లాటరీ కింగ్ రూ.122 కోట్ల ఆస్తుల జప్తు
చెన్నై : దేశంలో లాటరీ కింగ్ గా పేరొందిన శాంటియాగో మార్టిన్కి చెందిన రూ.122 కోట్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో లాటరీ టికెట్ల అమ్మకాల్లో అవకతవకలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై అతనిపై ఆరెండు రాష్ట్రాల్లో అనేక కేసులు నమోదైనాయి. మార్టిన్ 2007లో కేరళలోని సీపీఎంకు చెందిన ఒక వార్తా పత్రికకు రూ.2 కోట్ల విరాళం ఇచ్చినట్లు జరిగిన ప్రచారం కలకలం సృష్టించింది.
ప్రతిపక్షాల ఒత్తిడి మేరకు ఈ కేసు విచారణ సీబీఐ చేతుల్లోకి వెళ్లింది. ఈ కేసు విచారణలో భాగంగా ఈడీ అధికారులు మార్టిన్ ఆస్తులపై దృష్టిపెట్టి విచారించగా అనేక అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో సోమవారం మార్టిన్కు చెందిన రూ.122.4 కోట్ల విలువైన నాలుగు సంస్థల స్థిరాస్తులను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు మార్టిన్ కుటుంబసభ్యుల పేరు మీద సుమారు రూ.5000వేల కోట్లు ఉన్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. గతంలోనూ మార్టిన్కు చెందిన ఆస్తులు, ఇళ్లపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడి చేసి సుమారు వందకోట్లకు పైగా స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. మార్టిన్ పై ఇప్పటికే సిక్కింలో 4500 కోట్ల రూపాయల చీటింగ్ కేసు కూడా ఉంది.