industrial city
-
కుప్పకూలిన భారీ క్రేన్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/సాక్షి, విశాఖపట్నం: విశాఖ పారిశ్రామిక నగరంలో విషాదం చోటుచేసుకుంది. నౌకా నిర్మాణ కేంద్రం హిందుస్థాన్ షిప్‌యార్డులో శనివారం ఉ.11.50 గంటలకు భారీ క్రేన్ కుప్పకూలడంతో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 10 మంది విగతజీవులుగా మారారు. 70 టన్నుల సామర్థ్యం ఉన్న క్రేన్ శిథిలాల కింద చిక్కుకున్న వీరంతా విలవిల్లాడుతూ మృత్యుఒడిలోకి జారుకున్నారు. షిప్‌యార్డు పూర్తి నిషేధాజ్ఞలున్న ప్రాంతం కావడంతో మృతుల కుటుంబాలను సైతం లోపలికి అనుమతించలేదు. మృతుల్లో నలుగురు షిప్‌యార్డుకి చెందిన రెగ్యులర్ ఉద్యోగులు కాగా, మిగిలిన వారంతా క్రేన్ నిర్వహణకు సంబంధించి ఏజెన్సీ సిబ్బందిగా గుర్తించారు. ట్రయల్ రన్ జరుగుతుండగా.. భారత రక్షణ రంగ సంస్థ ఆధీనంలో ఉన్న హిందూస్థాన్ నౌకా నిర్మాణ కేంద్రంలో శనివారం ట్రయల్ రన్ జరుగుతుండగా ఈ భారీ క్రేన్ కుప్పకూలింది. నాలుగేళ్ల క్రితం షిప్‌యార్డు ‘వార్ఫ్/లెవల్ లఫింగ్ క్రేన్’ నిర్మాణానికి ముంబైకి చెందిన అనుపమ్ క్రేన్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇది భారీ లిఫ్టింగ్ సామర్థ్యం కలిగి ఉంటుంది. రెండేళ్ల క్రితం దీని కమిషనింగ్ పూర్తయింది. అయితే.. ఫుల్ లోడెడ్ ట్రయల్ అప్పట్లో నిర్వహించలేదు. కార్యకలాపాలు ప్రారంభించకుండానే సంస్థతో ఒప్పందం రద్దుచేసుకుంది. అప్పటి నుంచి క్రేన్ జెట్టీలోనే నిలిచిపోయింది. తాజాగా.. ఈ క్రేన్‌ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు హెచ్ఎస్ఎల్ (హిందుస్తాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్).. గ్రీన్‌ఫీల్డ్స్ కార్పొరేషన్, లీడ్ ఇంజినీర్స్, క్వాడ్ సెవెన్ సెక్యూరిటీస్ సర్వీసెస్ సంస్థలతో ఒప్పందం చేసుకుంది. ఈ సంస్థలకు చెందిన సిబ్బందితో పాటు షిప్‌యార్డు రెగ్యులర్ ఉద్యోగులు మూడ్రోజుల నుంచి క్రేన్ సామర్థ్యానికి సంబంధించిన ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. తొలిరోజు గురువారం 10 టన్నుల బరువు.. శుక్రవారం 20 టన్నుల బరువును లిఫ్ట్చేసేలా ట్రయల్ రన్ చేపట్టారు. ఇక శనివారం 30 టన్నుల సామర్థ్యం ఎత్తేందుకు ప్రయత్నించగా క్రేన్ కుప్పకూలింది. క్యాబిన్, బేస్ పోర్షన్లు రెండూ ఒక్కసారిగా విరిగిపోయాయి. ప్రమాద సమయంలో క్రేన్‌లో విధులు నిర్వర్తిస్తున్న 10 మంది అక్కడికక్కడే మృతిచెందినట్లు అధికారులు చెబుతున్నారు. క్రేన్ శి«థిలాల కింద చిక్కుకున్న మృతదేహాల్ని వెలికితీసేందుకు రక్షణ శాఖ సిబ్బందికి సుమారు రెండు గంటలు పట్టింది. షిప్‌యార్డు 75 ఏళ్ల చరిత్రలో ఈ తరహా ప్రమాదం సంభవించడం ఇదే తొలిసారి అని అధికారులు దిగ్భ్రాంతి వ్యక్తంచేస్తున్నారు. కాగా, ఘటనపై మల్కాపురం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రమాదంపై విచారణకు కమిటీలు ప్రమాదంపై ప్రభుత్వం తక్షణమే స్పందించింది. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రమాదానికి గల కారణాలు విచారించేందుకు రెండు ఉన్నతస్థాయి కమిటీలు ఏర్పాటు చేసింది. హెచ్ఎస్ఎల్ ఆపరేషనల్ డైరెక్టర్ నేతృత్వంలో ఏడుగురు అధికారులతో కలిసి అంతర్గత కమిటీ ఏర్పాటుచేస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. ప్రభుత్వం తరఫున కూడా హైలెవల్ కమిటీ ఏర్పాటు చేశారు. దుర్ఘటనపై రాజ్‌నాథ్ దిగ్భ్రాంతి దుర్ఘటనపై శనివారం కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ట్విటర్లో దిగ్భ్రాంతి, తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఘటనపై శాఖాపరమైన దర్యాప్తునకు కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తక్షణ చర్యలు తీసుకోండి : సీఎం విశాఖలో క్రేన్ ప్రమాదంపై సీఎం వైఎస్ జగన్ ఆరా తీశారు. ఘటన వివరాలను తెలుసుకున్న ఆయన తక్షణం అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, నగర పోలీస్ కమిషనర్‌ను ఆదేశించారు. మృతులు వీరే.. షిప్‌యార్డు ఉద్యోగులు.. సూపర్వైజర్ దుర్గాప్రసాద్ (32), ఐజీసీ వెంకటరమణ (42), సత్తిరాజు (51), టి. జగన్మోహన్రావు (41). గ్రీన్‌ఫీల్డ్ కార్పొరేషన్ సిబ్బంది.. ఎంఎన్ వెంకట్రావు (35), పీలా శివకుమార్ (35), బి. చైతన్య (25). లీడ్ ఇంజినీర్స్ సంస్థ సిబ్బంది.. పల్లా నాగదేముళ్లు (35), పి.భాస్కరరావు (35). క్వాడ్–7 సంస్థ ఉద్యోగి టి. వెంకటరత్నం (43). ప్రస్తుతం 10 మంది మాత్రమే మృతిచెందినట్లు ఆర్డీవో పెంచల్ కిశోర్ చెప్పారు. శిథిలాలు కింద ఎవరూ లేరనీ.. ఒకవేళ ఎవరైనా ఉన్నట్లైతే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. క్రేన్ పక్కకి ఒరిగిపోవడంవల్లే.. ప్రమాదంపై హిందూస్థాన్ షిప్‌యార్డు స్పందించింది. ఇది దురదృష్టకరమైన ఘటన అంటూ ప్రకటన విడుదల చేసింది. లోడ్ టెస్టింగ్ సమయంలో క్రేన్ పక్కకి ఒరిగిపోవడంవల్లే ఈ ప్రమాదం సంభవించిందని పేర్కొంది. ప్రమాద కారణాలపై విచారణ చేపడుతున్నట్లు షిప్‌యార్డు అధికారులు ఆ ప్రకటనలో తెలిపారు. -
ఐదేళ్లలో రూ.70 వేల కోట్ల పెట్టుబడులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔరంగాబాద్ ఇండస్ట్రియల్ సిటీ (ఏయూఆర్ఐసీ) దేశంలోనే తొలి గ్రీన్‌ఫీల్డ్ పారిశ్రామిక కేంద్రాన్ని అభివృద్ధి చేస్తోంది. ఢిల్లీ–ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (డీఎంఐసీడీసీ), మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంఐడీసీ) భాగస్వామ్యంతో 10వేల ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఐదేళ్లలో ఇక్కడ రూ.70 వేల కోట్ల పెట్టుబడులు, 3 లక్షల ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తున్నట్లు ఏయూఆర్ఐసీ జాయింట్ ఎండీ గజానన్ పాటిల్ బుధవారమిక్కడ రోడ్ షో సందర్భంగా విలేకరులతో చెప్పారు. తొలి దశలో కొరియా, స్వీడన్, జర్మనీ దేశాలకు చెందిన పలు ఇంజనీరింగ్ కంపెనీలకు 5,07,164 లక్షల చ.