Indias rank
-
వరల్డ్ ఎకనమిక్ ఫ్రీడమ్ ఇండెక్స్‌లో దిగువకు భారత్
న్యూఢిల్లీ: వరల్డ్ ఎకనమిక్ ఫ్రీడమ్ ఇండెక్స్‌లో భారత్ ర్యాంక్ తగ్గింది. ఎకనమిక్ ఫ్రీడమ్ ఆఫ్ ద వరల్డ్-2016 వార్షిక నివేదిక ప్రకారం.. ఇండియా పది స్థానాలు కోల్పోయి 112వ స్థానంలో నిలిచింది. న్యాయ వ్యవస్థ, ఆస్తి హక్కు, అంతర్జాతీయ వ్యాపారం, నియంత్రణలు, ప్రభుత్వపు పరిమాణం వంటి పలు అంశాల్లో భారత్ పేలవ ప్రదర్శన కనబరిచిందని నివేదిక పేర్కొంటోంది. దీంతో ర్యాంక్ కిందకు పడింది. కాగా చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాలు భారత్ వెనక వరుసలో నిలిచాయి. ఇవి వరుసగా 113వ స్థానాన్ని, 121వ స్థానాన్ని, 133వ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. ఇక భూటాన్ (78వ స్థానం), నేపాల్ (108వ స్థానం), శ్రీలంక (111వ స్థానం) దేశాలు మన కన్నా ముందు వరుసలో నిలిచాయి. టాప్‌లో హాంకాంగ్, సింగపూర్, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్, కెనడా, జార్జియా, ఐర్లాండ్, మారిషస్, యూఏఈ, ఆస్ట్రేలియా, యూకే వంటి దేశాలు ఉన్నాయి. చివర్లో ఇరాన్, అల్జీరియా, అర్జెం టినా, గినియా వంటి దేశాలు నిలిచాయి. -
భారత్ ర్యాంక్ మెరుగుకు కృషి
నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీ: వ్యాపారం చేసుకోడానికి సులభతరమైన దేశాలకు సంబంధించి ప్రపంచబ్యాంక్ జాబితాలో భారత్ ర్యాంక్ ఈ ఏడాది మెరుగుపడుతుందన్న విశ్వాసాన్ని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వ్యక్తంచేశారు. ఈ దిశలో ప్రభుత్వం పలు చర్యలు తీసుకుందని ఆమె పేర్కొన్నారు. 189 దేశాల ఇటీవలి ప్రపంచ బ్యాంక్ జాబితాలో భారత్ ర్యాంక్ 142 కావడం గమనార్హం. సీఐఐ, ఫిక్కీలు ఇక్కడ నిర్వహించిన వేర్వేరు కార్యక్రమల్లో పాల్గొన్న సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడిన ముఖ్యాంశాలను చూస్తే... - దేశంలో వ్యాపార అవకాశాల మెరుగుకు కేంద్రంతోపాటు పలు రాష్ట్రాలు కూడా తగిన చర్యలు తీసుకుంటున్నాయి. - దేశంలో మౌలిక రంగం అభివృద్ధికి సైతం కేంద్రం పెట్టుబడులు పెడుతోంది. - ఆరోగ్య భద్రత, ఇంధనం, ఆటోమొబైల్, రక్షణ వంటి అంశాల్లో పెట్టుబడులకు భారత్‌లో మంచి అవకాశాలు ఉన్నాయి. - ఈ కామర్స్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల అంశంపై రాష్ట్రాలతో తమ మంత్రిత్వశాఖ చర్చలు జరుపుతోంది.