Individual Homes
-
Hyderabad: ఫ్లాట్ నుంచి 'ఇంటి' వైపు!.. ఆ గృహాలకు భారీ డిమాండ్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అపార్ట్మెంట్ల కొనుగోళ్లు భారీగా తగ్గిపోతున్నాయి. అదే సమయంలో వ్యక్తిగత (ఇండివిడ్యువల్) గృహాలకు మాత్రం డిమాండ్ పెరిగింది. కరోనా అనంతర పరిణామాలు, ఆర్థిక పరిస్థితులే దీనికి కారణమని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు అంటున్నారు. అప్పట్లో అపార్ట్మెంట్లలో ఫ్లాట్ల కొనుగోళ్లకు ఆసక్తిచూపిన కొనుగోలుదారులు.. ఇప్పుడు వ్యక్తిగత గృహాలకే మొగ్గు చూపుతున్నారని చెబుతున్నారు. ముఖ్యంగా కాస్త పచ్చదనంతో, రణగొణధ్వనులకు దూరంగా, ఆహ్లాద వాతావరణం ఉండే ప్రాంతాలవైపు కొనుగోలుదారులు దృష్టిసారిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కరోనాతో మారిన అభిరుచులు కరోనా వ్యాప్తి, తదనంతర పరిణామాలతో ప్రజల జీవన విధానంలో, గృహ కొనుగోలుదారుల తీరులో మార్పులు వచ్చాయి. గతంలో ప్రధాన నగరంలో, ప్రజా రవాణా వ్యవస్థ మెరుగ్గా ఉన్న ప్రాంతాల్లోనే గృహాలను కొనుగోలు చేసేవారు. కోవిడ్ తర్వాత ఒకేచోట ఎక్కువ కుటుంబాలు నివాసం ఉండే అపార్ట్మెంట్లలో ఫ్లాట్ల కొనుగోళ్లపై ఆసక్తి తగ్గిపోయింది. దానికితోడు ఆన్లైన్ క్లాసులు, వర్క్ ఫ్రం హోమ్‌తో ఇంట్లో ప్రత్యేకంగా గది, ఓపెన్ జిమ్ వంటివి అవసరమయ్యాయి. దీనివల్ల విస్తీర్ణం ఎక్కువగా ఉన్న వ్యక్తిగత గృహాలు, విల్లాలపై కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారని స్పేస్ విజన్ గ్రూప్ సీఎండీ టీవీ నరసింహారెడ్డి తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు, కొత్త రోడ్లు, మెట్రో కనెక్టివిటీలతో శివారు ప్రాంతాల నుంచి ప్రధాన నగరానికి ప్రయాణం సులువు కావడం దీనికి మరింత ఊతమిచ్చిందని చెప్పారు. హైదరాబాద్ నలువైపులా.. గతంలో పటాన్చెరు, బెంగళూరు జాతీయ రహదారుల మార్గంలో అభివృద్ధి ఉండేది. ఆయా ప్రాంతాల్లోనే వ్యక్తి గత గృహాలకు డిమాండ్ ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు హైదరాబాద్ నలువైపులా కొత్త రోడ్లు వచ్చాయి. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ లింక్ రోడ్లు ఏర్పడ్డాయి. విద్యుత్, నీరు వంటి మౌలిక వసతులు మెరుగయ్యాయి. దీంతో మెట్రో, 100 ఫీట్ల రోడ్లు ఉన్న మార్గాల్లో 10 కిలోమీటర్ల దూరం వరకు కూడా ఇండిపెండెంట్ గృహాలకు డిమాండ్ పెరిగింది. శ్రీశైలం హైవే, ముంబై రహదారి, బీజాపూర్ రోడ్, నాగ్‌పూర్ రోడ్డు, వరంగల్ హైవేలో ఘట్ కేసర్ వరకు కూడా వ్యక్తిగత గృహాలు, విల్లాలను కొనుగోలు చేస్తున్నారు. సాధారణంగా కొత్త ప్రాంతాల్లో ముందుగా ఇండిపెండెంట్ ఇళ్లు, విల్లాలు వచ్చి.. రద్దీ పెరిగాక అపార్ట్మెంట్ కల్చర్ ప్రారంభమవుతుందని యార్డ్స్ అండ్ ఫీట్స్ కన్సల్టెన్సీ ఎండీ కళిశెట్టి నాయుడు తెలిపారు. మారిన పరిస్థితులతో.. ఐటీ మినహా ఇతర రంగాల్లో కొత్త ఉద్యోగ నియామకాలు లేకపోవటం, పలు రంగాల్లో వర్క్ ఫ్రం హోమ్ విధానం అమలవుతుండటంతో హైదరాబాద్‌లో ఇళ్ల కొనుగోళ్లు తగ్గాయని రియాల్టీ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు బ్యాంకులు కూడా గతంలో తరహాలో గృహ రుణాలను మంజూరు చేయడం లేదు. గతేడాది 7.30 శాతం దాకా తగ్గిన వడ్డీ రేట్లు ప్రస్తుతం 8.25 శాతానికి పెరిగాయి. దీనికితోడు నిర్మాణ వ్యయాలూ పెరగడంతో.. ప్రజల ఇళ్ల కొనుగోలు శక్తి తగ్గిందని నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక తెలిపింది. ఈ ఏడాది జూలై–సెప్టెంబర్ (మూడో త్రైమాసికం) ముగింపు నాటికి బెంగళూరు, చెన్నై వంటి దక్షిణాది నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లోనే అత్యధిక గృహాల ఇన్వెంటరీ (అమ్ముడుపోకుండా ఉన్న ఇళ్లు) ఉండటం గమనార్హం. దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన నగరాల్లో 7.85 లక్షల అపార్ట్మెంట్లు అమ్ముడుపోకుండా ఉన్నాయని ప్రాప్ టైగర్ నివేదిక వెల్లడించింది. హైదరాబాద్‌లోని ఇళ్లే లక్షకుపైగా ఉన్నాయని తెలిపింది. దక్షిణాదిలో ఇన్వెంటరీ ఎక్కువగా ఉన్నది హైదరాబాద్‌లోనేనని తెలిపింది. ఇక మొత్తం దేశవ్యాప్తంగా చూస్తే.. 2,72,960 ఇళ్ల ఇన్వెంటరీతో ముంబై తొలిస్థానంలో ఉందని పేర్కొంది. -
రూ.21 లక్షలకు 170 గజాల్లో వ్యక్తిగత గృహాలు!
సాక్షి, హైదరాబాద్: మెట్రో నగరాలకు మాత్రమే పరిచయమైన పని దగ్గరే ఇల్లు (వాక్ టు వర్క్) కల్చర్ ద్వితీయ శ్రేణి పట్టణాలకూ పాకింది. దీని ప్రత్యేకత ఏంటంటే.. మెరుగైన మౌలిక వసతులతో పాటూ ఇంటికి దగ్గర్లోనే పని ప్రదేశం, స్కూల్, ఆసుపత్రి, సూపర్ మార్కెట్, సినిమా హాల్.. ఇలా ప్రతీ ఒక్కటీ ఉంటుందన్నమాట. ఇలాంటి ప్రాజెక్ట్‌లను కర్నూలు వాసులకూ పరిచయం చేసేందుకు సిద్ధమైంది రాగమయూరి నిర్మాణ సంస్థ. ఎకనామిక్ సిటీ పేరిట త్వరలోనే ప్రారంభంకానున్న ప్రాజెక్ట్ వివరాలను సంస్థ సీఎండీ కే జే రెడ్డి ‘సాక్షి రియల్టీ’తో పంచుకున్నారు. ♦ నన్నూరు గ్రామంలో రూ.1,660 కోట్ల పెట్టుబడితో 182 ఎకరాల్లో ఎకనామిక్ సిటీని అభివృద్ధి చేస్తున్నాం. దీని ప్రత్యేకత ఏంటంటే.. వ్యక్తిగత గృహాలతో పాటూ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్ఎంఈ)లకు స్థల కేటాయింపులుంటాయి. ♦ 182 ఎకరాల్లో ఎకనామిక్ సిటీలో.. 