Indian telecom industry
-
మిట్టల్‌కు నైట్‌హుడ్ పురస్కారం
లండన్/న్యూఢిల్లీ: భారతీయ టెలికం రంగ దిగ్గజ పారిశ్రామికవేత్త సునీల్ భారతీ మిట్టల్‌ను బ్రిటన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక నైట్‌హుడ్ కమాండర్ పురస్కారంతో సత్కరించింది. ఎలిజబెత్ రాణి మరణం తర్వాత బ్రిటన్ రాజసింహాసనాన్ని అధిరోహించిన చార్లెస్–3 నుంచి ఈ అవార్డ్‌ను అందుకున్న తొలి భారతీయుడిగా సునీల్ మిట్టల్ రికార్డు సృష్టించారు. బ్రిటన్, భారత్ వాణిజ్య సంబంధాల బలోపేతానికి చేసిన కృషికిగాను యూకే ప్రభుత్వం నైట్‌హుడ్(కేబీఈ) అవార్డ్‌తో మిట్టల్‌ను గౌరవించింది. భారత్‌లో రెండో అతిపెద్ద టెలికం సంస్థ ఎయిర్‌టెల్‌కు 66 ఏళ్ల మిట్టల్ వ్యవస్థాపక చైర్మన్‌గా కొనసాగుతున్నారు. బ్రిటన్ ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారాల్లో నైట్ కమాండర్ కూడా ఒకటి. గౌరవార్థం విదేశీయులకూ దీనిని ప్రకటిస్తారు. -
మరో ఐదేళ్లలో 5జీ క్రేజీ..
బీజింగ్ : దీర్ఘకాలంలో భారత్‌లో 5జీ మార్కెట్ భారీగా వృద్ధి చెందనుందని ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ స్థితిగతులపై చైనా ప్రభుత్వం ప్రచురించిన ఓ పుస్తకం అంచనా వేసింది. భారత్‌లో ఇంటర్నెట్ వ్యాప్తి విస్తరించడం, పెద్దసంఖ్యలో యూజర్లు ఆన్‌లైన్‌కు మళ్లడంతో ఈ రంగంలో వేగవంతమైన పురోగతి చోటుచేసుకుంటోందని పేర్కొంది. 2025 నాటికి భారత్‌లో 35 శాతం మంది 5జీకి కనెక్ట్ అవుతారని ఈ బుక్ వెల్లడించింది. భారత్‌లో ఇంటర్నెట్ వేగంగా విస్తరిస్తుండటంతో చైనాకు చెందిన వెంచర్ క్యాపిటల్ సంస్థ 2018లో ఏకంగా 560 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టిందని వివరించింది. ప్రపంచ ఇంటర్నెట్ అభివృద్ధి నివేదిక పేరిట విడుదలైన ఈ పుస్తకాన్ని చైనీస్ అకాడమీ ఆఫ్ సైబర్‌స్పేస్ స్టడీస్ (సీఏసీఎస్) ప్రచురించింది. 3జీ, 4జీ కంటే వేగవంతమైన సెల్యులార్ టెక్నాలజీగా 5జీ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. భారత్‌లో 5జీ మార్కెట్‌కు ఉన్న ఆదరణ దృష్ట్యా భారత్‌లో 5జీ లైసెన్స్ దక్కించుకునేందుకు చైనా టెలికం దిగ్గజం హువై రేసులో ఉన్నట్టు చెబుతున్నారు. ఇక ఇంటర్నెట్కు సంబంధించి వివిధ పారామీటర్లను పరిగణనలోకి తీసుకున్న సీఏసీఎస్ అంతర్జాతీయ ఇంటర్నెట్ అభివృద్ధి సూచీలో భారత్ 8వ స్ధానంలో నిలిచిందని పేర్కొంది. ఈ జాబితాలో అమెరికా, చైనాలు వరుసగా ప్రధమ, ద్వితీయ స్ధానాల్లో ఉన్నాయి. చైనా తర్వాత భారత్ రెండో అతిపెద్ద టెలికాం మార్కెట్‌ను కలిగిఉందని సీఏసీఎస్ విశ్లేషించింది. అలీబాబా,టెన్సెంట్, బైట్‌డ్యాన్స్ వంటి చైనా టెక్ దిగ్గజాలు ఇప్పటికే భారత్ టెక్నాలజీ రంగంలో పెట్టుబడులు పెట్టాయి. భారత్‌లో ఇంటర్నెట్ వృద్ధి వేగంగా పరుగులు పెడుతున్నా ఇంటర్నెట్ సంబంధిత మౌలిక సదుపాయాల విషయంలో ఇంకా వెనుకబడే ఉందని ఈ నివేదిక వెల్లడించింది. -
పూర్తిస్థాయి 4జీ వినియోగానికి మరో రెండేళ్లు!
న్యూఢిల్లీ: భారత్ టెలికాం రంగంలో నాలుగవ జనరేషన్ (4జీ) సేవలు పూర్తిస్థాయిలో వినియోగంలోకి రావడానికి మరో రెండేళ్లు పడుతుందని టెలికాం రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకు భారత్ లో కేవలం భారతీ ఎయిర్ టెల్ మాత్రమే 4జీ సేవలందిస్తోంది. 2015లో 4జీ సేవలందించడానికి రిలయన్స్ జీయో ఇన్పోకామ్ సిద్దమవుతోంది. వైర్ లెస్ ఇంటర్నెట్ సదుపాయం 3జీ కంటే ఎక్కువ స్పీడ్ లో అందించే సామర్ధ్యం 4జీ టెక్నాలజీకి ఉంది. భారత్ లో 4జీ టెక్నాలజీ వినియోగంలోకి రావడానికి ఆలస్యం అవుతోంది. కారణం పరికరాలు లభ్యం కాకపోవడం ప్రధాన సమస్య. ఎక్కువ మంది వినియోగదారులు 4జీ సేవల కోసం సిద్దంగా లేకపోవడం మరో కారణమని నిపుణులు తెలుపుతున్నారు.