the Chennai Open
-
తొలిసారి క్వాలిఫయర్...
చెన్నై ఓపెన్ ఫైనల్లోకి బెడెన్ చెన్నై: తన సంచలన ప్రదర్శన కొనసాగిస్తూ స్లొవేనియా యువ ఆటగాడు అల్జాజ్ బెడెన్ చెన్నై ఓపెన్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 20 ఏళ్ల చెన్నై ఓపెన్ చరిత్రలో ఓ క్వాలిఫయర్ టైటిల్ పోరుకు అర్హత సాధించడం ఇదే తొలిసారి. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి సెమీఫైనల్లో ప్రపంచ 156వ ర్యాంకర్ బెడెన్ 3-6, 6-3, 7-6 (10/8)తో ప్రపంచ 15వ ర్యాంకర్, మూడో సీడ్ రొబెర్టా బాటిస్టా అగుట్ (స్పెయిన్)పై విజయం సాధించాడు. ఆదివారం జరిగే ఫైనల్లో వావ్రింకా (స్విట్జర్లాండ్)తో బెడెన్ తలపడతాడు. సెమీస్‌లో వావ్రింకా 7-5, 6-3తో నాలుగో సీడ్ డేవిడ్ గాఫిన్ (బెల్జియం)పై గెలిచాడు. -
పేస్... ఫైనల్ నం.92
చెన్నై: దక్షిణాసియాలో జరిగే ఏకైక ఏటీపీ టోర్నమెంట్ చెన్నై ఓపెన్‌లో భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ ఏడోసారి డబుల్స్ విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. తన 99వ భాగస్వామి రావెన్ క్లాసెన్ (దక్షిణాఫ్రికా)తో ఈసారి బరిలోకి 41 ఏళ్ల పేస్ తన కెరీర్లో 92వ టోర్నమెంట్లో డబుల్స్ టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో టాప్ సీడ్ పేస్-క్లాసెన్ ద్వయం 6-3, 6-3తో పాబ్లో కరెనో బుస్టా-గిలెర్మో గార్సియా లోపెజ్ (స్పెయిన్) జంటను ఓడించింది. పురవ్ రాజా (భారత్)-ఆదిల్ (కెనడా); యెన్ సున్ లూ (చైనీస్ తైపీ)-జేమీ ముర్రే (బ్రిటన్) జోడీల మధ్య శనివారం జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో ఆదివారం జరిగే ఫైనల్లో పేస్ ద్వయం తలపడుతుంది. చెన్నై ఓపెన్‌లో గతంలో బరిలోకి దిగిన ఆరుసార్లూ (2012, 2011, 2002, 1999, 1998, 1997) పేస్ డబుల్స్ టైటిల్ నెగ్గడం విశేషం. మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ వావ్రింకా (స్విట్జర్లాండ్)తోపాటు డేవిడ్ గాఫిన్ (బెల్జియం), బెడెన్ (స్లొవేనియా), రొబెర్టా బాటిస్టా అగుట్ (స్పెయిన్) సెమీఫైనల్లోకి అడుగుపెట్టారు. -
వినాయక్ శర్మ సంచలనం
చెన్నై: అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ ప్లేయర్ కాజా వినాయక్ శర్మ తన కెరీర్లోనే గొప్ప విజయాన్ని సాధించాడు. దక్షిణాసియాలోని ఏకైక ఏటీపీ టోర్నమెంట్ చెన్నై ఓపెన్‌లో ఈ వైజాగ్ కుర్రాడు క్వాలిఫయింగ్ పోటీల్లో ఫైనల్ రౌండ్‌కు దూసుకెళ్లాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ రెండో రౌండ్లో ప్రపంచ 902వ ర్యాంకర్ వినాయక్ శర్మ 6-4, 6-7 (5/7), 7-6 (7/4)తో ప్రపంచ 119వ ర్యాంకర్, రెండో సీడ్ అలెగ్జాండర్ కుద్రయెత్సెవ్ (రష్యా)పై సంచలన విజయం సాధించాడు. 2 గంటల 58 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో 23 ఏళ్ల వినాయక్ శర్మ ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. సోమవారం జరిగే క్వాలిఫయింగ్ ఫైనల్ రౌండ్లో అల్జాజ్ బెడెన్ (స్లొవేనియా)తో వినాయక్ ఆడతాడు. ఈ మ్యాచ్‌లో గెలిస్తే వినాయక్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధిస్తాడు. మరోవైపు భారత్‌కే చెందిన యువ ఆటగాళ్లు విష్ణువర్ధన్, యూకీ బాంబ్రీలకు నిరాశ ఎదురైంది. హైదరాబాద్ ప్లేయర్ విష్ణువర్ధన్ 5-7, 4-6తో ఇల్యా మర్చెంకో (ఉక్రెయిన్) చేతిలో; యూకీ బాంబ్రీ 6-1, 6-7 (3/7), 3-6తో విజయ్ సుందర్ ప్రశాంత్ (భారత్) చేతిలో ఓడిపోయారు. -