135 ఎకరాలు గృహాలకు, 47 ఎకరాలు పరిశ్రమలకు కేటాయించాం. ఫేజ్–1లో 40 ఎకరాల్లో గృహాలను, 10 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ స్థలాన్ని అభివృద్ధి చేస్తున్నాం. తొలి దశలో 1,500 గృహాలొస్తాయి. ♦ ఈడబ్ల్యూఎస్ గృహాలు 73 గజాల్లో 430 చ.అ. బిల్టప్ ఏరియాలో ఉంటుంది. ధర రూ.10 లక్షలు. ఇవి 4,640 యూనిట్లుంటాయి. ఎల్ఐజీ ఇళ్లు 133 గజాల్లో 650 చ.అ. బిల్టప్ ఏరియాలో ఉంటాయి. ధర రూ.16.50 లక్షలు. 1,680 యూనిట్లుంటాయి. ఎంఐజీ ఇళ్లు 170 గజాల్లో 850 చ.అ. బిల్టప్ ఏరియాలో ఉంటాయి. ధర రూ.21 లక్షలు. ఇవి 2,640 గృహాలుంటాయి. వీటితో పాటూ 300 చ.అ., 430 చ.అ.ల్లో అపార్ట్మెంట్లు కూడా ఉంటాయి. వీటి ప్రారంభ ధర రూ.5.40 లక్షలు. పీఎంఏవై సబ్సిడీ కూడా.. పీఎంఏవై సబ్సిడీ ఎకనామిక్ సిటీకి వర్తిస్తుంది. వార్షికాదాయం రూ.3 లక్షల లోపున్న కొనుగోలుదారులకు రూ.2.67 లక్షల సబ్సిడీ వస్తుంది. అలాగే ఎంఎస్ఎంఈ స్థల కొనుగోలుదారులకు స్థానిక ప్రభుత్వం అందించే రాయితీలు కూడా వర్తిస్తాయి. జీఎస్టీ, స్టాంప్ డ్యూటీ లేదు.. స్థానిక ప్రభుత్వం ఎకనామిక్ సిటీలో కొనుగోలు చేసే ఈడబ్ల్యూఎస్ గృహాలకు స్టాంప్ డ్యూటీ చార్జీలు, జీఎస్టీలను మినహాయింపునిచ్చింది. ఎల్ఐజీ, ఎంఐజీ గృహ కొనుగోలుదారులనూ నిరుత్సాహపర్చకూడదనే ఉద్దేశంతో ఈ గృహాల కస్టమర్ల స్టాంప్ డ్యూటీ చార్జీలను కంపెనీయే భరిస్తుంది. జీఎస్టీ మాత్రం కస్టమర్లే చెల్లించాల్సి ఉంటుంది. -
సొంతింటి ఎంపికకు చక్కటి వేదిక!
మార్చి 7,8న తాజ్‌కృష్ణాలో సాక్షి ప్రాపర్టీ షో సాక్షి, హైదరాబాద్: నగరంలో ఎప్పటికైనా సొంతిల్లుండాలని కలలు కనేవారికి ‘సాక్షి’ మరోసారి చక్కటి అవకాశాన్ని కల్పిస్తోంది. మార్చి 7,8 తేదీల్లో హోటల్ తాజ్‌కృష్ణాలో ప్రాపర్టీ షో నిర్వహించనుంది. నగరానికి చెందిన పలు స్థిరాస్తి సంస్థలు పాల్గొనే ఈ షోలో.. ప్లాట్లు, ఫ్లాట్లు, ఇండివిడ్యువల్ హోమ్స్, విల్లాలకు సంబంధించిన సమస్త సమాచారం లభిస్తుంది. మరెందుకు ఆలస్యం వెంటనే కుటుంబంతో సహా విచ్చేసి అన్ని విధాలా నచ్చిన ఇంటిని ఆనందంగా ఎంచుకోండి. ⇒ పనిచేసే ఆఫీసుకో, పిల్లాడి స్కూల్‌కో దగ్గరగా ఇల్లుండాలని కోరుకునే వారి సంఖ్య పెరిగింది. అక్కడి చుట్టుపక్కల ప్రాంతాలు