ఉద్యోగాలు కోల్పోయిన వందలాది భారతీయులు
న్యూఢిల్లీ: ఉపాధికోసం సౌదీ అరేబియా, కువైట్ వెళ్లిన వందలాదిమంది భారతీయులు ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ చెప్పారు. ఫ్యాక్టరీలు మూతపడటంతో భారతీయులు చాలామంది ఉపాధి కోల్పోయారని, వారికి జీతాలు చెల్లించడం లేదని తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ సౌదీ అరేబియా వెళ్లారని సుష్మా శనివారం ట్వీట్ చేశారు.
సౌదీ అరేబియాలోని జెద్దాలో గత మూడురోజుల్లో దాదాపు 800 మంది భారతీయులు ఉద్యోగాలు కోల్పోయారని ఓ వ్యక్తి ట్విట్టర్ ద్వారా సుష్మా దృష్టికి తీసుకురాగా ఆమె స్పందించారు. ఉద్యోగాలు కోల్పోయిన భారతీయులకు భోజనం సమకూర్చాల్సిందిగా సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం అధికారులను ఆదేశించినట్టు సుష్మా ట్వీట్ చేశారు. కువైట్ కంటే సౌదీ అరేబియాలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని చెప్పారు. అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, భారతీయులను ఆదుకుంటామని తెలిపారు.