టవర్ల నిర్మాణం కోసం స్థలాల స్వాధీనానికి బ్రిటీషు పాలకులు తెచ్చిన ‘భారతీయ టెలిగ్రాఫ్ చట్టం’ ప్రకారం తమకు అధికారాలున్నాయని విద్యుత్ సంస్థలు ప్రకటనలు జారీ చేస్తున్నాయి. కొత్త నిబంధనలను ఖాతరు చేయకుండా పాత నిబంధనల ప్రకారమే టవర్ల నిర్మాణానికి ఉపక్రమిస్తున్నాయి. ఫలితంగా ‘అనంత’ అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. వాస్తవానికి కొత్త నిబంధనల ప్రకారం ముందుగా భూ యజమానులకు నోటీసులివ్వాలి. లైను వెళ్లే ప్రాంతాల కలెక్టర్ల నుంచి అనుమతి కూడా ట్రాన్స్‌కో తీసుకోవాలి. ఇవేం పాటించకుండా నాటి చట్టంతో అధికారాలున్నాయని చెబుతుండడంపై రైతులు మండిపడుతున్నారు. తమకు జరుగుతున్న అన్యాయంపై పోరాడేందుకు సిద్ధమవుతున్నారు.
సాక్షి ప్రతినిధి, అనంతపురం : బ్రిటీష్ కాలం నాటి చట్టాలను సాకుగా చూపి పవర్ గ్రిడ్ సంస్థలు రైతుల నోట్లో మట్టికొడుతున్నాయి. పొలాల్లో ఇష్టారాజ్యంగా విద్యుత్ టవర్ల నిర్మాణం చేపడుతూ వారికి అన్యాయం చేస్తున్నాయి. రైతుల నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండా టవర్ల నిర్మాణానికి ఉపక్రమిస్తున్నాయి. ఫలితంగా ఒక్కో టవర్ నిర్మాణంలో ప్రతి రైతు మూడున్నర లక్షల నుంచి నాలుగున్న లక్షల రూపాయల వరకు నష్టపోవాల్సి వస్తోంది. వివరాల్లోకి వెళితే.. దేశవ్యాప్తంగా కేంద్ర పవర్‌గ్రిడ్ సంస్థ ఏటా వేలాది టవర్లను రాష్ట్రాల మధ్య నిర్మిస్తోంది. ప్రస్తుం అనంతపురం జిల్లాలో 400 కేవీ విద్యుత్ టవర్లను పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ నిర్మిస్తోంది. దీని వల్ల చాలా మంది రైతులు భూములు కోల్పోతున్నారు. జిల్లాలో ఏడాది నుంచి టవర్ల నిర్మాణ పనులు సాగుతున్నా ఎవరికీ పరిహారం ఇవ్వలేదు.
నిబంధనలను తుంగలో తొక్కుతూ..
విద్యుత్తు చట్టం-2003 ప్రకారం టవర్ల నిర్మాణానికి విద్యుత్ సంస్థలు అనుసరించాల్సిన సవరణ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం 2006లో విడుదల చేసింది. వాటి ప్రకారం ప్రైవేటు వ్యక్తుల పొలాల్లో విద్యుత్ టవర్లు నిర్మించాలంటే ముందుగా నోటీసు ఇచ్చి అనుమతి తీసుకోవాలి. భూ యజమానులు అభ్యంతరం చెబితే సంబంధిత జిల్లా కలెక్టర్‌ను సంప్రదించి, కలెక్టర్ నిర్ణయించిన ధర మేరకు రైతుకు నష్టపరిహారం చెల్లించి కొనుగోలు చేయాలి. ఆ తర్వాత మాత్రమే టవర్ల నిర్మాణం చేపట్టాలి. కానీ పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఈ నిబంధనలను తుంగలో తొక్కుతూ పొలాల్లో టవర్ల నిర్మాణం చేపడుతోంది.
‘అనంత’ రైతులకు భారీగా నష్టం
అనంతపురం జిల్లాలో 2003 నుంచి భూములకు నష్టపరిహారం పొందనివారు, తక్కువ పరిహారంతో తీవ్రంగా నష్టపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. ప్రస్తుతం ఏపీ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ కింద కొత్తగా తాడిపత్రి, పెద్దపప్పూరు, పెద్దవడుగూరు, పామిడి, వజ్రకరూర్, ఉరవకొండ మండలాల్లో 620 కేవీ టవర్ల నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో జిల్లాలో రైతులు 3100 ఎకరాలు నష్టపోయే ప్రమాదముంది. పంట నష్టం జరిగితే రూ.25 వేలు చొప్పున పరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవడం మినహా చట్టం ప్రకారం రైతులకు దక్కాల్సిన పరిహారాన్ని అందించడం లేదు.
నిబంంధనల ప్రకారం దక్కాల్సిన పరిహారం ఇది:
టవర్ నిర్మించిన స్థలానికి ప్రధాన రహదారి పక్కనున్న పొలాలైతే గజానికి రూ.1000, రోడ్డుకు దూరంలో ఉన్న పొలాలైతే గజానికి రూ.100 పరిహారం చెల్లించాలని పాత నిబంధనలు ఉన్నాయి. ఒక టవర్ నుంచి మరో టవర్ వరకూ విద్యుత్ తీగలు వెళ్లే స్థలానికి కూడా మీటరుకు రూ.65 చొప్పున పరిహారం చెల్లించాలి. ఇది చాలా తక్కువని ఇటీవల తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా రైతులు కోర్టును ఆశ్రయించారు.
దీంతో హైవేకు అర కిలోమీటరు దూరంలో ఉంటే ఒక్కో టవర్ ఏర్పాటుకు రూ. 3.50 లక్షలు (350చదరపు అడుగులు) నుంచి రూ.4.50 (350 చదరపు అడుగుల కంటే ఎక్కువ) ఇవ్వాలని కోర్టు తీర్పు ఇచ్చింది. అలాగే ఇతర పొలాలు, స్థలాల్లో టవర్ ఏర్పాటుకు రూ.2.45 లక్షల నుంచి రూ.3.15 లక్షలు ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు పరిహారం కృష్ణా, గుంటూరు, నెల్లూరులో ఇస్తున్నారు. అలాగే తెలంగాణలోని వరంగల్, నల్గొండ జిల్లాలో పరిహారం ఇచ్చారు. ఇదే క్రమలో ప్రస్తుతం చిత్తూరులో జరుగుతున్న టవర్ల నిర్మాణంలో కూడా పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌కు, రైతులకు మధ్య వివాదం రేగుతోంది.
రేపు రైతు సంఘాల ఆధ్వర్యంలో ధర్నాకు ప్రణాళిక
టవర్ల నిర్మాణంలో జరుగుతున్న అన్యాయంపై రైతులు కూడా ధర్నాకు ఉపక్రమించేందుకు సన్నద్ధమవుతున్నారు. జిల్లా రైతు సంఘాల సమాఖ్య అధ్యక్షుడు తరిమెల శరత్‌చంద్రారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ప్రెస్‌క్లబ్‌లో రైతులు, రైతు సంఘాల నాయకులతో చర్చావేదిక కూడా చేపట్టారు. దీనికి రాష్ట్ర, జాతీయ స్థాయిలో రైతు సంఘం నేతలు హాజరుకు కానున్నారు.
ఆ చట్టం.. మాకు చుట్టం!
Published Sun, Dec 21 2014 2:33 AM | Last Updated on Wed, Sep 5 2018 2:06 PM
Advertisement
Advertisement