పేస్... ఫైనల్ నం.92
చెన్నై: దక్షిణాసియాలో జరిగే ఏకైక ఏటీపీ టోర్నమెంట్ చెన్నై ఓపెన్‌లో భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ ఏడోసారి డబుల్స్ విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. తన 99వ భాగస్వామి రావెన్ క్లాసెన్ (దక్షిణాఫ్రికా)తో ఈసారి బరిలోకి 41 ఏళ్ల పేస్ తన కెరీర్‌లో 92వ టోర్నమెంట్‌లో డబుల్స్ టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో టాప్ సీడ్ పేస్-క్లాసెన్ ద్వయం 6-3, 6-3తో పాబ్లో కరెనో బుస్టా-గిలెర్మో గార్సియా లోపెజ్ (స్పెయిన్) జంటను ఓడించింది.
పురవ్ రాజా (భారత్)-ఆదిల్ (కెనడా); యెన్ సున్ లూ (చైనీస్ తైపీ)-జేమీ ముర్రే (బ్రిటన్) జోడీల మధ్య శనివారం జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో ఆదివారం జరిగే ఫైనల్లో పేస్ ద్వయం తలపడుతుంది. చెన్నై ఓపెన్‌లో గతంలో బరిలోకి దిగిన ఆరుసార్లూ (2012, 2011, 2002, 1999, 1998, 1997) పేస్ డబుల్స్ టైటిల్ నెగ్గడం విశేషం. మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ వావ్రింకా (స్విట్జర్లాండ్)తోపాటు డేవిడ్ గాఫిన్ (బెల్జియం), బెడెన్ (స్లొవేనియా), రొబెర్టా బాటిస్టా అగుట్ (స్పెయిన్) సెమీఫైనల్లోకి అడుగుపెట్టారు.