సాక్షి, కర్నూలు : ఇందిరమ్మ ఇళ్ల అక్రమాలపై సర్కారు సాంకేతిక అస్త్రాన్ని సంధించబోతోంది. ప్రభుత్వ నిధులు భారీగా దిగమింగిన వారి భరతం పట్టాలని నిర్ణయించింది. పదేళ్లలో గృహ నిర్మాణ పథకంలో జరిగిన అక్రమాలను వెలుగులోకి తేనుంది. బినామీ పేర్లతో ఇళ్లు పొంది బిల్లులు తీసుకున్న వారెవరో తేలిపోనుంది. పాత ఇళ్లకే బిల్లులు మంజూరు చేయించుకున్న వారి గుట్టు రట్టుకానుంది.
ఒకే ఇంటిపై రెండు మూడు బిల్లులు కాజేసిన వారి చిరునామాలూ బయట పెట్టనుంది. ఆగస్టు నుంచి అక్రమాలను నిగ్గుతేల్చేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలో 2006-07లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు 3,10,851 గృహాలు ఈ పథకం కింద నిర్మించారు. రూ. 900 కోట్లకుపైగా లబ్ధిదారులకు బిల్లుల రూపంలో చెల్లించారు.
2007-12 వరకు నిర్మించిన ఇళ్లలో రూ. 5.14 కోట్ల అవినీతి జరిగినట్లు గతంలో థర్డ్‌పార్టీ విచారణలో తేల్చారు. అది కూడా 50 మండలాల పరిధిలోని 185 గ్రామాల్లో మాత్రమే విచారిస్తే తేలిన నిజం. రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం అక్రమార్కుల నుంచి సొమ్ము రాబట్టాల్సి ఉండగా కేవలం రూ. 18 లక్షలు మాత్రమే వసూలు చేసినట్టు లెక్కలు చూపిస్తుండగా.. జరిగిన అవినీతి అక్రమాలను నిగ్గుతేల్చేందుకు నియమించిన ప్రత్యేకాధికారికి ప్రయాణ, ఖర్చుల పేరిట ఏడాది కాలంలో రూ. 15.60 లక్షలు చెల్లించడం గమనార్హం.
నామమాత్రంగా చేపట్టిన సర్వేలో 5,532 మంది లబ్ధిదారులతోపాటు 206 మంది ఉద్యోగులు, 11 మంది గృహ నిర్మాణ శాఖ సిబ్బంది కలిసి అవినీతికి పాల్పడినట్టు తేలగా ఇక ‘జియో ట్యాగింగ్’ విధానం ద్వారా విచారణ మొదలు పెడితే ఎన్ని ‘అక్రమాలు’ వెలుగుచూస్తాయో చూడాలి. 2004 నుంచి 2014 వరకూ గృహ నిర్మాణాలను ఇష్టారాజ్యంగా చేపట్టారనే ఆరోపణలు ఉన్నా వెలికితీసేందుకు పటిష్ట చర్యలు తీసుకోలేదు. అక్రమాలలో అప్పటి అధికారపార్టీ నేతల హస్తం, కొందరు గృహనిర్మాణ శాఖ సిబ్బంది తప్పులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం అలాంటి వారిపై కొరడా ఝళిపించేందుకు ప్రభుత్వం ఉపక్రమించింది.
వెలుగులోకి అక్కమార్కుల అవినీతి..
గృహ నిర్మాణ పథకంలో జరిగిన అక్రమాలను గుర్తించేందుకు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంది. వాటిని వెలికి తీయడంతోపాటు, కొత్త నిర్మాణాల్లో అవినీతిని నివారించేందుకు భౌగోళిక గుర్తింపు(జియో ట్యాగింగ్) సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని నిర్ణయించింది. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్(జీపీఎస్) ద్వారా అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా లబ్ధిదారుల ఇళ్లను గుర్తిస్తారు. దీని కోసం ప్రత్యేక సెల్‌ఫోన్లను గృహ నిర్మాణ సంస్థ అధికారులకు అందించనున్నారు.
వీటి ద్వారా ముందుగానే పొందుపర్చుకున్న గృహ నిర్మాణ సంస్థ వెబ్‌సైట్‌లో లాగిన్ అయి సంబంధిత లబ్ధిదారుని ఐడీ నెంబరు పొందుపర్చుతారు. లబ్ధిదారుని పూర్తి వివరాలు వస్తాయి. తమ వద్ద ఉన్న సెల్‌ఫోనులో ఆ ఇంటి ద్వారం ఎటువైపు ఉందో ఆ వైపు నుంచి ఫొటో తీస్తారు. అనంతరం సెల్‌ఫోను నుంచే గ్లోబల్ పొజిషనింగ్ పద్ధతిలో ఉపగ్రహానికి అనుసంధానం చేస్తారు. ఆ తరువాత తీసిన ఫొటోలను ఆన్‌లైన్‌లోనూ అప్‌లోడ్ చేసి గృహ నిర్మాణ సంస్థ వెబ్‌సైట్‌కు పంపిస్తారు. ఒక స్థలంపై నిర్మించిన ఇంటిని అక్షాంశ, రేఖాంశాలతో గుర్తించిన తరువాత అదే స్థలంలో మరో ఇంటిని చూపించేందుకు వీలుండదు.
ఒకే ఇంటిపై ఒకటి కన్నా ఎక్కువ బిల్లులు తీసుకున్న వారి ఐడీ నంబర్ల ఆధారంగా గుట్టు రట్టవుతుంది. ప్రస్తుతం గృహనిర్మాణ పథకం కింద చెల్లింపులు నిలిచిపోయాయి. బకాయిలు భారీగా పేరుకుపోయాయి. తాజా విధానం అమల్లోకి వస్తే ఇలాంటి ఇబ్బందులుండవంటున్నారు. మరో వైపు బిల్లుల కోసం అధికారులు, గృహ నిర్మాణ సంస్థ కార్యాలయాల చుట్టూ లబ్ధిదారులు తిరగాల్సిన పని ఉండదు. నిర్మాణ దశ నుంచి మరో దశకు చేరగానే ఆన్‌లైన్‌లో గుర్తించి బిల్లులు మంజూరు చేసేందుకు వీలుంటుంది.
బిల్లుల కోసం లబ్ధిదారుడు తనకు కేటాయించిన ఐడీ నంబరుతో సంక్షిప్త సందేశాన్ని(ఎస్‌ఎంఎస్) గృహ నిర్మాణ సంస్థకు చెందిన నంబరుతో పంపితే ఆ గుర్తింపు సంఖ్యతో జిల్లాలోని ఏ గ్రామానికి చెందినదో గుర్తించి ప్రధాన శాఖ నుంచి అక్కడి సిబ్బందికి సమాచారం వెళ్తుంది. జిల్లాలో ఆగస్టు నుంచి ఈ విధానం అమలు చేయాలని నిర్ణయించారు.
‘ఇంటి’ గుట్టు.. ఇక రట్టు..!
Published Wed, Jul 16 2014 3:40 AM | Last Updated on Sat, Sep 2 2017 10:20 AM
Advertisement
Advertisement