indiramma houses irregularities
-
ఇళ్లు కట్టకున్నా..బిల్లులిచ్చారు
తవ్వినాకొద్దీ అక్రమాలే... - హౌసింగ్ సిబ్బందిదే కీలక పాత్ర - విచారణలో వెలుగుచూస్తున్న నిజాలు మల్హర్: ఇందిరమ్మ ఇళ్ల అక్రమాలపై సీఐడీ అధికారులు చేస్తున్నవిచారణలో నమ్మలేని నిజాలు బైట పడుతున్నాయి. పలువురు ఇళ్లు నిర్మించుకోకున్నా, స్థానికంగా లేని వారికి, చనిపోయిన వారి పేరిట కూడా బిల్లులు మంజూరు చేశారంటే హౌసింగ్ అధికారుల అవినీతి ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మల్హర్ మండలం రుద్రారంలో ఇందిరమ్మ ఇళ్ల అక్రమాలపై సీఐడీ అధికారులు డీఎస్పీ మహేందర్, సీఐ ప్రకాశ్ సోమవారం విచారణ చేపట్టారు. 12ఏళ్ల క్రితం చనిపోయిన వారిపేర ఇళ్లు మంజూరై బిల్లులుసైతం ముట్టిన సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఈ గ్రామానికి 1133 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా మూడో బృందం చేసిన సర్వేలో 147ఇళ్లలో మాత్రమే అవినీతి జరిగినట్లు హౌసింగ్ అధికారుల తెలిపారు. అన్ని ఇళ్లలో అక్రమాలు ఉన్నట్లు అనుమానించిన అధికారులు గతనెల 14నుంచి మల్హర్ మండలం రుద్రారంలో విచారణ మొదలు పెట్టారు. మూడో బృందం చేపట్టిన సర్వేలో సైతం తప్పులు జరిగినట్లు వెల్లడవుతోంది. గ్రామంలోని చిట్యాల లస్మయ్య 12 ఏళ్ల క్రితం దొబ్బల రాజేశ్వరి 8 ఏళ్ల క్రితం చనిపోయారు. ఇళ్లు నిర్మించకుండానే వారి పేరిట బిల్లులు చెల్లించినట్లు వెల్లడైంది. గ్రామంలో లేని కనుకం మల్లయ్య, అత్కురి రాజయ్యలు ఇళ్లు కట్టకుండానే బిల్లులు ముట్టినట్లు తేలింది. విచారణ నిమిత్తం హౌసింగ్ అధికారులు 1133ఇళ్లకు నంబర్లు వేశారు. ఒకరి ఇంటికి మరొకరి నంబర్ వేయడంతో హౌసింగ్ అధికారులపై సీఐడీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో రెండు మూడు రోజుల్లో ఈ గ్రామంలో సర్వే పూర్తవుతుందని డీఎస్పీ మహేందర్ తెలిపారు. విచారణలో అక్రమాలను గుర్తించామని, అవినీతికి సంబంధించిన బాధ్యులపై వివరాలు సేకరించి, నివేదికను ఐజీ చారుసిన్హాకు అందజేయనున్నట్లు వివరించారు. విచారణలో హౌసింగ్ డీఈలు భాస్కర్, గట్టుమల్లు సిబ్బంది పాల్గొన్నారు. -
వేటుకు వేళాయే!
