Indian Telegraph Act
-
ఫోన్ ట్యాపింగే పెద్ద నేరమా?
న్యూఢిల్లీ: అవినీతికన్నా ఫోన్ ట్యాపింగ్ అతి పెద్ద నేరం అన్నట్టుగా ‘నోటుకు ఓటు’ కుంభకోణంలో అడ్డంగా దొరికిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే పదే మాట్లాడుతున్నారు. కుంభకోణంలో రేవంత్ నిర్వహించిన పాత్ర గురించి, ఆయన ‘బాస్’ అన్న సంబోధన ఎవరి గురించంటూ ఎవరు, ఎన్ని ప్రశ్నలడిగిన పాడిందే పాటరా... చందంగా ‘నా ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారం వీరికి ఎవరిచ్చారు ? వీళ్ల అంతుచూస్తా’ అని అంటున్నారే తప్పా సూటిగా సమాధానం ఇవ్వడం లేదు. ఆ ఫోన్లో వినిపించిన ‘వాయిస్’ మీదేనా మహాప్రభో! అంటూ విసిగెత్తి విలేకరులు అడుగుతున్న ప్రశ్నలకు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. మరో పక్క ఫోన్ ట్యాపింగ్ తాము చేయలేదంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నిసార్లు వివరించినా పట్టించుకోవడం లేదు. తర్కం కోసం చంద్రబాబు ఫోన్‌ను కేసీఆర్ ట్యాపింగ్ చేయించారనుకుందాం.. అప్పుడు చంద్రబాబు ఏం చేయాలి? చట్ట ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఫోన్ ట్యాపింగ్‌ను భారతీయ చట్టాలు ఎలా నిర్వచిస్తున్నాయి? నిజంగా ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిన వ్యక్తి లేదా ప్రభుత్వానికి చట్టంలో ఎలాంటి శిక్షలు విధించే అవకాశం ఉంది ? అన్న ప్రశ్నలకు సమాధానం వెతకాలిగదా! ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం భారతీయ టెలిగ్రాఫ్ చట్టం పరిధిలోకి వస్తోంది. దేశ సమగ్రతకు, దేశ సార్వభౌమత్వానికి, ప్రజల భద్రతకు ముప్పు కలిగిస్తున్నారనే అనుమానం కలిగిన సందర్భాల్లో మాత్రమే ఎవరి ఫోన్‌నైనా ట్యాప్ చేయవచ్చంటూ 1885 నాటి భారత టెలిగ్రాఫిక్ చట్టం నిర్ధేశిస్తోంది. దేశ స్వాతంత్య్రానంతరం 1951లో మొదటి సారి ఈ చట్టంలో కొన్ని సవరణలు వచ్చాయి. ఆ తర్వాత టైస్టులు, పొరుగు దేశాల నుంచి దేశ భద్రతకు ముప్పు వాటిల్లిన సందర్భాల్లో 1971లో మళ్లీ ఈ చట్టాన్ని సవరించారు. ఆ తర్వాత పలు ఆర్థిక నేరాలు వెలుగులోకి రావడం, పార్లమెంట్లో ‘నోటుకు ఓటు’ కుంభకోణాలు బయటపడడం, తన ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నారంటూ అజిత్ జోగి లాంటి నాయకులు మీడియా ముందు దుమారం సృష్టించడం, కాలక్రమంలో మరికొంత మంది ప్రతిపక్ష నాయకులు పాలకపక్షంపై ఫోన్ ట్యాప్ చేస్తున్నారనే ఆరోపణలు సంధించడం, ఫోన్ ట్యాపింగ్ పేరిట వ్యక్తిగ స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారంటూ ప్రజా హక్కుల సంఘాలు సుప్రీం కోర్టుదాకా వెళ్లడం తదితర పరిణామాల కారణంగా 2008, 2009, 2011 సంవత్సరాల్లో ఈ చట్టాల్లో మరికొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టం ప్రకారం టైస్టు, ఆర్థిక, రాజకీయ నేరాలకు సంబంధించిన కేసుల్లో సాక్షాధారాల సేకరణకు ముందస్తు అనుమతితో ఎవరి ఫోన్‌నైనా ట్యాప్ చేసే అధికారం సంబంధిత కేసు దర్యాప్తు సంస్థలకు, ప్రభుత్వానికి ఉంది. కేసు విచారణలో భాగంగా హైకోర్టు లేదా సుప్రీం కోర్టు అనుమతితో ఫోన్ ట్యాపింగ్ చేయవచ్చు. కేంద్ర లేదా రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి అనుమతితో ఫోన్ ట్యాపింగ్ చేయవచ్చు. సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం ఫోన్ ట్యాపింగ్ కోసం ఓ సమీక్ష కమిటీని కూడా కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక్కడ చంద్రబాబు ఫోన్‌ను ట్యాప్ చేయాలనుకుంటే రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి అనుమతితో సంబంధిత దర్యాప్తు సంస్థలు ట్యాప్ చేయవచ్చు. కేసీఆర్ అది కూడా చేయలేదంటున్నారు. ఇలాంటి సందర్భంలో మరి చంద్రబాబు ఏం చేయాలి? భారత టెలిగ్రాప్ చట్టంలోని సెక్షన్ 26(బీ) ప్రకారం సమీపంలోని పోలీసు స్టేషన్‌కు వెళ్లి అక్రమంగా తన ఫోన్ ట్యాప్ చేశారని ఫిర్యాదు చేయాలి. ఈ సెక్షన్ కింద దోషులకు గరిష్టంగా మూడేళ్ల జైలు లేదా జరిమానా లేదా రెండు విధించే అవకాశం ఉంది. ఓ కేసులో నిందితులుగా భావించి వారికి సంబంధించిన ఫోన్ సంభాషణల సమాచారాన్ని కాల్ ప్రొఫైడర్లు, కంపెనీలు దర్యాప్తు సంస్థలకు ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఇవ్వని పక్షంలో ఇదే చట్ట ప్రకారం కాల్ ప్రొఫైడర్లకు, కంపెనీలకు గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. -
ఆ చట్టం.. మాకు చుట్టం!