విష్ణు, యూకీ శుభారంభం
చెన్నై: దక్షిణాసియాలో జరిగే ఏకైక ఏటీపీ టోర్నమెంట్ అయిన చెన్నై ఓపెన్‌లో హైదరాబాద్ ప్లేయర్ విష్ణువర్ధన్‌తోపాటు భారత అగ్రశ్రేణి ఆటగాడు యూకీ బాంబ్రీ క్వాలిఫయింగ్ విభాగంలో శుభారంభం చేశారు. శనివారం మొదలైన క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో ఈ ఇద్దరూ పురుషుల సింగిల్స్‌లో తొలి రౌండ్ అడ్డంకిని అధిగమించారు. భారత డేవిస్ కప్ జట్టు మాజీ సభ్యుడు, లండన్ ఒలింపియన్ కూడా అయిన విష్ణు తొలి రౌండ్లో 6-1, 6-3తో సూరజ్ ప్రబోధ్ (భారత్)పై అలవోకగా గెలిచాడు. 57 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జాతీయ హార్డ్‌కోర్టు చాంపియన్ విష్ణు ఐదు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. మరో తొలి రౌండ్లో యూకీ బాంబ్రీ 6-1, 6-3తో సిద్ధార్థ్ రావత్ (భారత్)ను ఓడించాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కాజా వినాయక్ శర్మ, తమిళనాడు ప్లేయర్ జీవన్ నెదున్‌చెజియాన్ కూడా రెండో రౌండ్లోకి అడుగుపెట్టారు. తొలి రౌండ్లో వినాయక్ శర్మ 3-6, 6-4, 6-2తో దనాయ్ ఉడోమ్చోక్ (థాయ్‌లాండ్)పై, జీవన్ 6-2, 6-2తో లక్షిత్ సూద్ (భారత్)పై గెలిచారు. ఆదివారం జరిగే క్వాలిఫయింగ్ రెండో రౌండ్లో విజయ్ సుందర్ ప్రశాంత్‌తో యూకీ బాంబ్రీ; మర్చెంకో (ఉక్రెయిన్)తో విష్ణు; కుద్రయెత్సోవ్ (రష్యా)తో వినాయక్ శర్మ తలపడతారు. సోమ్‌దేవ్ ప్రత్యర్థి యెన్ ఉన్ లూ ఈ టోర్నమెంట్‌కు సంబంధించి పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’ను శనివారం విడుదల చేశారు. క్వాలిఫయింగ్ పోటీల నుంచి నలుగురు ఆటగాళ్లు మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధిస్తారు. సోమవారం మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు మొదలవుతాయి. భారత నంబర్‌వన్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ తొలి రౌండ్లో యెన్ సున్ లూ (చైనీస్ తైపీ)తో ఆడతాడు. తత్సుమా ఇటో (జపాన్)తో భారత్‌కే చెందిన రామ్‌కుమార్ రామనాథన్ పోటీపడతాడు. టాప్ సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్), రెండో సీడ్ ఫెలిసియానో లోపెజ్ (స్పెయిన్), మూడో సీడ్ బాటిస్టా అగుట్ (స్పెయిన్), నాలుగో సీడ్ డేవిడ్ గాఫిన్ (బెల్జియం)లకు తొలి రౌండ్లో ‘బై’ లభించింది. పేస్ జంటకు టాప్ సీడింగ్ పురుషుల డబుల్స్‌లో లియాండర్ పేస్ (భారత్)-రావెన్ క్లాసెన్ (దక్షిణాఫ్రికా) జోడీకి టాప్ సీడింగ్ దక్కింది. తొలి రౌండ్లో వీరిద్దరు లుకాస్ లాకో (స్లొవేకియా)-ఆండ్రియా హైదర్ (ఆస్ట్రియా)లతో ఆడతారు. మరోవైపు సాకేత్ మైనేని-మహేశ్ భూపతి (భారత్) జంట తొలి రౌండ్లో అలెజాంద్రో ఫలా-అలెజాంద్రో గొంజాలెజ్ (కొలంబియా) ద్వయంతో ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే రెండో రౌండ్లో పేస్-క్లాసెన్‌లను సాకేత్-భూపతి ‘ఢీ’ కొంటారు.