Indo Count Industries
-
జెట్ ఎయిర్వేస్- ఇండో కౌంట్.. గెలాప్
రుణాలు, నష్టాల ఊబిలో చిక్కుకున్న జెట్ ఎయిర్వేస్ టేకోవర్‌కు కల్రాక్ క్యాపిటల్- మురారీ లాల్ జలన్ ప్రతిపాదించిన రిజల్యూషన్‌కు రుణదాతల కన్సార్షియం ఆమోదముద్ర వేయడంతో జెట్ ఎయిర్వేస్ కౌంటర్ కొద్ది రోజులుగా ర్యాలీ బాటలో సాగుతోంది. కాగా.. మరోపక్క ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) క్యూ2లో ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో ఇటీవల జోరందుకున్న టెక్స్టైల్స్ కంపెనీ ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ షేరుకి డిమాండ్ కొనసాగుతోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో దూకుడు చూపుతున్నాయి. వివరాలు చూద్దాం.. జెట్ ఎయిర్వేస్ కంపెనీ పునరుద్ధరణకు కల్రాక్ క్యాపిటల్- మురారీ లాల్ జలాన్ కన్సార్షియం ప్రతిపాదించిన రిజల్యూషన్‌కు రుణదాతల కమిటీ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ప్రయివేట్ రంగ కంపెనీ జెట్ ఎయిర్వేస్ కౌంటర్ ఇటీవల నిరవధికంగా బలపడుతోంది. తాజాగా ఎన్ఎస్ఈలో ఈ షేరు 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 51.20 వద్ద ఫ్రీజయ్యింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. వరుసగా 12వ సెషన్లోనూ ఈ షేరు అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. వెరసి వారం రోజుల్లోనే ఈ షేరు 27 శాతం ర్యాలీ చేసింది. ఈ ఏడాది మార్చి 27న రూ. 13 వద్ద చరిత్రాత్మక కనిష్టాని నమోదు చేసుకున్న జెట్ ఎయిర్వేస్ షేరు గత 20 రోజుల్లో 108 శాతం దూసుకెళ్లడం గమనార్హం! ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ టెక్స్టైల్స్ రంగ కంపెనీ ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ వరుసగా నాలుగో రోజు అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఈ షేరు రూ. 7.8 ఎగసి రూ. 163.60 వద్ద ఫ్రీజయ్యింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. గత రెండు వారాల్లోనే ఈ షేరు 48 శాతం జంప్‌చేసింది. ఈ ఏడాది క్యూ2లో ఇండో కౌంట్ నికర లాభం 7 రెట్లు ఎగసి రూ. 81 కోట్లను తాకింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం 26 శాతం పెరిగి రూ. 714 కోట్లను తాకింది. నిర్వహణ లాభ మార్జిన్లు 3.5 శాతం బలపడి 17.5 శాతాన్ని తాకాయి. కాగా.. గత నెల రోజుల్లో ఇండో కౌంట్ షేరు 70 శాతం పురోగమించింది. ఆరు నెలల కాలాన్ని తీసుకుంటే ఏకంగా 469 శాతం ర్యాలీ చేయడం విశేషం! -
బెడ్ లినెన్ మార్కెట్లో 25% వాటా లక్ష్యం: ఐసీఆర్వీఎల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వచ్చే ఐదేళ్లలో దేశీ బెడ్ లినెన్ మార్కెట్లో 25 శాతం వాటా సాధించాలని ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ ఇండో కౌంట్ రిటైల్ వెంచర్స్ (ఐసీఆర్వీఎల్) లక్ష్యంగా నిర్దేశించుకుంది. ప్రస్తుతం రూ. 13,000 కోట్లుగా ఈ మార్కెట్ 2021 నాటికి రూ. 19,000 కోట్ల స్థాయికి చేరగలదని అంచనాలున్నట్లు కంపెనీ ఎండీ అసీమ్ దలాల్ వివరించారు. బుధవారమిక్కడ ‘బొటిక్ లివింగ్’ శ్రేణి బెడ్ లినెన్ ఉత్పత్తులను మార్కెట్లో ప్రవేశపెట్టిన సందర్భంగా దలాల్ ఈ విషయాలు చెప్పారు. వీటి ధర రూ. 2,000-రూ. 8,000 మధ్య ఉంటుంది. దేశీయంగా మార్కెటింగ్ నెట్వర్క్ మొదలైనవి పటిష్టం చేసుకునేందుకు రూ. 25 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు తెలిపారు. మొదటి ఏడాది సుమారు 200 స్టోర్స్ ఏర్పాటు చేయనున్నామని, వీటిలో దాదాపు 40 స్టోర్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఉండగలవని చెప్పారు. ఇప్పటిదాకా ఎగుమతుల ప్రధానంగా ఉన్న తమ సంస్థ తొలిసారిగా దేశీ బెడ్ లినెన్ మార్కెట్లోకి అడుగుపెడుతోందని, త్వరలో రూ. 500 కోట్ల అమ్మకాలు లక్ష్యంగా పెట్టుకున్నామని దలాల్ వివరించారు.