►‘ఇందిరమ్మ’ అక్రమాలపై దర్యాప్తు పూర్తి ►1, 2 విడతల్లోనే భారీ అక్రమాలు నిర్ధారించిన సీఐడీ బృందాలు ►డీఎస్పీలతో ఐజీ చారుసిన్హా సమావేశం ►అనర్హుల ఎంపిక బాధ్యులపై చర్యలు ►అక్రమార్కుల గుండెళ్లో రైళ్లు సాక్షి, కరీంనగర్ : తీగలాగితే డొంక కదిలింది. రాజకీయ అండదండ.. అధికారంతో బలహీనవర్గాలకు చెందాల్సిన ఇందిరమ్మ ఇళ్లలో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలకు రంగం సిద్ధమవుతోంది. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు విషయంలో క్షేత్రస్థాయిలో జరిగిన అక్రమాలు, అవినీతిపై ఇప్పటికే సీబీసీఐడీ బృందాలు జిల్లాలోని మంథని, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో 15 రోజుల పాటు విచారణ జరిపిన విషయం తెలిసిందే. కరీంనగర్‌తోపాటు తెలంగాణ రాష్ట్రం లోని పలు జిల్లాల్లో సీఐడీ డీఎస్పీల ఆధ్వర్యంలో బృందాలు విచారణ చేపట్టాయి. రికార్డుల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఉన్నా.. క్షేత్రస్థాయిలో ఆ ప్రాంతం లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టని వాస్తవాలు చాలా చోట్ల వెలుగులోకి వచ్చాయి. బిల్లుల మాయ, అభ్యర్థుల తారుమారులాంటి అక్రమాలెన్నో సీఐడీ దృష్టికి వచ్చాయి. ఇన్ని రోజుల విచారణలో తేలిన విషయాలు.. వెలుగుచూసిన అక్రమాలపై సీఐడీ ఐజీ చారుసిన్హా గురువారం హైదరాబాద్‌లో సీఐడీ డీఎస్పీలతో సమావేశమయ్యారు. విచారణపై సమీక్షిం చారు. ఈ సమీక్షలో జిల్లాలో సింగరేణి కార్మికులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, పోలీసు, వైద్య, రైల్వేశాఖ సిబ్బంది, హాస్టల్ వార్డెన్లతోపాటు అవివాహితులకూ ఇందిరమ్మ ఇళ్లు మంజూ రైనట్లు తేలిందని అధికారులు ఐజీ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఇందిరమ్మ 1, 2 విడతల్లోనే పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు సీఐడీ బృందాలు నిగ్గు తేల్చాయి. అనర్హులను ఎంపిక చేసిన ప్రభుత్వ అధికారులు, సిబ్బందితోపాటు పలు చోట్ల సిబ్బందిపై ఒత్తిడి తెచ్చిన సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులపైనా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ఇప్పటికే విచారణ నివేదికలను అధ్యయనం చేసిన ఐజీ చారుసిన్హా త్వరలోనే... తమ బృందా లు విచారణ చేపట్టిన ప్రాంతాల్లో పర్యటించాలని నిర్ణయించి నట్లు తెలిసింది. ఇందిరమ్మ ఇళ్ల అక్రమాలపై ప్రభుత్వ కఠిన వైఖరి.. సీబీసీఐడీ దూకుడుతో అవినీతి అధికారులు, ప్రజాప్రతినిధులు అనర్హుల గుండెళ్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. -
‘ఇంటి’ గుట్టు.. ఇక రట్టు..!
సాక్షి, కర్నూలు : ఇందిరమ్మ ఇళ్ల అక్రమాలపై సర్కారు సాంకేతిక అస్త్రాన్ని సంధించబోతోంది. ప్రభుత్వ నిధులు భారీగా దిగమింగిన వారి భరతం పట్టాలని నిర్ణయించింది. పదేళ్లలో గృహ నిర్మాణ పథకంలో జరిగిన అక్రమాలను వెలుగులోకి తేనుంది. బినామీ పేర్లతో ఇళ్లు పొంది బిల్లులు తీసుకున్న వారెవరో తేలిపోనుంది. పాత ఇళ్లకే బిల్లులు మంజూరు చేయించుకున్న వారి గుట్టు రట్టుకానుంది. ఒకే ఇంటిపై రెండు మూడు బిల్లులు కాజేసిన వారి చిరునామాలూ బయట పెట్టనుంది. ఆగస్టు నుంచి అక్రమాలను నిగ్గుతేల్చేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలో 2006-07లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు 3,10,851 గృహాలు ఈ పథకం కింద నిర్మించారు. రూ. 900 కోట్లకుపైగా లబ్ధిదారులకు బిల్లుల రూపంలో చెల్లించారు. 2007-12 వరకు నిర్మించిన ఇళ్లలో రూ. 