Indian tennis legend
-
పట్టుదలే ప్రేరణ: పేస్
చెన్నై: కెరీర్లో మరిన్ని శ్రేష్టమైన ఫలితాలు సాధించాలనే తపన, పట్టుదలే తనను ఆటలో కొనసాగేందుకు ప్రేరణగా నిలుస్తున్నాయని భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ తెలిపాడు. 41 ఏళ్ల వయస్సులోనూ చలాకీగా కదులుతూ అంతర్జాతీయస్థాయిలో మంచి విజయాలు సాధిస్తున్న ఈ కోల్‌కతా టెన్నిస్ స్టార్ జీవితంలో ప్రతి అంశంలో అత్యున్నతంగా నిలువాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పాడు. కుమారుడిగా, దేశభక్తుడిగా, క్రీడాకారుడిగా, నాన్నగా ఇలా ప్రతి విభాగంలో అత్యుత్తమంగా ఉండాలనే పట్టుదలే మరింత పురోగతి సాధించేలా చేస్తోందన్నాడు. ‘కొన్ని ఆటంకాలు మన నియంత్రణలో ఉండవు. వేటినైతే మనం నియంత్రించగలమో వాటి గురించే స్పందించాలి. అనవసరంగా కుంగిపోయి, నిరాశవాదంతో ఉంటే సమస్యలు పరిష్కారం కావు. ఆఖరకు అన్నింటికి నా ఆటతీరే సమాధానం ఇస్తుంది. వెనుకంజ వేయడానికి కారణాలేమీ కనిపించడంలేదు’ అని ఆదివారం ముగిసిన చెన్నై ఓపెన్‌లో డబుల్స్‌లో రన్నరప్‌గా నిలిచిన పేస్ అన్నాడు. ‘నా జీవితంలో విమర్శకులకు అంతగా ప్రాముఖ్యత ఇవ్వను. ఏదైతే నమ్ముతానో దాని కోసం పోరాడుతాను. ఎల్లప్పుడూ నిజంవైపే ఉంటాను. అయితే ప్రతికూలతలను ఎదుర్కొనే సమయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించాలి’ అని ఇప్పటికే వరుసగా ఆరు ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన పేస్ తెలిపాడు. ఒకప్పుడు భారత్ నుంచి ఒకరిద్దరు అంతర్జాతీయస్థాయిలో ఆడేవారని, ఇప్పుడు ఆ సంఖ్య 15 నుంచి 20 వరకు చేరుకుందన్నాడు. ఆటతీరును మెరుగుపర్చుకునేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తేనే ఫలితం ఉంటుందని అన్నాడు. -
పేస్... ఫైనల్ నం.92
చెన్నై: దక్షిణాసియాలో జరిగే ఏకైక ఏటీపీ టోర్నమెంట్ చెన్నై ఓపెన్‌లో భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ ఏడోసారి డబుల్స్ విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. తన 99వ భాగస్వామి రావెన్ క్లాసెన్ (దక్షిణాఫ్రికా)తో ఈసారి బరిలోకి 41 ఏళ్ల పేస్ తన కెరీర్లో 92వ టోర్నమెంట్లో డబుల్స్ టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో టాప్ సీడ్ పేస్-క్లాసెన్ ద్వయం 6-3, 6-3తో పాబ్లో కరెనో బుస్టా-గిలెర్మో గార్సియా లోపెజ్ (స్పెయిన్) జంటను ఓడించింది. పురవ్ రాజా (భారత్)-ఆదిల్ (కెనడా); యెన్ సున్ లూ (చైనీస్ తైపీ)-జేమీ ముర్రే (బ్రిటన్) జోడీల మధ్య శనివారం జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో ఆదివారం జరిగే ఫైనల్లో పేస్ ద్వయం తలపడుతుంది. చెన్నై ఓపెన్‌లో గతంలో బరిలోకి దిగిన ఆరుసార్లూ (2012, 2011, 2002, 1999, 1998, 1997) పేస్ డబుల్స్ టైటిల్ నెగ్గడం విశేషం. మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ వావ్రింకా (స్విట్జర్లాండ్)తోపాటు డేవిడ్ గాఫిన్ (బెల్జియం), బెడెన్ (స్లొవేనియా), రొబెర్టా బాటిస్టా అగుట్ (స్పెయిన్) సెమీఫైనల్లోకి అడుగుపెట్టారు.