టవర్ల నిర్మాణం కోసం స్థలాల స్వాధీనానికి బ్రిటీషు పాలకులు తెచ్చిన ‘భారతీయ టెలిగ్రాఫ్ చట్టం’ ప్రకారం తమకు అధికారాలున్నాయని విద్యుత్ సంస్థలు ప్రకటనలు జారీ చేస్తున్నాయి. కొత్త నిబంధనలను ఖాతరు చేయకుండా పాత నిబంధనల ప్రకారమే టవర్ల నిర్మాణానికి ఉపక్రమిస్తున్నాయి. ఫలితంగా ‘అనంత’ అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. వాస్తవానికి కొత్త నిబంధనల ప్రకారం ముందుగా భూ యజమానులకు నోటీసులివ్వాలి. లైను వెళ్లే ప్రాంతాల కలెక్టర్ల నుంచి అనుమతి కూడా ట్రాన్స్‌కో తీసుకోవాలి. ఇవేం పాటించకుండా నాటి చట్టంతో అధికారాలున్నాయని చెబుతుండడంపై రైతులు మండిపడుతున్నారు. తమకు జరుగుతున్న అన్యాయంపై పోరాడేందుకు సిద్ధమవుతున్నారు. సాక్షి ప్రతినిధి, అనంతపురం : బ్రిటీష్ కాలం నాటి చట్టాలను సాకుగా చూపి పవర్ గ్రిడ్ సంస్థలు రైతుల నోట్లో మట్టికొడుతున్నాయి. పొలాల్లో ఇష్టారాజ్యంగా విద్యుత్ టవర్ల నిర్మాణం చేపడుతూ వారికి అన్యాయం చేస్తున్నాయి. రైతుల నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండా టవర్ల నిర్మాణానికి ఉపక్రమిస్తున్నాయి. ఫలితంగా ఒక్కో టవర్ నిర్మాణంలో ప్రతి రైతు మూడున్నర లక్షల నుంచి నాలుగున్న లక్షల రూపాయల వరకు నష్టపోవాల్సి వస్తోంది. వివరాల్లోకి వెళితే.. దేశవ్యాప్తంగా కేంద్ర పవర్‌గ్రిడ్ సంస్థ ఏటా వేలాది టవర్లను రాష్ట్రాల మధ్య నిర్మిస్తోంది. ప్రస్తుం అనంతపురం జిల్లాలో 400 కేవీ విద్యుత్ టవర్లను పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ నిర్మిస్తోంది. దీని వల్ల చాలా మంది రైతులు భూములు కోల్పోతున్నారు. జిల్లాలో ఏడాది నుంచి టవర్ల నిర్మాణ పనులు సాగుతున్నా ఎవరికీ పరిహారం ఇవ్వలేదు. నిబంధనలను తుంగలో తొక్కుతూ.. విద్యుత్తు చట్టం-2003 ప్రకారం టవర్ల నిర్మాణానికి విద్యుత్ సంస్థలు అనుసరించాల్సిన సవరణ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం 2006లో విడుదల చేసింది. వాటి ప్రకారం ప్రైవేటు వ్యక్తుల పొలాల్లో విద్యుత్ టవర్లు నిర్మించాలంటే ముందుగా నోటీసు ఇచ్చి అనుమతి తీసుకోవాలి. భూ యజమానులు అభ్యంతరం చెబితే సంబంధిత జిల్లా కలెక్టర్‌ను సంప్రదించి, కలెక్టర్ నిర్ణయించిన ధర మేరకు రైతుకు నష్టపరిహారం చెల్లించి కొనుగోలు చేయాలి. ఆ తర్వాత మాత్రమే టవర్ల నిర్మాణం చేపట్టాలి. కానీ పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఈ నిబంధనలను తుంగలో తొక్కుతూ పొలాల్లో టవర్ల నిర్మాణం చేపడుతోంది. ‘అనంత’ రైతులకు భారీగా నష్టం అనంతపురం జిల్లాలో 2003 నుంచి భూములకు నష్టపరిహారం పొందనివారు, తక్కువ పరిహారంతో తీవ్రంగా నష్టపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. ప్రస్తుతం ఏపీ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ కింద కొత్తగా తాడిపత్రి, పెద్దపప్పూరు, పెద్దవడుగూరు, పామిడి, వజ్రకరూర్, ఉరవకొండ మండలాల్లో 620 కేవీ టవర్ల నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో జిల్లాలో రైతులు 3100 ఎకరాలు నష్టపోయే ప్రమాదముంది. పంట నష్టం జరిగితే రూ.25 వేలు చొప్పున పరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవడం మినహా చట్టం ప్రకారం రైతులకు దక్కాల్సిన పరిహారాన్ని అందించడం లేదు. నిబంంధనల ప్రకారం దక్కాల్సిన పరిహారం ఇది: టవర్ నిర్మించిన స్థలానికి ప్రధాన రహదారి పక్కనున్న పొలాలైతే గజానికి రూ.1000, రోడ్డుకు దూరంలో ఉన్న పొలాలైతే గజానికి రూ.100 పరిహారం చెల్లించాలని పాత నిబంధనలు ఉన్నాయి. ఒక టవర్ నుంచి మరో టవర్ వరకూ విద్యుత్ తీగలు వెళ్లే స్థలానికి కూడా మీటరుకు రూ.65 చొప్పున పరిహారం చెల్లించాలి. ఇది చాలా తక్కువని ఇటీవల తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా రైతులు కోర్టును ఆశ్రయించారు. దీంతో హైవేకు అర కిలోమీటరు దూరంలో ఉంటే ఒక్కో టవర్ ఏర్పాటుకు రూ. 3.50 లక్షలు (350చదరపు అడుగులు) నుంచి రూ.4.50 (350 చదరపు అడుగుల కంటే ఎక్కువ) ఇవ్వాలని కోర్టు తీర్పు ఇచ్చింది. అలాగే ఇతర పొలాలు, స్థలాల్లో టవర్ ఏర్పాటుకు రూ.2.45 లక్షల నుంచి రూ.3.15 లక్షలు ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు పరిహారం కృష్ణా, గుంటూరు, నెల్లూరులో ఇస్తున్నారు. అలాగే తెలంగాణలోని వరంగల్, నల్గొండ జిల్లాలో పరిహారం ఇచ్చారు. ఇదే క్రమలో ప్రస్తుతం చిత్తూరులో జరుగుతున్న టవర్ల నిర్మాణంలో కూడా పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌కు, రైతులకు మధ్య వివాదం రేగుతోంది. రేపు రైతు సంఘాల ఆధ్వర్యంలో ధర్నాకు ప్రణాళిక టవర్ల నిర్మాణంలో జరుగుతున్న అన్యాయంపై రైతులు కూడా ధర్నాకు ఉపక్రమించేందుకు సన్నద్ధమవుతున్నారు. జిల్లా రైతు సంఘాల సమాఖ్య అధ్యక్షుడు తరిమెల శరత్‌చంద్రారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ప్రెస్‌క్లబ్‌లో రైతులు, రైతు సంఘాల నాయకులతో చర్చావేదిక కూడా చేపట్టారు. దీనికి రాష్ట్ర, జాతీయ స్థాయిలో రైతు సంఘం నేతలు హాజరుకు కానున్నారు. -
అడ్డగోలు ట్యాపింగ్‌కు చెక్!
న్యూఢిల్లీ: ఎవరో చెబితే అడ్డగోలుగా ఫోన్లు ట్యాపింగ్ చేయడం, గిట్టనివారిపై అక్రమంగా నిఘా పెట్టడం వంటివి ఇకపై కుదరవు! ఫోన్ సంభాషణలను అధికారికంగా ట్యాపింగ్ చేయాల్సి వస్తే టెలికం కంపెనీలు కచ్చితంగా కొన్ని మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుం దని కేంద్రం స్పష్టంచేసింది. టెలికం శాఖ ఈ మార్గదర్శకాలను రూపొందించి, ఈనెల 2న అన్ని టెలికం కంపెనీలకు పంపింది. అలాగే ఎస్ఎంఎస్, ఎంఎంఎస్, ఇంటర్నెట్ టెలిఫోన్లను కూడా భారత టెలిగ్రాఫ్ చట్టం పరిధిలోకి తీసుకువచ్చారు. ఫోన్లను ట్యాపింగ్ చే యాలంటూ రాతపూర్వకంగా, ఫోన్ల ద్వారా, ఫ్యాక్స్ ద్వారా వచ్చే విజ్ఞప్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదని తన మార్గదర్శకాల్లో స్పష్టంచేసింది. ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.