5.14 కోట్ల అవినీతి జరిగినట్లు గతంలో థర్డ్‌పార్టీ విచారణలో తేల్చారు. అది కూడా 50 మండలాల పరిధిలోని 185 గ్రామాల్లో మాత్రమే విచారిస్తే తేలిన నిజం. రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం అక్రమార్కుల నుంచి సొమ్ము రాబట్టాల్సి ఉండగా కేవలం రూ. 18 లక్షలు మాత్రమే వసూలు చేసినట్టు లెక్కలు చూపిస్తుండగా.. జరిగిన అవినీతి అక్రమాలను నిగ్గుతేల్చేందుకు నియమించిన ప్రత్యేకాధికారికి ప్రయాణ, ఖర్చుల పేరిట ఏడాది కాలంలో రూ. 15.60 లక్షలు చెల్లించడం గమనార్హం. నామమాత్రంగా చేపట్టిన సర్వేలో 5,532 మంది లబ్ధిదారులతోపాటు 206 మంది ఉద్యోగులు, 11 మంది గృహ నిర్మాణ శాఖ సిబ్బంది కలిసి అవినీతికి పాల్పడినట్టు తేలగా ఇక ‘జియో ట్యాగింగ్’ విధానం ద్వారా విచారణ మొదలు పెడితే ఎన్ని ‘అక్రమాలు’ వెలుగుచూస్తాయో చూడాలి. 2004 నుంచి 2014 వరకూ గృహ నిర్మాణాలను ఇష్టారాజ్యంగా చేపట్టారనే ఆరోపణలు ఉన్నా వెలికితీసేందుకు పటిష్ట చర్యలు తీసుకోలేదు. అక్రమాలలో అప్పటి అధికారపార్టీ నేతల హస్తం, కొందరు గృహనిర్మాణ శాఖ సిబ్బంది తప్పులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం అలాంటి వారిపై కొరడా ఝళిపించేందుకు ప్రభుత్వం ఉపక్రమించింది. వెలుగులోకి అక్కమార్కుల అవినీతి.. గృహ నిర్మాణ పథకంలో జరిగిన అక్రమాలను గుర్తించేందుకు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంది. వాటిని వెలికి తీయడంతోపాటు, కొత్త నిర్మాణాల్లో అవినీతిని నివారించేందుకు భౌగోళిక గుర్తింపు(జియో ట్యాగింగ్) సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని నిర్ణయించింది. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్(జీపీఎస్) ద్వారా అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా లబ్ధిదారుల ఇళ్లను గుర్తిస్తారు. దీని కోసం ప్రత్యేక సెల్ఫోన్లను గృహ నిర్మాణ సంస్థ అధికారులకు అందించనున్నారు. వీటి ద్వారా ముందుగానే పొందుపర్చుకున్న గృహ నిర్మాణ సంస్థ వెబ్సైట్లో లాగిన్ అయి సంబంధిత లబ్ధిదారుని ఐడీ నెంబరు పొందుపర్చుతారు. లబ్ధిదారుని పూర్తి వివరాలు వస్తాయి. తమ వద్ద ఉన్న సెల్‌ఫోనులో ఆ ఇంటి ద్వారం ఎటువైపు ఉందో ఆ వైపు నుంచి ఫొటో తీస్తారు. అనంతరం సెల్‌ఫోను నుంచే గ్లోబల్ పొజిషనింగ్ పద్ధతిలో ఉపగ్రహానికి అనుసంధానం చేస్తారు. ఆ తరువాత తీసిన ఫొటోలను ఆన్‌లైన్‌లోనూ అప్లోడ్ చేసి గృహ నిర్మాణ సంస్థ వెబ్‌సైట్‌కు పంపిస్తారు. ఒక స్థలంపై నిర్మించిన ఇంటిని అక్షాంశ, రేఖాంశాలతో గుర్తించిన తరువాత అదే స్థలంలో మరో ఇంటిని చూపించేందుకు వీలుండదు. ఒకే ఇంటిపై ఒకటి కన్నా ఎక్కువ బిల్లులు తీసుకున్న వారి ఐడీ నంబర్ల ఆధారంగా గుట్టు రట్టవుతుంది. ప్రస్తుతం గృహనిర్మాణ పథకం కింద చెల్లింపులు నిలిచిపోయాయి. బకాయిలు భారీగా పేరుకుపోయాయి. తాజా విధానం అమల్లోకి వస్తే ఇలాంటి ఇబ్బందులుండవంటున్నారు. మరో వైపు బిల్లుల కోసం అధికారులు, గృహ నిర్మాణ సంస్థ కార్యాలయాల చుట్టూ లబ్ధిదారులు తిరగాల్సిన పని ఉండదు. నిర్మాణ దశ నుంచి మరో దశకు చేరగానే ఆన్లైన్లో గుర్తించి బిల్లులు మంజూరు చేసేందుకు వీలుంటుంది. బిల్లుల కోసం లబ్ధిదారుడు తనకు కేటాయించిన ఐడీ నంబరుతో సంక్షిప్త సందేశాన్ని(ఎస్ఎంఎస్) గృహ నిర్మాణ సంస్థకు చెందిన నంబరుతో పంపితే ఆ గుర్తింపు సంఖ్యతో జిల్లాలోని ఏ గ్రామానికి చెందినదో గుర్తించి ప్రధాన శాఖ నుంచి అక్కడి సిబ్బందికి సమాచారం వెళ్తుంది. జిల్లాలో ఆగస్టు నుంచి ఈ విధానం అమలు చేయాలని నిర్ణయించారు.