మౌలికంగా అభివృద్ధి చెంది, చేరువలోనే షాపింగ్ మాల్, ఆసుపత్రి కూడా ఉండి, ధర కూడా అందుబాటులో ఉంటే చాలు వెంటనే నిర్ణయం తీసేసుకుంటున్నారు కొనుగోలుదారులు. ⇒ సాధారణంగా ఇళ్ల ధరలు ప్రీలాంచ్లో తక్కువగా ఉంటాయి. నిర్మాణం పూర్తయి, ఫ్లాట్లను అప్పగించే సమయంలో కాసింత ఎక్కువగా చెబుతారు. కారణాలేమైనప్పటికీ చెన్నై, బెంగళూరు, ముంబై వంటి నగరాలతో పోల్చుకుంటే హైదరాబాద్‌లో నేటీకీ ఇళ్ల ధరలు తక్కువగానే ఉన్నాయి. అంతేకాదు రాష్ట్రంలోని ఇతర నగరాలతో పోల్చుకుంటే కూడా నగరంలోనే అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో నిర్మాణ వ్యయం గణనీయంగా పెరిగింది. ప్రభుత్వానికి కట్టే పన్నులు, ఇతరత్రా రుసుములూ రెట్టింపయ్యాయి. అయినా ఇంటి అంతిమ ధరలను మాత్రం పెంచట్లేదు నిర్మాణ సంస్థలు. రానున్న రోజుల్లో మార్కెట్ వురింత మెరుగవుతోంది కాబట్టి, ధరలు పెరిగినా ఆశ్చర్యపడక్కర్లేదు. కాబట్టి, సొంతిల్లు కొనుక్కోవడానికి ఇదే మంచి తరుణం. ⇒ మెట్రో రైల్ పనులు శరవేగంగా జరుగుతుండటం, త్వరలోనే పూర్తి స్థాయిలో ఔటర్ రింగ్ రోడ్ అందుబాటులోకి రానుండటం, తెలంగాణ ప్రభుత్వం నగరం చుట్టూ ఫార్మా, ఫిల్మ్, హెల్త్, స్పోర్ట్స్, గేమ్, ఎడ్యుకేషన్ సిటీల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుండటం వంటివి స్థిరాస్తి రంగంలో ఆశలను రేపుతోంది. ఆయా ప్రాజెక్ట్‌లతో నగరానికి లక్షల కోట్ల పెట్టుబడులతో పాటు లక్షల సంఖ్యలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రానున్నాయి. దీంతో అపార్ట్మెంట్ల అమ్మకాలు పెరిగి, విల్లాల జోరు అధికమై, వాణిజ్య సముదాయాలకూ గిరాకీ రెట్టింపు కానుంది. మెయిన్ స్పాన్సర్: అపర్ణా కన్స్ట్రక్షన్స్ అసోసియేట్ స్పాన్సర్: ఆదిత్యా కన్స్ట్రక్షన్స్ కో-స్పాన్సర్స్: హిల్‌కౌంటీ ప్రాపర్టీస్, సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, సిరి సంపద ఫామ్స్ అండ్ ఎస్టేట్స్ పాల్గొనే సంస్థలు: సత్వా గ్రూప్, మంజీరా కన్స్ట్రక్షన్స్, ఎస్ఎంఆర్ బిల్డర్స్, శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్, జనప్రియ ఇంజనీర్స్, రాజపుష్ప ప్రాపర్టీస్, ప్రణీత్ గ్రూప్, నార్త్ స్టార్ హోమ్స్, సాకేత్ ఇంజనీర్స్, ఆక్సాన్ హౌజింగ్ సొల్యూషన్స్, ఫార్చూన్ ఇన్ఫ్రా డెవలపర్స్, గ్రీన్ హోమ్, ఎస్ఎల్ గ్రూప్, బీఆర్సీ ఇన్ఫ్రా, శతాబ్ధి టౌన్‌షిప్స్ ప్రై.లి., స్వర్ణ విహార్ ఇన్ఫ్రా, వర్ధన్ డెవలపర్స్, స్పేస్ విజన్, మ్యాక్ ప్రాజెక్ట్స్.