం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.
కశ్మీర్ అంశం చర్చించాల్సిందేనన్న డిమాండ్‌తో త్వరలో ప్రారంభం అవుతాయనుకున్న భారత్- పాక్ దైపాక్షిక చర్చల ప్రక్రియలో ప్రతిష్ఠంభన ఏర్పడిని సంగతి తెలిసిందే. గతవారంలో రష్యాలో సమావేశమైన ఇరు దేశాల ప్రధానులు చర్చల ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించిన సంగతి విదితమే.