విందు విమానం
తారలు దిగివచ్చిన వేళ... మల్లెలు నడిచొచ్చిన వేళ..
పాత సినిమా పాట ఇది. చైనాలోని వుహాన్ ప్రజలు ఇప్పుడీ పాటే పాడుతున్నారు. కాకపోతే విమానం దిగివచ్చిన వేళ అని మార్చుకుని! ఎందుకలా? అన్నదేనా మీ సందేహం. లి.. లియంగ్ అనే వ్యాపారవేత్త ఐడియా ఫలితమిది. ఈయనగారికి అసలు సిసలైన విమానంలో హోటల్ పెట్టాలన్న ఆలోచన వచ్చింది. అంతే... ఇండోనేసియా ఎయిర్‌లైన్స్ రిటైర్మెంట్ ప్రకటించిన ఓ విమానాన్ని దాదాపు రూ.35 కోట్లు పెట్టి కొనేశారు.
ఇంకో రూ.21 కోట్లు ఖర్చుపెట్టి దీన్ని ఇండోనేసియా నుంచి చైనాకు తరలించారు. విమానం మొత్తాన్ని విప్పదీసి 70 కంటెయినర్లలో రవాణా చేసేందుకు, మళ్లీ జోడించేందుకు ఇంత ఖర్చయిందట. వుహాన్‌లోని ఆప్టిక్స్ వ్యాలీ వీధిలో ఏర్పాటు చేసిన ఈ విమాన రెస్టారెంట్లో భోంచేయాలంటే మన కరెన్సీలో ఒక్కొక్కరు రూ.2,000 - రూ.3,000 చెల్లించాల్సి ఉంటుంది. కేబిన్ మొత్తాన్ని హోటల్‌గా మార్చేయగా.. కాక్‌పిట్‌ను మాత్రం ఫ్లయింగ్ సిములేటర్‌గా మార్చేశారు. అంటే సుష్టుగా భోంచేసిన తరువాత సరదాగా కాసేపు విమానం నడిపిన అనుభూతి కూడా పొందవచ్చునన్నమాట. ఇందుకోసం మరో రూ.4,000 వరకూ చేతి చమురు వదులుతుందన్నమాట!