మీ. (52 ప్లాట్లు) స్థలాన్ని కేటాయించామని, వీటి ద్వారా రూ.6 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని పాటిల్ తెలిపారు. దక్షిణ కొరియాకు చెందిన హోయ్‌సంగ్ కార్పొరేషన్ రూ.3 వేల కోట్ల పెట్టుబడులు పెట్టిందని, జూన్‌లో ప్లాంట్‌లో ఉత్ప త్తుల తయారీ ప్రారంభమవుతుందని తెలియజేశారు. హైదరాబాద్ నుంచి ఐటీ కంపెనీలు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఐటీ, ఫార్మా కంపెనీలతో చర్చలు జరుపుతున్నామని, వీటితో పాటు ఫుడ్ ప్రాసెసింగ్, ఇంజనీరింగ్, ఆటో మొబైల్లో అపార అవకాశాలున్నాయని పాటిల్ తెలి యజేశారు. ఏయూఆర్ఐసీ మౌలిక వసతుల అభివృద్ధి కోసం కేంద్రం రూ.7947 కోట్ల నిధులను కేటా యించిందని, 60 శాతం స్థలాన్ని పారిశ్రామిక అవసరాలకు, 40 శాతం స్థలాన్ని నివాస, వాణిజ్య, సామా జిక అవసరాలకు కేటాయించమని చెప్పారు. చ.మీ. కు ధర రూ.3200గా నిర్ణయించామని తెలియ జేశారు. ఆన్లైన్ ద్వారా సింగిల్ విండోలో 10 రోజుల్లో అనుమతులను జారీ చేస్తున్నామన్నారు. -
పారిశ్రామిక నగరంగా ఓర్వకల్లు
ఓర్వకల్లు: కర్నూలు నగరానికి అతి సమీపంలోని ఓర్వకల్లు మండలాన్ని పారిశ్రామిక నగరంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. ఆదివారం మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రితో పాటు, పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత, జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్, జిల్లా కలెక్టర్ విజయమోహన్, మాజీ మంత్రులు కేఈ ప్రభాకర్, ఎన్ఎండీ ఫరూక్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో ముందుగా స్థానిక అల్లాబకాష్ దర్గా వద్దకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడినుంచి దర్గా పక్కనే గల ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సేకరించిన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మండల సమాఖ్య గౌరవ అధ్యక్షురాలు విజయభారతి అధ్యక్షతన నిర్వహించిన మహిళా బ్యాంకు విజయోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. సభను ప్రారంభించిన కొద్దిసేపటికే వర్షం కురవడంతో ఉపముఖ్యమంత్రి ప్రసంగానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ఎంఎంఎస్ కార్యాలయ భవనంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు. ప్రపంచ ఖ్యాతిని సంపాదించుకున్న ఓర్వకల్లు పొదుపు మహిళల పురోగతి ప్రశంసనీయమన్నారు. పొదుపు సంఘాల నిర్వహణ, పాలన సౌలభ్యం కోసం అన్ని గ్రామాల్లో సొంత భవనాలు నిర్మాణానికి ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. అనంతరం మండలంలోని ఓర్వకల్లు, ఉప్పలపాడు, ఉయ్యాలవాడ, లొద్దిపల్లె గ్రామాల్లో ఐక్య సంఘం భవన నిర్మాణాలకు ఎంపీ ల్యాడ్స్ నుంచి మంజూరైన రూ.కోటి చెక్కును ఉపముఖ్యమంత్రి వారికి అందజేశారు. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి పొదుపు మహిళలు రూ.10 లక్షలు ఈ సందర్భంగా విరాళంగా అందజేశారు. కార్యక్రమంలో జిల్లాపరిషత్ వైస్ చైర్మన్ పుష్పావతి, ఎంఎంఎస్ గౌరవ సలహాదారురాలు విజయభారతి, పలువురు జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.