బెడ్ లినెన్ మార్కెట్లో 25% వాటా లక్ష్యం: ఐసీఆర్వీఎల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వచ్చే ఐదేళ్లలో దేశీ బెడ్ లినెన్ మార్కెట్లో 25 శాతం వాటా సాధించాలని ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ ఇండో కౌంట్ రిటైల్ వెంచర్స్ (ఐసీఆర్‌వీఎల్) లక్ష్యంగా నిర్దేశించుకుంది. ప్రస్తుతం రూ. 13,000 కోట్లుగా ఈ మార్కెట్ 2021 నాటికి రూ. 19,000 కోట్ల స్థాయికి చేరగలదని అంచనాలున్నట్లు కంపెనీ ఎండీ అసీమ్ దలాల్ వివరించారు. బుధవారమిక్కడ ‘బొటిక్ లివింగ్’ శ్రేణి బెడ్ లినెన్ ఉత్పత్తులను మార్కెట్లో ప్రవేశపెట్టిన సందర్భంగా దలాల్ ఈ విషయాలు చెప్పారు.
వీటి ధర రూ. 2,000-రూ. 8,000 మధ్య ఉంటుంది. దేశీయంగా మార్కెటింగ్ నెట్‌వర్క్ మొదలైనవి పటిష్టం చేసుకునేందుకు రూ. 25 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు తెలిపారు. మొదటి ఏడాది సుమారు 200 స్టోర్స్ ఏర్పాటు చేయనున్నామని, వీటిలో దాదాపు 40 స్టోర్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఉండగలవని చెప్పారు. ఇప్పటిదాకా ఎగుమతుల ప్రధానంగా ఉన్న తమ సంస్థ తొలిసారిగా దేశీ బెడ్ లినెన్ మార్కెట్లోకి అడుగుపెడుతోందని, త్వరలో రూ. 500 కోట్ల అమ్మకాలు లక్ష్యంగా పెట్టుకున్నామని దలాల్ వివరించారు.